గవర్నర్​కు సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు

గవర్నర్​కు సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు
  • కలిసి విషెస్ చెప్పిన సీఎం, సీఎస్, డీజీపీ, రాజ్ భవన్ సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన తెలంగాణ ఇన్ చార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు ప్రభుత్వం ఘన వీడ్కోలు పలికింది.  సోమవారం రాజ్ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గవర్నర్ ను కలిసి  వీడ్కోలు పలికారు.  అనంతరం రాజ్ భవన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో  వీడ్కోలు సభ జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, అడిషనల్ సెక్రటరీ రఘు ప్రసాద్, భవానీ శంకర్, రాజ్ భవన్ ఉద్యోగులు  పాల్గొన్నారు.  

కాగా, తనకు సహకరించిన అధికారులకు, రాజ్ భవన్ ఉద్యోగులకు సీపీ రాధాకృష్ణన్ ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ గా కేవలం  5 నెలలే పనిచేసినప్పటికీ అధికారులు, ఉద్యోగులు ఎంతో సహకరించారని, దీనిని తన జీవితంలో మర్చిపోలేనన్నారు. అనంతరం రాజ్ భవన్ లో జరిగిన ఆషాఢ మాస బోనాల్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు.  బోనం ఎత్తుకున్న మహిళలకు దిష్టి తీసి బోనాలను ప్రారంభించారు.  రాజ్ భవన్ లోని తన నివాసం నుంచి ఆవరణలో ఉన్న టెంపుల్ వరకు బోనాల యాత్రలో గవర్నర్ పాల్గొన్నారు.  అనంతరం అక్కడ ఉన్న గుడిలో పూజలు నిర్వహించారు. దేవతల ఆశీస్సుల రాష్ట్ర, దేశ ప్రజల మీద ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు.