నేను రేవంత్​ రెడ్డిని ఎవ్వరినీ వదల..కేసీఆర్ తో నాకు పోలికేంటి.?: సీఎం రేవంత్ రెడ్డి

నేను రేవంత్​ రెడ్డిని ఎవ్వరినీ వదల..కేసీఆర్ తో నాకు పోలికేంటి.?: సీఎం రేవంత్ రెడ్డి
  • కేసీఆర్​లా ఆరంభ శూరత్వం కాదు.. ఆయనతో పోలికేంటి?: సీఎం రేవంత్​
  • నా కుటుంబం కబ్జా చేసినట్టు చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తా
  • ఐదు రోజుల్లో మరిన్ని కూల్చివేతలు
  • ఎన్నికల అఫిడవిట్​లో జన్వాడ ఫామ్​హౌస్​ గురించి దాచినందుకు కేటీఆర్​పై అనర్హత వేటు వేయాలి
  • అక్రమ నిర్మాణాలు చేసిన బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేయాలి 
  • తెలంగాణ వచ్చిన తర్వాత చెరువుల రికార్డులు మాయం 
  • హరీశ్​రావు ఒప్పుకుంటే ఆయన అధ్యక్షతనే నిజ నిర్ధారణ కమిటీ 
  • మీడియాతో సీఎం చిట్​చాట్​


హైదరాబాద్, వెలుగు:హైడ్రా కూల్చివేతలపై వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్​ రెడ్డి తేల్చి చెప్పారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆపాలంటూ తనపై చాలా రకాలుగా ఒత్తిడి తెస్తున్నారని, అయినా ఆపేది లేదని స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన తర్వాత సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​ రెడ్డి మీడియాతో చిట్​ చాట్​ చేశారు. ఈ సందర్భంగా హైడ్రా, రుణమాఫీ, కవితకు బెయిల్​తదితర అంశాలపై మాట్లాడారు. ‘‘ఆరంభ శూరత్వం అని.. ఏదో ఒకటి రెండు కూల్చేసి ఆపేస్తారని అంటున్నరు. గతంలో కేసీఆర్​ కూడా ఇట్లనే అయ్యప్ప సొసైటీలో కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేసి, తర్వాత ఆపేశారని.. ఇప్పుడు అట్లనే అయితదని అనుకుంటున్నరు. నేను రేవంత్​ రెడ్డిని.. కేసీఆర్​కు నాకు పోలిక ఏంటి? చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు ఆక్రమించి కట్టిన నిర్మాణాలు ఎవరివైనా సరే.. ఎంతటి వాళ్లవైనా సరే.. 30 ఏండ్ల కిందటిదైనా.. మూడేండ్లదైనా కూల్చివేస్తం. ఇందులో ఏ అనుమానం అక్కర్లేదు.  ఓల్డ్ సిటీ కాదు ఏ సిటీ అయినా వెనక్కి తగ్గేది లేదు.. ఒవైసీ బిల్డింగులైనా.. ఇంకెవరిదైనా సరే అక్రమమైతే కూల్చడమే.. ఐదు రోజుల్లో మరిన్ని కూల్చివేతలు ఉంటాయి” అని స్పష్టం చేశారు. 

Also Read:-ఎస్‌బీఐ చైర్మన్​గా పగ్గాలు చేపట్టిన గద్వాల్​ బిడ్డ

 ‘‘నా తమ్ముళ్లవి అక్రమ నిర్మాణాలున్నాయని, నాపైన ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే ఆధారాలతో చూపించాలి. నిజమైతే వాటిని కూడా కూల్చేస్తాం” అని సీఎం స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సభ్యుడి నిర్మాణాన్నే మొదట కూల్చాం..

