గద్దర్ అవార్డులపై సినీరంగమే స్పందించలేదు : సీఎం రేవంత్ రెడ్డి

గద్దర్ అవార్డులపై సినీరంగమే స్పందించలేదు : సీఎం రేవంత్ రెడ్డి
  • ఇప్పటికైనా ప్రతిపాదనలతో ముందుకు రావాలి
  • సినారె జయంతి వేడుకల్లో సీఎం

బషీర్ బాగ్, వెలుగు: నంది పురస్కారాల కంటే గొప్పగా గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, ప్రభుత్వనికి మద్దతుగా సినీరంగం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. గద్దర్ అవార్డుల అంశంపై సినీరంగ ప్రముఖులు ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి 93వ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సీఎం రేవంత్ రెడ్డి , చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, నటుడు మురళి మోహన్ పాల్గొన్నారు. తమిళ రచయిత, సన్మాన పురస్కార గ్రహీత శివశంకరీని సీఎం సన్మానించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ..సినారె కవిగా, వైస్ చాన్సలర్ గా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఆయన తెలుగు జాతికే గర్వ కారణమని తెలిపారు. 

మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన సినారె తెలుగు జాతి గర్వించదగ్గ స్థాయికి ఎదిగారని చెప్పారు. సినారె రచనలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయన్నారు. అందుకే ఆయన రచనలను  ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని వివరించారు. ప్రభుత్వం సినారె కాంస్య విగ్రహ ఏర్పాటుతో పాటు ఆయన పేరు విద్య పరంగా గుర్తు ఉండేలాగా చేస్తామని వెల్లడించారు. ఆయన రచనలు, కవిత్వాలు గ్రంథ రూపంలో వచ్చేలాగా చూస్తానని సీఎం హామీ ఇచ్చారు.