ఫ్యూచర్​ సిటీలో పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్

ఫ్యూచర్​ సిటీలో  పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్

 

  • తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములవ్వండి
  • క్షత్రియులకు సీఎం రేవంత్​రెడ్డి పిలుపు
  • కుమ్రం భీమ్, అల్లూరి స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడినం
  • ప్రజాపాలనలో అందరికీ ప్రాధాన్యం ఉంటుంది
  • నిజాం షుగర్స్​ ఫ్యాక్టరీని త్వరలోనే ప్రారంభిస్తం
  • క్షత్రియ భవన్​కు స్థలం కేటాయిస్తామని ప్రకటన
  • సీఎం రేవంత్​ను ఘనంగా సన్మానించిన క్షత్రియ సేవా సమితి

హైదరాబాద్, వెలుగు: కుమ్రం భీమ్, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో తాము ప్రజా సమస్యలపై కొట్లాడి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకువచ్చామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. అన్నివర్గాల ప్రజలకు ఈ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్​ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తు తరాల కోసం ఎయిర్​పోర్టుకు కూతవేటు దూరంలో ఫ్యూచర్​ సిటీ (ఫోర్త్​ సిటీ)ని నిర్మించబోతున్నామని చెప్పారు. ఫ్యూచర్​ సిటీలో పెట్టుబడులు పెట్టాలని, పరిశ్రమలు నెలకొల్పాలని రాజులను (క్షత్రియులను) ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 


ఫ్యూచర్​ సిటీలో పెట్టుబడులు పెట్టి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ కోరారు. అన్నిరకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్​ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సీఎం రేవంత్​రెడ్డిని క్షత్రియ సేవా సమితి ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కర్నాటక మంత్రి బోసురాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లూరి సీతరామరాజుతో పాటు పెద్దసంఖ్యలో క్షత్రియులు హాజరయ్యారు. సభలో సీఎం రేవంత్​ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో రాజులు  కూడా భాగస్వాములేనని, వారికి కూడా తప్పకుండా గుర్తింపు ఉంటుందని తెలిపారు. క్షత్రియ భవన్​కు కావాల్సిన భూమిని, అవసరమైన అనుమతులను ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. మళ్లీ ఆత్మీయ సమ్మేళనం క్షత్రియభవన్​లో జరుపుకుందామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్​గా ఆనంద్​ మహింద్రాను నియమించామని తెలిపారు. కో చైర్మన్​గా శ్రీనిరాజుకు అవకాశం ఇచ్చామని, ప్రభుత్వ సలహాదారుగా శ్రీనివాసరాజును నియమించామని, క్షత్రియులపై తమకు ఉన్న నమ్మకానికి ఇదే ప్రతీక అని ఆయన అన్నారు. 

హాలివుడ్​తో ప్రభాస్​ పోటీ

హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని.. కన్​స్ట్రక్షన్, మీడియా, హాస్పిటల్స్.. ఇట్ల ఏ రంగం తీసుకున్నా క్షత్రియులు ఉన్నత స్థానాల్లో ఉండి, లక్షల మందికి ఉపాధి కల్పిస్తు న్నారని సీఎం కొనియాడారు. ‘‘రాజులు ఏ రంగంలో నైనా రాణిస్తారు.. ఇందుకు వారి శ్రమ, పట్టుదలే కారణం, సినీ, రాజకీయ రంగంలో కృష్ణంరాజు రాణించారు. ఇప్పుడు ఆయన సోదరుడి కుమా రుడు ప్రభాస్ హాలివుడ్​తోనూ పోటీపడ్తున్నారు. డైరెక్టర్​గా రామ్ గోపాల్ వర్మ ఎంతో పేరు ప్రఖ్యా తలు సాధించారు’’ అని అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బోసురాజు క్రియాశీల పాత్ర పోషించారని తెలిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకున్నా పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేశారని, అతని కష్టాన్ని రాహుల్ గాంధీ గుర్తించి కర్నాటక కేబినెట్​లోకి  తీసుకున్నారన్నారు. నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు ఉంటుందనడానికి బోసురాజు, భూపతిరాజు శ్రీని వాస వర్మ  ఉదాహరణ అని ఆయన తెలిపారు.  

రేవంత్​.. ఫైటర్: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ​

ఎంతో మంది క్షత్రియులు సామాన్యులుగా హైదరాబాద్ కు వచ్చి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, అన్ని రంగాల్లో లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడుతున్నారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ‘‘మా వాళ్లు సీఎం రేవంత్ రెడ్డిని  కార్పొరేటర్లుగా అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు.. నేనేమో ఎమ్మెల్యే టికెట్లు అడగాలని మా వాళ్లను కోరుతున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.  క్షత్రియ సేవా సమితి భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే క్షత్రియులు కలిశారని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఫైటర్ అని, తమ ఇద్దరి పార్టీలు వేరైనా నిజాలు చెప్తున్నానని అన్నారు. ‘‘తెలంగాణ లో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ మీటింగ్ కు వెళ్లొద్దని నాకు కొంత మంది చెప్పారు. కానీ, ఇది పొలిటికల్ మీటింగ్ కాదని, క్షత్రియ మీటింగ్ అని వాళ్లతో చెప్పాను” అని ఆయన పేర్కొన్నారు. కర్నాటకలో మంత్రిగా, ఏఐసీసీ సెక్రటరీగా బోసురాజు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కాగా,  కర్నాటక మంత్రి బోసురాజు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సీఎం అయిన కొద్ది నెలలకే హామీలు అమలు, ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. అన్ని హామీలు అమలు చేస్తారన్న నమ్మకం ఉందని, ఎన్నో ఏండ్ల నుంచి ఇద్దరం కలిసి పనిచేశామని తెలిపారు.  

త్వరలో నిజాం షుగర్స్​ రీ ఓపెన్​

నిజాం షుగర్స్​ ఫ్యాక్టరీని పున ప్రారంభిస్తామని, పది పన్నేండేండ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని  సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. నిజాం షుగర్స్​ ఫ్యాక్టరీ రాజుల చేతిలో ఉందని, దాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. క్షత్రియుల తరఫున తెలంగాణ ప్రభుత్వంలో శ్రీనివాసరాజు  సలహాదారుగా ఉన్నారని, ఆయన ద్వారా క్షత్రియులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు. ‘‘మీలో రాజకీయాల్లో రాణించాలని ఉన్నవాళ్లను సూచించాలి. వారిని తప్పకుండా కాంగ్రెస్​ పార్టీ తరఫున ప్రోత్సహిస్తం” అని వారికి హామీ ఇచ్చారు.