పార్టీలో చేరికల కోసం కూల్చివేతలు చేస్తున్నారని కొం దరు ఆరోపిస్తున్నారని, అట్లా అనుకుంటే హైడ్రా మొదట కూల్చిందే కాంగ్రెస్​ సీడబ్ల్యూసీ లీడర్​ పల్లంరాజు నిర్మాణమని సీఎం గుర్తుచేశారు. తమకు కావాల్సినంత బలం ఉందని, ఎవరినీ భయపెట్టి పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ సపోర్ట్​ వల్లే కవితకు ఇంత తొందరగా బెయిల్ వచ్చిందని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ఓట్ల బదలాయింపునకు ఒప్పందం చేసుకొని, బీజేపీ 8 సీట్లు గెలిచిందని, ఈ విషయం తాను ఆనాడే చెప్పానని తెలిపారు.  ఇచ్చిన మాట ప్రకారం కమిట్​మెంట్​తో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామని, ఈ అంశంలో సవాల్​కు సిద్ధమని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. రుణమాఫీపై ధర్నాలు చేసేది బీఆర్ఎస్ కార్యకర్తలేనని, బీఆర్ఎస్ ధర్నాల్లో రైతులు లేరని అన్నారు. ‘‘హరీశ్​రావు, కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు తిరగండి. రుణమాఫీకాని రైతుల లిస్టు తయారు చేసి కలెక్టర్లకు ఇచ్చి పదేండ్లు చేసిన పాపాలను కడుక్కోండి” అని చురకలంటించారు. 

వాళ్లను కేటీఆర్​ సస్పెండ్​ చేయాలి

ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాల తొలగింపే తమ లక్ష్యమని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.  ఇందులో మొదట చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై దృష్టిపెట్టామని, తర్వాత బఫర్ జోన్లు, నాలాలు, పార్కులతో పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికి హైడ్రా.. హైదరాబాద్ కే పరిమితమని, దీనికి పోలీస్ స్టేషన్ స్థాయిని కల్పిస్తున్నామని, అందువల్ల కొన్ని ఫిర్యాదులను హైడ్రా కూడా స్వయంగా స్వీకరించే అవకాశం ఉంటుందని చెప్పారు..  ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) బయట ఉన్న కొన్ని గ్రామపంచాయతీలు కూడా హైడ్రా పరిధిలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, పార్టీలో చేరికలకు ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను కాంగ్రెస్​లో చేర్చుకోవడం కాదని, అసలు చెరువులను కబ్జా పెట్టి, నిర్మాణాలను చేపట్టినవారిని కేటీఆరే సస్పెండ్ చేయాలని అన్నారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, మర్రి రాజశేఖర్​రెడ్డి .. ఇలా ఎవరినీ  ఉపేక్షించకూడదన్నారు. అప్పుడు మున్సిపల్​ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. ఇలాంటి కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్​ ప్రశ్నించారు. ఇక చెరువుల్లో కొంత భాగాన్ని ఆక్రమించి, నిర్మించిన విద్యాసంస్థలకు సైతం ఎలాంటి మినహాయింపు లేదని, ఇప్పుడు విద్యా సంవత్సరం నడుస్తున్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనలో ఉన్నామని, ఆ తర్వాతైనా నిర్మాణాలు కూల్చివేస్తామని చెప్పారు. విద్యాసంస్థలు లేదా మరొ క నిర్మాణమంటూ మినహాయింపులు ఇచ్చుకుంటూ వెళ్తే.. చివరికి ట్యాంక్​బండ్​ మీద కూడా నిర్మాణాలు చేపడతారని అన్నారు. 

