యాదగిరిగుట్ట దేవస్థానంలో ముగిసిన మహాకుంభాభిషేక సంప్రోక్షణ

యాదగిరిగుట్ట దేవస్థానంలో ముగిసిన మహాకుంభాభిషేక సంప్రోక్షణ
  • మహాపూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు

యాదగిరిగుట్ట, వెలుగు : మహాపూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం దంపతులు..యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దివ్యవిమాన స్వర్ణగోపుర ఉద్ఘాటన కోసం ఈనెల 19 నుంచి నిర్వహిస్తున్న 'పంచకుండాత్మక మహాకుంభాబిషేక సంప్రోక్షణ' మహోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈనెల 19న యాగశాలలో చేపట్టిన 'పంచకుండాత్మక సుదర్శన నారసింహ యాగం' కుంభ ఉద్వాసన, వేదశాత్తుమురై, మహాపూర్ణాహుతితో ముగిసింది.

ఈ మహాపూర్ణాహుతితో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అంతకుముందు ఉదయం 9 గంటల నుంచి యాగశాలలో నిత్య హోమాలు, చతుస్థానార్చన పరివార శాంతి ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు.     

వైభవంగా శాంతి కల్యాణం..

ఉత్సవాల్లో భాగంగా ఆస్థాన మండపంలో సాయంత్రం 4 గంటలకు శాంతి కల్యాణం నిర్వహించారు. భగవంతుని కల్యాణం జగత్ కల్యాణ కారకమని, దీనిద్వారా ధర్మరక్షణ, దుష్టశిక్షణ, శిష్టరక్షణ, వంటి శుభ ఫలితాలు కలుగుతాయని అర్చకులు వివరించారు.

అనంతరం పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొని పారాయణీకులు, వేదపండితులు, రుత్వికులకు సన్మానం, మహాదాశీర్వచనం నిర్వహించారు. దీంతో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ముగిశాయని అర్చకులు తెలిపారు. 

ఎగబడిన కాంగ్రెస్​ లీడర్లు

యాదాద్రి, వెలుగు : సీఎం రేవంత్​ రెడ్డి వెంట బంగారు గోపురంపైకి వెళ్లడానికి కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు ఎగబడ్డారు. వారిని పైకి వెళ్లనీయకుండా ఆపడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బంగారు గోపురం సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వెళ్తుండగా ఆయన వెంట పెద్ద ఎత్తున కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు వెళ్లారు.

ప్రొటోకాల్​, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు వారిని అనుమంతిచలేదు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న తెలంగాణ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్​ గుత్తా అమిత్ రెడ్డిని కూడా పోలీసులు ఆపివేసి వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన తనకు తాను పరిచయం చేసుకోవడంతో చివరకు గుత్తా పైకి వెళ్లడానికి అనుమంతించారు.