పూలే స్ఫూర్తితోనే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ..ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం: సీఎం రేవంత్ రెడ్డి

పూలే స్ఫూర్తితోనే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ..ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించుకోవడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా సీఎం ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దళితుల్లో విద్య, ఉపాధి అవకాశాలు అందరికీ అందించాలనే లక్ష్యంతోనే  ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే తొలి సారిగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకున్నట్టు చెప్పారు.

పూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిబా పూలే పేరు పెట్టి ప్రజా భవన్ గా మార్చినట్టు చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచరణీయమని అన్నారు. ఒక సామాన్యుడిగా మొదలై.. ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు.

సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త అని, ఆయన భావితరాలకు సైతం మార్గదర్శకుడని పేర్కొన్నారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియడారు. ఇవెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు ఆయన ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.