 చెరువుల రికార్డులు మాయం

హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల పరిరక్షణ కు ఒక విభాగం ఉన్నదని, ఇప్పుడా విభాగం చెరువుల వివరాలన్నింటినీ సేకరిస్తున్నదని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు.  తెలంగాణ వచ్చిన తర్వాత రికార్డులు మాయం చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఉమ్మడి ఏపీలో ఉన్న రికార్డులు, ఇప్పుడున్న రికార్డులతో  సరిచూస్తున్నట్టు తెలిపారు. చెరువుల స్థలాలను ఆక్రమించి, చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు కూడా ఎప్పటికప్పుడు జిల్లాల కలెక్టర్లకు సూచిస్తున్నదని, ఇప్పటికీ ఆక్రమణకు గురైన చెరువులపై హైకోర్టులో ఒక టీమ్ ప్రతినెలా రిపోర్టు తీసుకుంటూ, మానిటరింగ్ చేస్తున్నదని తెలిపారు. ఇక హైడ్రాకు జ్యుడీషియల్ పరిధి ఉన్నదని, దాని పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు. కాగా చెరువుల్లో, కుంటల్లో,  ప్రభుత్వ భూముల్లోని ఆక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని,  హైదరాబాద్ రాయదుర్గం దగ్గరున్న లీడ్​క్యాప్ స్థలంలో నిర్మించిన ఓ భవనాన్ని కూల్చివేసిన విషయాన్ని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.

వాల్మీకి కేసులో బీఆర్ఎస్​ నేతలకే లింక్​ ఉండొచ్చు!

కర్నాటక రాష్ట్రంలోని ‘వాల్మీకి’ కేసులో తెలంగాణలోని కొంతమందికి నిధులు అందాయంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. ‘‘వాల్మీకి స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాకు సంబంధం లేదు. తెలంగాణలో ఖాతాలు ఉన్నం త మాత్రాన మాకు సంబంధం ఉంటుందా?  వాల్మీకి స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్ నేతలకే లింకులు ఉండొచ్చు. డ్రగ్స్ కోసం కొందరు బీఆర్ఎస్ నేతలు బెంగళూరు వెళ్లడం అందరికీ తెలిసిందే’’ అని చురకలంటించారు.  త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు.  ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి చేసిన రూ.2,500 కోట్ల చెల్లింపులపై స్పందిస్తూ..  ఏపీ హయాంలో పలు నిర్మాణాల కోసం కార్పొరేషన్లు తీసుకున్న రుణాలకు చెల్లించాల్సినవని, ఆ చెల్లింపులు పూర్తికాకముందే రాష్ట్ర విభజన జరిగిందని రేవంత్​ అన్నారు. అప్పటినుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమే అసలు, వడ్డీ చెల్లిస్తున్నదని, అయితే అసలుతో పాటు ఇప్పటివరకు చెల్లించిన వడ్డీని కలిపి ఇవ్వాలని ఏపీ కోరుతున్నదని, కానీ జనాభా ప్రాతిపదికన చెల్లిస్తామని చెప్పుకుంటూ గత ప్రభుత్వం కాలం వెళ్లదీసిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేండ్లుగా ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని స్పష్టంచేశారు.

ప్రతిపక్ష నేత కేసీఆర్ ఉన్నారా!

తమ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని, ఎవరికైనా ప్రభుత్వ విధానాలు నచ్చి వస్తే పార్టీలో చేర్చుకుంటామని సీఎం రేవంత్​ చెప్పారు. కన్నకొడుకు కేటీఆర్నే కన్నతండ్రి కేసీఆర్ నమ్మడం లేదని అన్నారు. ‘‘అసెంబ్లీలో సమాధానం చెప్పేందుకు కేసీఆర్ అవసరం లేదు.. తాము చాలంటూ కేటీఆర్ మాట్లాడారు. ఆ మరుసటి రోజే.. కేసీఆర్ వచ్చారు. దాంతోనే కేటీఆర్ పై కేసీఆర్​కు ఎంత నమ్మకముందో అర్థమవుతున్నది” అని రేవంత్​ చురకలంటించారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతని, ఆయన బయటకు రావాలని, ప్రజల కోసం పోరాటం చేయాల న్నారు. ‘‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రతిపక్ష నేత హోదాలో జీతం ఇస్తున్నాం. అలవెన్సులు అన్నింటినీ తీసుకుంటున్నప్పుడు పనిచేయాలి కదా? ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటూ పనిచేయకపోతే ఎలా?’’ అని సీఎం ప్రశ్నించారు.
 
