రిజర్వేషన్లపై కమిషన్​ నిర్ణయం తీస్కుంటది

రిజర్వేషన్లపై కమిషన్​ నిర్ణయం తీస్కుంటది
  • బీసీ, ఎస్సీల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తం
  • ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం ఏమిటి?
  • మీడియాతో చిట్​చాట్​లో  సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తమ ప్రభుత్వం రాజకీయాల కోసం కులగణన సర్వే చేయలేదని.. బీసీలు, ఎస్సీల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకే చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేశామని, బీసీ రిజర్వేషన్లపై కమిషన్  నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

దేశంలోనే మొదటిసారి కులగణన పూర్తిచేయడం ద్వారా మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం ద్వారా దేశమంతా కులగణన చేసి, బీసీ రిజర్వేషన్లు అమలుచేయాలని ప్రధాని మోదీపై ఒత్తిడి పెరుగుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో సీఎం రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు.

రాష్ట్రమంతా పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామన్నారు. కులగణనకు, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ రోడ్ మ్యాప్ అవుతుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 88 జనరల్ సీట్లలో 30 సీట్లు బీసీలకు ఇచ్చామని, వారికి 33 శాతం సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. రానున్న పంచాయితీ ఎన్నికల్లో కులగణన రిపోర్టు ఆధారంగా కాంగ్రెస్ తరఫున రిజర్వేషన్లను అమలు చేస్తామని సీఎం అన్నారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం అనేది ప్రొసీజర్ లో భాగం మాత్రమేనని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షానికి ఏమాత్రం బాధ్యత, చిత్తశుద్ధి లేదని, ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సభకు రాని వారు సభా సమయం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.