సౌత్ వర్సెస్ సెంట్రల్: దక్షిణాదిపై జరుగుతున్నఅన్యాయంపై సీఎం రేవంత్ పోరుబాట

సౌత్ వర్సెస్ సెంట్రల్: దక్షిణాదిపై జరుగుతున్నఅన్యాయంపై సీఎం రేవంత్ పోరుబాట
  • కేరళ, కర్నాటక, తమిళనాడు,ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టే యోచన 
  • ఇప్పటికే కేరళ, కర్నాటక సీఎంలతో సంప్రదింపులు
  • తమిళనాడు, ఏపీ సీఎంలతోనూ మాట్లాడాలని నిర్ణయం
  • పన్నుల్లో వాటా, నిధుల కేటాయింపు, జనాభా ప్రాతిపదికన 
  • నియోజకవర్గాల పునర్విభజన, యూజీసీ డ్రాఫ్ట్ గైడ్​లైన్స్, 
  • మెడికల్ సీట్లలో లోకల్ కోటా అంశాలపై పోరాటం 
  • ముందుగా ప్రధానిని కలిసి విన్నవించాలని నిర్ణయం
  • అయినా స్పందించకుంటే ఎంపీలతో ఆందోళనలు చేసేలా యాక్షన్ ప్లాన్

హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇందుకోసం కేరళ, కర్నాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే కర్నాటక, కేరళ సీఎంలతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడు సీఎం స్టాలిన్​తోనూ సంప్రదింపులు జరపాలని ఆయన యోచిస్తున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహకారం కూడా కోరాలని భావిస్తున్నట్టు సమాచారం.

పన్నుల్లో వాటా, నిధుల కేటాయింపు, ఇతరత్రాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో.. దక్షిణాది రాష్ట్రాలన్నీ కలసికట్టుగా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కేంద్ర పన్నుల్లో వాటా, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన, బడ్జెట్​లో కేటాయింపులు, యూజీసీ డ్రాఫ్ట్ గైడ్​లైన్స్, మెడికల్ సీట్లలో లోకల్​కోటా తదితర అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రంతో పోరాడాలని డిసైడ్ అయ్యారు.

కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం గురించి ముందుగా ప్రధాని మోదీకి వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కేరళ, తమిళనాడు, కర్నాటక, ఏపీ సీఎంలతో కలిసి.. ప్రధానితో సమావేశమై, ఆయా అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇలా చేస్తే కేంద్రానికి ఒక బలమైన మెసేజ్ పంపినట్టు అవుతుందని భావిస్తున్నారు. ముందుగా వినతులతో వెళ్లాలని, అయినా కేంద్రం స్పందించకపోతే అమీతుమీ తేల్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

కేంద్రం తీరును నిరసిస్తూ దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానాలు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో ప్రత్యక్ష ఆందోళనకు దిగేందుకు ప్లాన్​చేస్తున్నారు. అనేక అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పితేనే కేంద్రం దిగివస్తుందని భావిస్తున్నారు. 

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్​తో నష్టం.. 

2029 లోక్ సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంది. ఇందుకోసం జనాభాను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. కానీ ఇలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు లోక్ సభలో ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుందని.. తద్వారా దక్షిణాది రాష్ట్రాలపై మరింత వివక్ష చూపేందుకు అవకాశం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాల్లోనూ కొంతమేర లోక్ సభ సీట్ల సంఖ్య పెరిగినా.. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి వాటితో పోల్చితే మాత్రం దక్షిణాదిలో పెరిగే సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. 

నియోజకవర్గాల పునర్విభజనతో యూపీలో లోక్​సభ సీట్ల సంఖ్య 80 నుంచి 144కు, బిహార్​లో 40 నుంచి 79కి పెరిగే చాన్స్​ఉంది. అదే దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలో 7–8 సీట్లు, తెలంగాణలో 6–7 సీట్లు, తమిళనాడులో 10-–11 సీట్లు, కర్నాటకలో 13 సీట్ల వరకు మాత్రమే పెరిగే అవకాశముంది. తెలంగాణలో 3.70 కోట్ల మంది ఉన్నట్టు ఇటీవల చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. ఈ లెక్కన డీలిమెటేషన్​లో తెలంగాణలో పెరిగే సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉండనుంది. అలాగే అసెంబ్లీ సీట్లపైనా ప్రభావం పడనుంది. 

