ఢిల్లీలో నేడు సెక్రటరీలతో సీఎం అత్యవసర సమావేశం..పాల్గొననున్న డిప్యూటీ సీఎం, సీఎస్ 

ఢిల్లీలో నేడు సెక్రటరీలతో సీఎం అత్యవసర సమావేశం..పాల్గొననున్న డిప్యూటీ సీఎం, సీఎస్ 
  • ఇప్పటికే ఢిల్లీకి చేరిన పలువురు ఉన్నతాధికారులు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర ఉన్నతాధికారులతో అక్కడే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇతర కీలక శాఖలకు చెందిన సెక్రటరీలు ఢిల్లీలోనే ఉన్నారు. వీరితోపాటు మిగిలిన సెక్రటరీలు జూమ్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు తెలిసింది.

ప్రధానంగా ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలు, సహకారం వంటి విషయాలపై శాఖలవారీగా అప్ డేట్స్ పై ఈ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. వీటి ఆధారంగా కేంద్ర మంత్రులను కలిసి సమస్యల పరిష్కారం, కేంద్ర సహకారం కోరనున్నట్టు తెలిసింది. అలాగే, ఎంపీలతోనూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్ర అంశాలపై పార్లమెంట్ వేదికగా అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఈ మేరకు పార్టీ ఎంపీలందరూ మంగళవారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సీఎంవో నుంచి సమాచారం వెళ్లింది. సీఎం సైతం పలు ముఖ్య శాఖలకు చెందిన కేంద్ర మంత్రుల అపాయింట్​మెంట్​ కోరినట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం తర్వాత ఆయా శాఖల మంత్రుల అపాయిట్​మెంట్​ దొరికితే..ఎంపీలతో కలిసి వెళ్లి రాష్ట్ర అంశాలను కేంద్రం ముందు సీఎం ప్రస్తావించనున్నారు. ఒకవేళ సమయం దొరికితే పార్టీ అగ్రనేతలనూ సీఎం కలిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే, వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీని కలిసి, అభినందనలు తెలుపనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు పయనం కానున్నారు.

లోక్​సభ స్పీకర్ కూతురు వివాహ వేడుకలకు హాజరు

ఢిల్లీలో సోమవారం రాత్రి లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహ విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు అంజలి, అనీశ్​ను ఆశీర్వదించారు. సీఎం వెంట శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎంపీలు ఉన్నారు.