చిలుకూరు అర్చకులు రంగరాజన్కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

చిలుకూరు అర్చకులు రంగరాజన్కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఫోన్ నుండి రంగరాజన్ ను పరామర్శించారు ముఖ్యమంత్రి. 

అనంతరం దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.  ఇలాంటి దాడులను సహించేది లేదని, దాడికి పాల్పడింది ఎవరైనా ఉపేక్షించేది లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దాడిపై ఆలస్యంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంపై సీఎం చర్చించారు. అయితే దాడి జరిగినప్పటి నుండీ పోలీసులు అందుబాటులో ఉండి దర్యాప్తు చేస్తున్నారన్నారని సీఎం కు రంగరాజన్ తెలిపారు. 

శుక్రవారం ( ఫిబ్రవరి 9, 2025 ) రాఘవరెడ్డి 20మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేసిన విషయం తెలిసిందే. అడ్డొచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు రాఘవరెడ్డి బ్యాచ్. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు పోలీసులు.

రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోరారని..  అందుకు నిరాకరించగా సదరు వ్యక్తుల తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని.. తనపైనా దాడి చేశారని రంగరాజన్ తెలిపారు. తమపై దాడికి పాల్పడ్డవారితో పాటు పరోక్షంగా వారికి సహకరించినవారిని కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు రంగరాజన్.