10 మంది కలెక్టర్లు సక్కగ పనిచేస్తలే : కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్‌కు రిపోర్ట్​

10 మంది కలెక్టర్లు సక్కగ పనిచేస్తలే : కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్‌కు రిపోర్ట్​
  • 12 మంది భేష్​.. 11 మంది యావరేజ్ ప్రజలకు 
  • కొందరు అందుబాటులో ఉంటలే
  • ప్రజావాణికి బాధితులు వచ్చినా నో రెస్పాన్స్​
  • ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలోనూ నిర్లక్ష్యం
  • 2 నెలల్లో పనితీరు మారాలి.. లేదంటే చర్యలు తప్పవని సీఎం హెచ్చరిక
  • జనం సమస్యలపై వేగంగా స్పందించే కలెక్టర్లకు ప్రోత్సాహకాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్​రెడ్డి రిపోర్ట్​ తెప్పించుకున్నారు. ఎవరెవరు ఎట్ల పనిచేస్తున్నారు.. ప్రజల అభిమానం చూరగొంటున్నది ఎవరు.. ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నది ఎవరు అనే వివరాలను ఆయన తెలుసుకున్నారు. ఇందులో పది మంది కలెక్టర్ల పనితీరు నామ్కేవాస్తేగా ఉన్నట్లు తేలింది. ప్రజలకు వీరు అందుబాటులో ఉండటం లేదని.. సమస్యలతో కలెక్టరేట్​కు వచ్చే బాధితులను కూడా కలవడం లేదని సీఎం దృష్టికి వచ్చింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలోనూ ఈ కలెక్టర్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు వెల్లడైంది. మరికొంత మంది కలెక్టర్లు ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారని, కలెక్టర్​గా తమకు వచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగావినియోగించుకుంటున్నట్లు సీఎం వద్దకు రిపోర్టు చేరింది. 

త్వరలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం భేటీ

రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల కలెక్టర్లు ఉండగా.. వారిలో గత మూడు నెలల నుంచి ఎవరు ఎలా పని చేస్తున్నారనే వివరాలను ముందుగా చెప్పినట్లుగానే ప్రభుత్వం సేకరించింది. ఆ రిపోర్ట్​ ప్రకారం 12 మంది కలెక్టర్లు అద్భుతంగా పనిచేస్తున్నారు.  11 మంది యావరేజ్​గా పని చేస్తుండగా.. 10 మంది బిలో యావరేజ్​గా ఉన్నట్టు వెల్లడైంది.  ఇదే విషయంపై త్వరలో కలెక్టర్లు, పోలీస్​ కమిషనర్లు, ఎస్పీలతో  ముఖ్యమంత్రి సమావేశం కానున్నట్లు తెలిసింది. జిల్లాల్లో ఏయే కలెక్టర్ ఎలా పనిచేస్తున్నారో, ప్రజలకు ఎలా సేవలందిస్తున్నారో సమావేశంలో ఆయన చర్చించనున్నట్లు సమాచారం.

వేగంగా స్పందిస్తున్న 12 మంది

రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్లు అన్ని విధాలుగా బాగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరానికి మార్గం చూపుతున్నట్లు తేలింది. ప్రభుత్వం నుంచి ప్రజలకు లబ్ధి చేకూర్చడమే కాకుండా.. అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలు, పనుల్లోనూ వేగంగా స్పందిస్తున్నారు. ఇలాంటి కలెక్టర్లకు భవిష్యత్​లో మరిన్ని మంచి అవకాశాలు ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. 

ఇక, క్షేత్రస్థాయిలో  బిలో యావరేజ్, యావరేజ్ గా ఉన్న కలెక్టర్లపై సీఎం సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. వారిపై యాక్షన్​ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి మొదలు ధరణి పెండింగ్ అప్లికేషన్ల అంశాలు, ఫీల్డ్ విజిట్​లు, ఆరు గ్యారంటీల పథకాల అమలు, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలను కొందరు కలెక్టర్లు పట్టించుకోవడం లేదని సీఎం దృష్టికి వచ్చింది. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో రెసిడెన్షియల్ స్కూల్స్​ను విజిట్ చేయాలని, జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రిపోర్టు తెప్పించుకుంది. బిలో యావరేజ్​లో ఉన్న 10 మంది, యావరేజ్​లో ఉన్న 12 మంది కలెక్టర్లకు ముందుగా పనితీరు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. అయినా మారకపోతే తప్పించే చాన్స్​ కూడా ఉంది.

మునుపటి లెక్క ఉంటే కుదరదు

గత ప్రభుత్వ హయాంలో కొందరు ఐఏఎస్​లు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ లిస్టులో జిల్లా కలెక్టర్లుగా పని చేసినవాళ్లు కూడా ఉన్నారు. వారిలో కొందరికి ఇప్పటికే విజిలెన్స్ తో పాటు ఈడీ నుంచి నోటీసులు అందాయి. ఐఏఎస్​లు మునుపటి లెక్క పనిచేస్తే కుదరదని, మెరుగ్గా పనిచేస్తేనే ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందుతాయని పలుమార్లు సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. స్కీమ్స్​ను ప్రజలకు అందించడం దగ్గరి నుంచి ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా జిల్లా స్థాయిలో కలెక్టర్​ వేగంగా స్పందించా లని ఆయన ఆదేశించారు. ఐఏఎస్​లు మరింత ఎక్కువగా పని చేయాలని, ప్రధానంగా జిల్లాల్లోని కలెక్టర్లు ప్రజలకు - ప్రభుత్వానికి వారధిలా ఉండేలా నడుచుకోవాలని స్పష్టం చేశారు. 

కలెక్టర్​కు జిల్లాలో చేస్తున్న ప్రతి పనికి కొలబద్ద ఉంటుందని.. రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు ప్రభుత్వం మానిటర్ చేస్తుందని సీఎం హెచ్చరించారు. అయితే.. కొంత మంది కలెక్టర్ల పనితీరు బాగోలేక  ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదని.. ఇటీవల రుణమాఫీ విషయంలోనూ పలువురు కలెక్టర్లు సరిగ్గా స్పందించలేదనే విషయం తాజాగా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఇట్ల నిర్లక్ష్యంగా ఉండే కలెక్టర్లు ఇతర పోస్టులకు వెళ్లిపోవచ్చని, వారి స్థానంలో వేరేవాళ్లను తీసుకుంటామని సీఎం అన్నట్లు సమాచారం. ఒకటీ రెండు నెలల్లో పనితీరు మార్చుకోవాలని, లేకపోతే తామే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది.