- సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తం: సీఎం రేవంత్‌రెడ్డి
- అడగక ముందే మాదిగలకు అవకాశాలు ఇచ్చాం
- ఓయూ చరిత్రలో తొలిసారి మాదిగను వీసీ చేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : ఎస్సీ వర్గీకరణ విషయంలో భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా, పద్ధతి ప్రకారం చేయాలనే ఆలోచనతో హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరో వారంరోజుల్లో వన్‌మెన్ కమిసన్ నివేదిక వస్తుందని, న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా అమలు చేస్తామని చెప్పారు. శనివారం మాదాపూర్‌లోని దసపల్లా హోటల్లో జరిగిన గ్లోబల్ మాదిగ 2024 కాన్ క్లేవ్లో సీఎం పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ మాదిగ ఉప కులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో సీనియర్ న్యాయవాదులను నియమించామని సీఎం గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఒక స్పష్టమైన ప్రకటన చేశారని, మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని అసెంబ్లీ వేదికగా ప్రకటించామని సీఎం తెలిపారు.
న్యాయం చేసే బాధ్యత నాది..
అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నామని రేవంత్ అన్నారు. సీఎం పేషీలో సంగీతను నియమించుకున్నామని తెలిపారు. వందేండ్ల ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీసీగా, బాసర ట్రిపుల్ ఐటీ వీసీగా, విద్యా కమిషన్ మెంబర్‌గా మాదిగ సామాజిక వర్గం వారికి అవకాశం కల్పించామన్నారు. పగిడిపాటి దేవయ్యను స్కిల్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టర్‌గా నియమించుకున్నామని పేర్కొన్నారు.
‘‘ఈ ప్రభుత్వం మీకు అన్యాయం జరగనివ్వదు.. న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తం.. అమలు చేయడంలో కొంత ఆలస్యంకావచ్చు.. కానీ, మీకు తప్పక న్యాయం చేస్తం.. ఆ బాధ్యత నాది” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నాటక కాంగ్రెస్ ఎంపీ మునియప్ప, కర్నాటక మాజీ సీఎస్ రత్నప్రభ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం తదితరులు పాల్గొన్నారు.