తప్పేంటో చూపించమంటే తోక ముడిచారు.. BRS, బీజేపీ సీఎం రేవంత్ ఫైర్

తప్పేంటో చూపించమంటే తోక ముడిచారు.. BRS, బీజేపీ సీఎం రేవంత్ ఫైర్

హైదరాబాద్: లక్షమంది ఎన్యుమరేటర్లను నియమించి పకడ్బందీగా కులగణన సర్వే నిర్వహించి బీసీల సంఖ్య 56.33 శాతంగా తేల్చాం.. అయితే మా సర్వే తప్పుల తడక అని కొందరు విమర్శిస్తున్నారు.. సర్వేలో ఉన్న తప్పేంటో చూపించమంటే అసెంబ్లీలో బీజేపీ, బీఆర్ఎస్ తోక ముడిచాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుల గణన నచ్చని వారే సర్వేపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే.. బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి ప్రధాని మోడీ మెడకు చుట్టుకుంటుందని బీజేపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. బీసీల హక్కులను కాలరాయడమే బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యమని మండిపడ్డారు. చివరగా 1939లో కుల గణన జరిగిందని.. మళ్లీ ఇప్పటి వరకు క్యాస్ట్ సెన్సెస్ జరగలేదని గుర్తు చేశారు. 

మండల్ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ.. ఈ యాత్రలో దేశంలోని బలహీన వర్గాల కష్టాలను చూశారని.. అందుకే కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు న్యాయం చేయాలనేది రాహుల్ గాంధీ ఆశయమని తెలిపారు. అధికారంలోకి వస్తే బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ చెప్పారని.. దానికి మొదటి పునాది రాయి తెలంగాణలో పడిందని అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‎లో ఆదివారం (మార్చి 9) అఖిల భారత పద్మశాలి మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‎గా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశాలీలు త్యాగంలో ముందుంటారని.. కొండా లక్ష్మణ్ బాపుజీ ఇందుకు ఉదాహరణ అని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపుజీ తెలంగాణ కోసం పదవి త్యాగం చేసి.. ప్రత్యేక రాష్ట్రం కోసం నిలబడ్డాడని గుర్తు చేశారు. ఓ వ్యక్తి తెలంగాణ కోసం పార్టీ పెడితే ఆయనకు సొంత కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వలేదని.. అలాంటిది ఆ పార్టీకి కొండా లక్ష్మణ్ బాపుజీ సపోర్ట్ చేశారని పేర్కొ్న్నారు.  నీడనిచ్చిన ఆయనను తెలంగాణ వచ్చిన తర్వాత నిలువనీడ లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లు కొండా లక్ష్మణ్ బాపుజీకి సరైన గౌరవం ఇవ్వలేదని.. చివరకు ఆయన చనిపోతే కూడా మాజీ సీఎం కేసీఆర్ చూసేందుకు వెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే.. టైగర్ నరేంద్రను దృతరాష్ట్ర కౌగిలిలో ఖతం చేశారని విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చాక టెక్స్ టైల్ వర్శిటీ ఏర్పాటు చేసి దానికి కొండా లక్ష్మణ్ బాపుజీ పేరు పెట్టి ఆయనను గౌరవించామని తెలిపారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా కొండా లక్ష్మణ్ బాపుజీ పేరు పెడతామని ప్రకటించారు. పద్మశాలీల బతుకమ్మ చీరల బిల్లులు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్‎లో పెట్టిందని.. మేం వచ్చాక పెండింగ్ బకాయిలను క్లియర్ చేశామని తెలిపారు. పద్మశాలీల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. 

ALSO READ | ఇలాంటి స్కూల్స్ దేశంలోనే ఎక్కడా లేవు: డిప్యూటీ సీఎం భట్టి

పద్మశాలీ బిడ్డ రాపోల్ భాస్కర్‎ను రాజ్యసభకు పంపిన చరిత్ర కాంగ్రెస్‎దని గుర్తు చేశారు. ఏం అవకాశం వచ్చినా.. పద్మశాలీలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు మహిళలు కట్టుకోలేదని.. అవి పొలాల దగ్గర పనికొచ్చాయని విమర్శించారు. అందుకే మేం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీ ఆపేశామని క్లారిటీ ఇచ్చారు. అయితే.. నేతన్నలకు ప్రభుత్వ ఆర్డర్లను రద్దు చేసిన అప్రతిష్ట ఉండొద్దని భావించామని.. అందుకే మహిళ సంఘాల్లోని వారికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించాం.. ఆ చీరల తయారీ కాంట్రాక్ట్‎ను పద్మశాలీలకు అప్పగిస్తామని తెలిపారు.