బడ్జెట్ కేటాయింపుల్లోనూ దక్కని ప్రాధాన్యం..  

కేంద్ర పన్నుల్లో వాటా, బడ్జెట్ కేటాయింపుల్లోనూ దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కడం లేదు. కేంద్రం బడ్జెట్​లో ప్రకటిస్తున్న భారీ ప్రాజెక్టులు బిహార్, గుజరాత్, యూపీ వంటి రాష్ట్రాలకే ఎక్కువగా ఉంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రమైన బిహార్‌‌ నుంచి వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి వస్తున్నదని అనుకుంటే, దానికి ప్రతిగా కేంద్రం రూ.7.26 తిరిగి చెల్లిస్తున్నది. అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు మాత్రం 0.47 పైసలే ఇస్తున్నది.

ఈ విషయంలో ఇతర దక్షిణాది రాష్ర్టాలైన తమిళనాడు, కర్నాటక, కేరళ, ఏపీకి అన్యాయమే జరుగుతున్నది. కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు వాటా నిర్దేశించే సమయంలో జనాభాను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. 14వ ఆర్థిక సంఘం (2015–-2020) కేంద్ర పన్నుల్లో 2.437% వాటాను తెలంగాణకు కట్టబెట్టింది. అయితే 15వ ఆర్థిక సంఘం (2021-–2026) 2011 నాటి జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడంతో తెలంగాణ వాటా 2.102 శాతానికి తగ్గింది. అంటే కేంద్ర పన్నుల్లో వచ్చే వాటాలో 0.335% కోత పడింది. 

రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం నిర్ణయాలు.. 

రాష్ట్రాల పరిధిలో ఉండే యూనివర్సిటీల అంశంలోనూ కేంద్రం పెత్తనం చేసే విధంగా యూజీసీ డ్రాఫ్ట్ నిబంధనలు ఉన్నాయి. కొత్త నిబంధనల ద్వారా యూనివర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను తగ్గించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధనలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని, వీసీలను కేంద్రమే నియమించేలా ఉన్న ఈ రూల్స్ ను తక్షణమే ఉపసంహరించుకో వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే డిమాండ్ చేశారు. 

ఇటీవల మెడికల్​సీట్ల అంశంలో లోకల్​కోటాపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా దక్షిణాది రాష్ట్రాలు అసంతృప్తితో ఉన్నాయి. దీనిపై కేంద్రంతో పాటు సుప్రీంకోర్టు రాజ్యాం గం ధర్మాసనం దగ్గరికి వెళ్లాలని భావిస్తున్నాయి. ఎంబీబీఎస్‌‌లో స్థానిక కోటా కింద రాష్ట్రంలో ప్రవేశా లు పొందిన వారే.. పీజీలో స్థానిక కోటా రిజర్వేషన్లకు అర్హులవుతారని తెలంగాణ ప్రభుత్వం జీవో 148, 149 తీసుకొచ్చింది. ఇత రులు రాష్ట్రంలో ఎంబీబీఎస్‌‌ చదివినంత మాత్రాన పీజీలో స్థానిక కోటా వర్తించదని అందులో స్పష్టం చేసింది. దీంతో స్థానిక కోటా కింద రాష్ట్రాని కి చెందిన విద్యార్థులకే పీజీ సీట్లు ఎక్కువగా దక్కే అవకాశం ఉండేది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది.

చిక్కులు లేకుండా వర్గీకరణ చేశాం: సీఎం రేవంత్

మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేసే లక్ష్యంతో ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మార్పీఎస్‌‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. న్యాయపరమైన చిక్కులు లేకుండా వర్గీకరణ చేశామన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు రేవంత్‌‌ రెడ్డి, ఎమ్మెల్యేలకు మందకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. 

సీఎంతో భేటీ అనంతరం మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. జస్టిస్‌‌ షమీమ్‌‌ అక్తర్‌‌ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఒక కమిట్ మెంట్ తో వర్గీకరణ చేపట్టిన ప్రభుత్వానికి, సీఎంకు ఒక సోదరుడిగా అండగా ఉంటానన్నారు. ఆపై మందకృష్ణ.. మంత్రి ఉత్తమ్​ కుమార్​ను కలిశారు.