
- కొడంగల్ శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు
- స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పణ
కొడంగల్, వెలుగు: పదిహేనేండ్లుగా మంచిచెడులో కొడంగల్ ప్రజలు తన వెన్నంటే ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తినిచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘నేనేం చేస్తానో.. ఏం చేయనో మీకంటే ఎక్కువగా ఎవరికి తెలియదు. చిట్టీ రాసిస్తే చాలు ఇక్కడికి వచ్చి అన్ని పూర్తిచేయిస్తాను” అని కొడంగల్ ప్రజలకు సూచించారు. కుర్చీ పోయిందని కొందరికి దుఃఖం ఉండొచ్చని, వారిని పట్టించుకోవద్దన్నారు.
శనివారం కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. ముందుగా వరాహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆస్థాన మండపంలో ముఖ్యమంత్రికి అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.
ఆ తర్వాత ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రాజకీయంగా మంచి అవకాశాలు కల్పించిందన్నారు. కొడంగల్‌లో ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి 25శాతం మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు.