ధరణి సమస్యలకు 10 రోజులు డెడ్​లైన్

ధరణి సమస్యలకు 10 రోజులు డెడ్​లైన్
  • ఆ లోపు పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశాలు
  • తహసీల్దార్, ఆర్డీఓ లెవెల్​లోనే  వేగంగా పరిష్కరించాలని ఆర్డర్స్
  • లాగిన్​లు ఇచ్చాక ఆలస్యం చేయడం సరికాదని వ్యాఖ్య
  • అసెంబ్లీలో ధరణిపై వైట్​పేపర్​ పెట్టేందుకు సర్కారు కసరత్తు

హైదరాబాద్, వెలుగు : ధరణి పెండింగ్​అప్లికేషన్లపై సీఎం రేవంత్​ రెడ్డి సీరియస్​ అయ్యారు. వీలైనంత త్వరగా అప్లికేషన్లను క్లియర్​ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గడిచిన రెండున్నర నెలలు ఎలక్షన్​ కోడ్​ ఉండడం, కలెక్టర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది అంతా ఎన్నికల విధుల్లో ఉండడంతో అప్లికేషన్లు క్లియర్​ కాలేదు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంకా లక్షకు పైగా అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయని సోమవారం ‘వెలుగు’లో పబ్లిష్​ అయిన స్టోరీపై సీఎం రేవంత్​రెడ్డి స్పందించారు. కోడ్​ ముగియడంతో సోమవారం నుంచి కలెక్టరేట్లలో గ్రీవెన్స్ మొదలైంది.

కాగా, కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణికి తొలిరోజు ధరణికి సంబంధించిన అర్జీలే అత్యధికంగా వచ్చినట్టు సీఎంకు తెలిసింది. దీంతో ధరణిలో పెండింగ్​సమస్యల కోసం ఒక టైం బాండ్​ పెట్టుకొని పరిష్కరించాలని అధికారులను సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేని అప్లికేషన్లను 10,15 రోజుల్లోనే పూర్తి చేసేలా పనిచేయాలన్నారు. ఇక ఇప్పటికే ధరణి పోర్టల్, పెండింగ్​అప్లికేషన్లపై ఏర్పాటైన కమిటీ రికమండేషన్స్​ను కూడా త్వరలోనే సమర్పించాలని సీఎం సూచించినట్టు తెలిసింది. 

దీంతో పాటు బీఆర్ఎస్​ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్​ తీరుతెన్నులపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వైట్​పేపర్ ​రిలీజ్ ​చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించడంతో ఉన్నతాధికారులు ఆ మేరకు కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం.  

కలెక్టర్ల నుంచి తహసీల్దార్లకు అప్లికేషన్లు

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీ​ఎన్నికల షెడ్యూల్​కు ముందు ధరణి స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు. ఆ టైంలో అన్ని రకాల మాడ్యూల్స్​లో కలిపి 2.46 లక్షల అప్లికేషన్లు వివిధ దశల్లో పెండింగ్​లో ఉన్నాయని తేల్చారు. స్పెషల్​ డ్రైవ్​లో లక్షకు పైగా అప్లికేషన్లు క్లియర్ చేశారు. ఆ తర్వాత ధరణి కమిటీ సూచనల మేరకు  తహసీల్దార్లు, ఆర్డీఓలు, అడిషనల్​ కలెక్టర్లకూ ధర ణిలో లాగిన్​లు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించేందుకే కింది స్థాయి అధికారులకు లాగిన్​ అయి భూముల వివరాలు సరిచేసే అవకాశం కల్పించారు.

దీంతో కలెక్టర్లకు వెళ్లిన అప్లికేషన్లన్నీ ఇప్పుడు తహసీల్దార్లు,  ఆర్డీఓల స్థాయిలో పరిష్కారానికి తిప్పి పంపించారు. ఈ క్రమంలో ధరణి పెండింగ్​ అప్లికేషన్ల పరిష్కారం కొంత ఆలస్యమైనట్టు అధికారులు సీఎం రేవంత్​ రెడ్డికి వివరించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే  ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం లేని అప్లికేషన్లన్నింటినీ రాబోయే పది, పదిహేను రోజుల్లో  పరిష్కరించనున్నారు.

ఇటు సిఫార్సులు.. అటు వైట్​పేపర్​.. 

ధరణిపై ఏర్పాటైన కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా వివిధ శాఖలతో సమావేశమైంది. రైతులు, అధికారుల నుంచి వివరాలు తీసుకున్నది. రాష్ట్రంలో భూ సమస్యలు తీర్చేందుకు ఏం చేయాలనే దానిపై సిఫార్సులు సిద్ధం చేస్తోంది. భవిష్యత్​లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూ సమస్యలు రాకుండా ఉండేలా ధరణి కమిటీ రికమండేషన్స్​ను రూపొందిస్తుంది. దీంతో పాటు గత సర్కారు తెచ్చిన ధరణి పోర్టల్​ను అడ్డుపెట్టుకొని చేసిన అక్రమాలు, రైతులకు జరిగిన నష్టం, ప్రభుత్వ భూముల్లో అవకతవకలపై అసెంబ్లీలో వైట్​ పేపర్​ పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇప్పటికే కొన్ని వివరాలను అధికారులు రెడీ చేశారు. రైతుల నుంచి తీసుకున్న కంప్లయింట్స్​ను కూడా పరిశీలించి వైట్​ పేపర్​లో పెట్టనున్నారు. ఇందుకోసం పూర్తి రిపోర్ట్ తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న కొందరు ప్రభుత్వ, అసైన్డ్​ భూములను అక్రమంగా పట్టాలుగా మార్చినట్టు గుర్తించారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే దానిపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.