- మేడిగడ్డపై రివ్యూ.. ఎన్డీఎస్ఏ మీటింగ్ వివరాలు చెప్పిన మంత్రి ఉత్తమ్
- నేడు కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ
- పీసీసీ కొత్త చీఫ్, కేబినెట్ విస్తరణపై చర్చించే చాన్స్
- వరంగల్ రైతు కృతజ్ఞత సభ కోసం రాహుల్‌కు ఆహ్వానం!
- కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్న ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన ఆయన నేరుగా తుగ్లక్ రోడ్‌లోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు, కమిషన్ విచారణ తదితర అంశాలపై మంత్రులు, కీలక అధికారులతో రివ్యూ చేపట్టారు. అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీతో దాదాపు అరగంటకు పైగా భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ మార్పు, కేబినెట్ విస్తరణ, నామినేట్ పదవులపై ఇందులో చర్చించినట్లు తెలిసింది.
సీఎం దృష్టికి ఎన్డీఎస్ఏ మీటింగ్ అంశాలు
మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు, టెస్టులు, కమిషన్ విచారణ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తో సీఎం చర్చించారు. ఢిల్లీలో శనివారం జరిగిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ దృష్టికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధికారులు తీసుకెళ్లారు.
ఆయా అంశాలపై సీఎం తన అభిప్రాయాలను వారికి తెలియజేశారు. సోమవారం జరగనున్న ఎన్డీఎస్ఏ సమావేశంలో రాష్ట్రం తరఫున వినిపించాల్సిన వాదనలు, అభిప్రాయాలపై అధికారులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు.
నేడు అగ్రనేతలతో భేటీ?
సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటికానున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలను వివరించడంతోపాటు.. రైతు రుణమాఫీ, రాష్ట్ర బడ్జెట్ సెషన్ లో ఉండబోయే కీలక అంశాలను వివరించే చాన్స్ ఉంది. అలాగే ఈ నెలాఖరులో వరంగల్ లో రైతు కృతజ్ఞత సభను నిర్వహించే అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినందున.. ఢిల్లీ పర్యటనలో రాహుల్‌ను కలిసి ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అగ్రనేతలతో భేటీకి ముందు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తో రేవంత్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పీసీసీ కొత్త చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించనున్నారు.
పలువురు కేంద్ర మంత్రులను కలిసే చాన్స్
ఢిల్లీ పర్యటనలో పొలిటికల్ అంశాలతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం ఫోకస్ చేయనున్నారు. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నట్లు సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జలశక్తి శాఖ, ఇతర శాఖల మంత్రుల అపాయింట్మెంట్లు కోరినట్లు సమాచారం.