రుణమాఫీలో మా ప్రభుత్వానిది ట్రాక్​ రికార్డు 

రుణమాఫీలో తమ ప్రభుత్వం ట్రాక్ రికార్డు సృష్టించిం దని, గత ప్రభుత్వం ఐదేండ్లలో (2018-–2023) రూ. లక్ష రుణమాఫీ కింద 23.61 లక్షల ఖాతాలకు రూ.13,329 కోట్లు  మాఫీ చేస్తే.. తమ ప్రభుత్వం 27 రోజుల్లోనే 22.37 లక్షల ఖాతాలకు రూ.17,934 కోట్ల మేర రూ.2లక్షల రుణమాఫీ చేసిందని చెప్పారు. రూ. 2 లక్షలకు పైన రుణం ఉన్న రైతులు ఆపై మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తే .. వారి రుణం మాఫీ అవుతుందన్నారు. ఈ విషయంలో రైతులు  ఆందోళన చెందాల్సిన అవ సరం లేదన్నారు. నిజమైన రైతులందరికీ న్యాయం జరుగుతుందని, ఎవరికైనా మాఫీ అందకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్​లో  ఫిర్యాదు చేస్తే,  పరిష్కారానికి చర్యలుంటాయని తెలిపారు. రుణమాఫీ అనేది తాను వ్యకిగతంగా రైతులకు ఇచ్చిన కమిట్​మెంట్​ అని, అందుకోసమే ఆగస్టు14వరకు అమెరికా పర్యటనలో ఉన్నా రాష్ట్రానికి వచ్చి 15నాడు రైతులకు మాఫీ పథకాన్ని అందించినట్టు చెప్పారు. 

బీఆర్ఎస్​ లీడర్లకూ మాఫీ అయింది

ఇప్పటివరకు మాఫీ అందుకున్నవారిలో బీఆర్ఎస్ లీడ ర్లు కూడా ఉన్నారని, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూ డా రూ.లక్షన్నర రుణమాఫీ అందుకున్నారని సీఎం రేవంత్​ రెడ్డి  తెలిపారు. వాస్తవానికి మాఫీ కోసం రూ.31వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి, ఆ మొత్తానికే పాలనాపరమైన అనుమతులు ఇచ్చామని చెప్పారు. ఎవరెవరికి మాఫీ కాలేదన్న వివరాలను బీఆర్ఎస్ సేకరించి ఇస్తే తీసుకుంటామని, కేటీఆర్, హరీశ్ ఇద్దరూ ఆ వివరాలను సేకరించి జిల్లాలోని కలెక్టర్లకు సమర్పిస్తే.. గతంలో చేసిన పాపంలో కొంత మేరకైనా కడుక్కునేందుకు అవకాశం ఉంటుందని చురకలంటించారు. మాజీ మంత్రి కేటీఆర్.. కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్తానంటే స్వాగతిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ కేటీఆర్ కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి అక్కడ రైతులతో మాట్లాడాలి.   వివరాలు తీసుకుని ఇచ్చినా.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం” అనిస్పష్టంచేశారు. ఎవరేం చేసినా.. అంతిమంగా ప్రజలకు మేలు జరగాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.  రైతుభరోసా కూడా తమ దృష్టిలో ఉందని చెప్పారు.

ఫామ్​హౌస్​కు సర్పంచ్ అనుమతి ఇస్తడా?

జన్వాడలోని కేటీఆర్ ఫామ్​హౌస్ ఆక్రమణలోనే ఉన్నదంటూ.. తాను 2020లోనే ఆధారాలతో సహా బయట పెట్టిన విషయాన్ని సీఎం రేవంత్​ రెడ్డి  గుర్తుచేశారు. ‘అప్పుడే కూలగొడతామన్నారు. ఇప్పుడు 2024 వచ్చింది. అయినా ఎందుకు కూలగొట్టలేదు’ అని ప్రశ్నించారు. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులను సమాజం ఆదర్శంగా తీసుకుంటుందని,  అలాంటి వాళ్లే ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే ఎలా? అని ప్రశ్నించారు.  ‘‘జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు.. లీజ్​కు తీసుకున్నా అని కేటీఆర్ అంటున్నారు. కానీ ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్​లో పొందుపర్చారా?” అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలు దాచినందుకు కేటీఆర్​పై అనర్హత వేటు వేయాలని అన్నారు. ఆ నిర్మాణానికి సర్పంచ్ అనుమతి ఉందని అంటున్నారని, వాస్తవానికి అనుమతినిచ్చే అధికారం సర్పంచ్​కు ఉండదని, పంచాయతీ సెక్రటరీకి మాత్రమే ఆ పవర్​ ఉంటుందని స్పష్టం చేశారు.

