
- ఆకట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం
- తాను చెప్పింది నమ్మితేనే కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపు
మంచిర్యాల, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప సభ సక్సెస్అయ్యింది. చీఫ్ గెస్ట్‌గా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాప్టర్లో కలెక్టరేట్లోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేలు డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు తదితరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
3.40 గంటలకు సభా వేదికపైకి వచ్చిన సీఎం.. మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత దాదాపు 40 నిమిషాలు ప్రసంగించిబీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలపై ఫైర్ అయ్యారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని, 54వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. నిరుద్యోగులకు, రైతులకు, మహిళా సంఘాలకు చేసిన మేలును వివరించారు. బీజేపీ 12 ఏండ్లలో బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణపై మోసం చేస్తే... తాను మాత్రం 12 నెలల్లోనే కుల గణన లెక్కలు తేల్చానని, వర్గీకరణపై అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో లేని బీఆర్ఎస్.. కాంగ్రెస్‌ను ఓడించాలని చెప్పడమంటే బీజేపీని గెలిపించాలని చెప్పడమేనని, ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందాలను పట్టభద్రులు అర్థం చేసుకోవాలని సూచించారు. తాను చెప్పింది నిజమని నమ్మితేనే కాంగ్రెస్‌కు ఓటేయాలన్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు.
రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ మీద ఎనలేని ప్రేమ: ప్రేమ్‌సాగర్ రావు
సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద ఎనలేని ప్రేమ ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అన్నారు. 2021లో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లిలో నిర్వహించిన గిరిజన గర్జన సభలో బీఆర్ఎస్, బీజేపీ మీద రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించారన్నారు. 2023 మార్చిలో నస్పూర్ బహిరంగ సభ వేదికపై నుంచే ఎన్నిక్ల సమర శంఖారావం పూరించారని అన్నారు. మంచిర్యాలలో మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం రూ.78 కోట్లు కేటాయించాలని, గూడెం ఆలయం, విశ్వనాథ ఆలయం అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎంను కోరారు. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్నవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, రిటైర్డ్ కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వాలని డీసీసీ చైర్పర్సన్ సురేఖ విజ్ఞప్తి చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ.. 50 ఏండ్లుగా బుగ్గ ఆలయానికి రోడ్డు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే బీటీ రోడ్డు నిర్మించుకున్నామన్నారు. పట్టభద్రులు నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
ప్రైవేట్ టీచర్లకు రూ.3 లక్షల బీమా కల్పిస్తా: నరేందర్ రెడ్డి
కాంగ్రెస్అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాలతో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. తనను గెలిపిస్తే సొంత ఖర్చుతో ప్రైవేట్ టీచర్లకు రూ.3 లక్షల బీమా కల్పిస్తానని, మినిమమ్ వేజెస్ ఇప్పించడానికి, లైబ్రరీల్లో డిజిటలైజేషన్ కోసం, ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఖానాపూర్ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, తెలంగాణ మినిమమ్ వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఉమ్మడి ఆదిలాబాద్ఎమ్మెల్సీ దండే విఠల్, నాయకులు ఆత్రం సుగుణ, కంది శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్ నాయక్, ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు.