ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది .. దాడికి కుట్ర చేస్తున్నా గుర్తించరా : సీఎం రేవంత్

  • పోలీస్ ఉన్నతాధికారులపై సీరియస్ 
  • కుట్ర కోణంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కలెక్టర్ పై దాడి వెనుక కుట్ర కోణం ఉన్నట్టు తేలడంతో, దాన్ని గుర్తించకుండా ఇంటెలిజెన్స్​ఏం చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్​అయ్యారు. ఇది ఇంటెలిజెన్స్​ఫెయిల్యూర్​గా పరిగణించాల్సి ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులకు ఆయన వార్నింగ్​ఇచ్చినట్టు తెలిసింది. ‘‘ప్రజాప్రభుత్వంలో నిరసనలు, ఆందోళనలు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇస్తున్నాం. కానీ అదే అదనుగా దాడులకు తెగబడతామంటే చూస్తూ ఊరుకుంటామా?” అని సీఎం వ్యాఖ్యానించినట్టు సమాచారం. 

లగచర్ల ఘటన జరిగిన టైమ్ లో సీఎం రేవంత్​రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అప్పుడే సీఎస్, డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్​లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఈ దాడి వెనుక కుట్ర కోణం ఉన్నదని బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్​రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొనడం, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించడంతో... దీనిపై గురువారం ప్రత్యేకంగా పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ మాట్లాడినట్టు తెలిసింది. ఈ సందర్భంగా దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు? వారి ఉద్దేశం ఏంటి? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు?

 ఎవరి ఆదేశాలతో దాడి జరిగింది? హత్యాయత్నం లాంటివేమైనా ప్లాన్​ చేశారా? అసలు ఏం జరిగిదంటూ అన్ని వివరాలను నివేదిక రూపంలో తెప్పించుకుని మాట్లాడినట్టు సమాచారం. ఆ గ్రామంలో అంతకుముందే రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని.. కొంతమంది ప్రణాళిక ప్రకారమే కలెక్టర్, అధికారులపై దాడికి వెళ్లారని సీఎంకు పోలీసులు వివరించారు. ‘‘ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్​ పని చేస్తున్నదా? లేదా? జరగరానిదేమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు?” అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘‘రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టించే విధంగా కుట్రదారుల ఆలోచన ఏమైనా ఉందా? అందుకు తగిన ఆధారాలు ఉంటే సేకరించండి. ఆధారాలు పక్కాగా ఉంటే నిందితులెవరైనా సరే చట్ట ప్రకారం లోపలేయాల్సిందే’’ అని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ఆదేశించినట్టు సమాచారం. 

అభివృద్ధిని అడ్డుకుంటున్నరు.. 

ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుంటే, అభివృద్ధిని అడ్డుకునే విధంగా ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ‘‘ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే ప్రతిపక్ష నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారు. సూచనలు, సలహాలు ఇవ్వండి అంటే మాత్రం ఇవ్వడం లేదు. ఏదైనా కొంతవరకు ఉపేక్షిస్తాం. మితిమీరితే చట్టప్రకారం కఠినంగా ఉంటాం” అని సన్నిహితులతో సీఎం అన్నట్టు సమాచారం. ‘‘మూసీ పునరుజ్జీవం, ఉద్యోగాల భర్తీ, కులగణన సర్వే, రీజినల్ రింగ్ రోడ్డు, మాజీ సర్పంచ్​ల పెండింగ్ బిల్లులు.. ఇలా రకరకాలుగా వాళ్లు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుతుంటే తట్టుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని సీఎం అన్నట్టు తెలిసింది.