హైడ్రాను హడావుడిగా తేలే.. ఎప్పటికీ ఉంటది.. 

హైడ్రా తాత్కాలిక అవసరాల కోసమో.. నామమాత్రపు హడావుడి కోసమో తెచ్చింది కాదని, ప్రజాప్రయోజనాల కోసమే తీసుకువచ్చామని, ఎప్పటికీ ఉంటదని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. చెరువులు, బఫర్ జోన్లలో ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టడం వల్లే చిన్న వర్షానికి కూడా హైదరాబాద్​లో ట్రాఫిక్ జామ్ అవుతున్నదని, అందువల్లే కట్టడాలను కూల్చివేస్తున్నామని తెలిపారు. పైగా చెరువుల్లోనూ నిర్మాణాలు చేసుకుం టూ పోతే ఎలా? అంటూ కోర్టులు కూడా ప్రశ్నిస్తున్నాయని అన్నారు. హైకోర్టు సీజే చెరువులపై పీరియాడికల్​గా కలెక్టర్ల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నారని తెలిపారు. నగర తాగునీటికి సంబంధించిన హిమాయత్ సాగర్, ఉస్మాన్​ సాగర్ రెండింటినీ కాపాడడమే తమ లక్ష్యమని, ఇవి హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు పరిధిలో ఉన్నాయన్నారు. వీటి పరిధిలో నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదన్నారు.  కొందరు పట్టా భూములు అని మాట్లాడుతున్నారని, చెరువు శిఖం పట్టా భూమి అయినప్పటికీ వాటిలో నిర్మాణాలు చేపట్టకూడదన్నారు. నీళ్లు లేనప్పుడు ఆ శిఖం భూముల్లో కేవలం ఆరుతడి పంటలు వేసుకుంటారని స్పష్టతనిచ్చారు. ఆ భూముల్లో నిర్మాణాలు చేసి.. ఇప్పుడు పట్టా భూములు అని అంటే రూల్స్​ఒప్పుకోవని చెప్పారు.

అక్రమంగా రెగ్యులరైజ్​ చేసుకున్న భూములన్నీ నిషేధిత జాబితాలో..

ఇక 58, 59 జీవో కింద క్రమబద్ధీకరించుకున్న ప్రభుత్వ భూములను నిషేధిత జాబితాలో పెట్టామని సీఎం రేవంత్​ తెలిపారు. 111 జీవోను గత ప్రభుత్వం కేవలం వ్యాపారం చేసుకునేందుకే ఎత్తివేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. 111జీవో ప్రాంతం పరిధిలో సుప్రీంకోర్టు ఆదేశాలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలున్నాయని, వాటి ఆదేశాలను పూర్తిగా పాటించకుండా ఆ జీవోలో కొంచెంకూడా మార్పులు చేయడానికి అవకాశం లేదని అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్​లోనే నిర్మిస్తామని స్పష్టంచేశారు. గోషామహల్​లో ఉన్న పోలీసు శాఖకు సంబంధించిన విభాగాన్ని వేరే చోటకి తరలిస్తామని అన్నారు. సుంకిశాలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, తదుపరి అంశాలపైనా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఓఆర్ఆర్​ టెండర్​పైన నివేదికను తెప్పించుకుంటున్నామని, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లనున్నట్టు తెలిపారు. 

హరీశ్​రావు హయాంలోనే కమిషన్ ​కాకతీయ

గత ప్రభుత్వ హయాంలో హరీశ్​రావు  ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారని, ఆయన హయాం లోనే కమిషన్ కాకతీయను తీసుకువచ్చారని సీఎం రేవంత్​ ఎద్దేవా చేశారు. ‘‘చెరువులపై హరీశ్​ రావుకు మంచి అవగాహన ఉంది. అందుకే ఆయన హయాంలో కమిషన్ కాకతీ య వచ్చింది. చెరువుల కబ్జాలపై నిజనిర్ధారణ కమిటీ వేద్దాం. ప్రజాకోర్టు పెడుదాం. హరీశ్​ను ముందు పెడదాం. ఎవరి కబ్జాలు ఏంటో అప్పు డు తేలుతాయి” అని పేర్కొన్నారు.  చెరువులు, ఆక్రమణలకు సంబంధించి అన్ని వివరాలను బయటకు తీద్దామన్నారు. ‘‘రుణమాఫీపై హరీశ్ చేసిన సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆయనే కట్టుబడి లేడు. రిజైన్​ చేయకుండా పారిపోయారు. ఓడిపోయిన దొంగ హరీశ్​ రావు. రుణమాఫీ అనేది నా కమిట్​మెంట్. నేను చెప్పాను.. చేసి తీరాను. ఇచ్చిన హామీలపై 3 పార్టీలు బహిరం గ చర్చలు జరుపుదాం. అన్ని పార్టీల మేనిఫెస్టో లపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చి ద్దాం. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. అప్పుడు కూడా పారిపోవద్దు” అని అన్నారు.  

కొత్త బీసీ కమిషన్​ వేస్తం.. కుల గణన చేస్తం

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం ​ స్పం దించారు. ఇందుకు సంబంధించిన కొత్త ఓటరు జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ వారంక్రితమే రాష్ట్రానికి ఇచ్చిందని, దాని ప్రకారం గ్రామ, మండ లాలవారీగా వివరాలను సేకరించాలని, అందు కు కొంత సమయం పడుతుందని చెప్పారు. స్థానిక ఎన్నికలపై తాము స్పష్టతతో ఉన్నామన్నా రు.  ఆగస్టు 31న ప్రస్తుత బీసీ కమిషన్ పదవీ కాలం పూర్తవుతుందని, ఆ తర్వాత కొత్త కమిష న్ వస్తుందని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు ఒక దశలో రద్దయిందని, తాము అధికారం చేపట్టిన తర్వాత తాను, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కలిసి ఢిల్లీలో కేంద్రంతో చర్చలు జరిపి, ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు.ప్రభు త్వం చేపట్టిన వివిధ పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకే స్పీడ్-19ను ప్రవేశపెట్టామని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధిం చి జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతికి బాధ్య తలు అప్పగించామని, త్వరలోనే ఒక డిజైన్ ఫైనల్ అవుతుందని సీఎం తెలిపారు. జవహర్​లాల్​ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీకి స్థలాలను అం దించడంలో గత ప్రభుత్వం జాప్యం చేసిందని, కానీ, తాము త్వరగా ఆ సొసైటీకి స్థలాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వక్ఫ్​బోర్డు చట్టాన్ని తాము వ్యతిరేకిం చామని, అది తమ పార్టీ నిర్ణయమని చెప్పారు.  

బీజేపీతో ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్​

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘కవితకు బెయిల్ రావడాన్ని నేను తప్పుపట్టడంలేదు. మనీశ్​ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టింది. సీఎం కేజ్రీవాల్‌‌కు ఇప్పటికీ బెయిల్ రాలేదు. కానీ, కేవలం ఐదు నెలల్లో కవితకు బెయిల్ ఎలా వచ్చింది ?” అని ప్రశ్నించారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందని అనుకుంటున్నట్టు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేసిందని, 8 సీట్లలో బీజేపీ గెలవడానికి కేటీఆర్, హరీశ్​ కృషి చేశారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని అన్నారు. బీజేపీతో ఒప్పందం లేకపోతే.. బీఆర్​ఎస్​ ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయి, 15 చోట్ల మూడో స్థానంలో ఉంటుందా? అని అన్నారు.