- టీపీసీసీ ప్రెసిడెంట్ కావడానికి పునాది అయ్యారని కితాబు
- జీవన్‌రెడ్డికి వేసే ఓటు నాకు వేసినట్లేనని వ్యాఖ్య
- ఇందూర్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ కోసం సోమవారం జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ క్యాడర్లో మస్త్ జోష్ నింపారు. ఆయన స్పీచ్‌లోని ప్రతి కామెంట్‌కు కార్యకర్తలు, ప్రజల నుంచి స్పందన లభించింది. పార్టీ లీడర్‌గా జిల్లాతో ఉన్న రిలేషన్‌షిప్‌కు తోడు పాలిటిక్స్‌లో మరింత ఎదగడానికి దోహదపడిన అంశాలను ప్రస్తావించి ఉత్సాహపర్చారు.
దాశరథి రాసిన నా తెలంగాణ కోటి రతనాల వీణతో షురూ చేసి బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్జరీన్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ, తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాజీ ఎంపీ, ఎం. నారాయణరెడ్డి, అర్గుల్ రాజారామ్, జిల్లాతో సంబంధమున్న సదాలక్ష్మీ, ఈశ్వరీబాయి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్ డి. శ్రీనివాస్, నిజాయతీ రాజకీయాలతో వన్నె తెచ్చారంటూ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు తదితరులను గుర్తు చేశారు.
నా ఐడెంటిటీకి నిజామాబాద్ జిల్లానే కారణం
ఎండ వేడిని ఉక్కబోతను ఏమాత్రం లెక్కచేయక సీఎం కోసం ప్రజలు ఓపికతో ఎదురుచూశారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా జనం తరలివచ్చారు. 30 జనవరి 2021 న ఆర్మూర్‌లో పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధర కోసం రైతులు చేసిన దీక్షలో పాల్గొనడానికి తాను మామూలు వ్యక్తిగా వచ్చిన సంగతి గుర్తు చేసుకున్నారు. ఘన స్వాగతం పలికి తన నాయకత్వంలో కాంగ్రెస్‌లో పనిచేయడానికి వారు చూపిన నమ్మకం, విశ్వాసం సోనియాగాంధీ దృష్టిలో పడేసేలా చేసిందని రేవంత్ అన్నారు.
హైకమాండ్‌లో తన మొదటి ఐడెంటిటీకి కారణమైన నిజామాబాద్ జిల్లా స్పెషల్ అని కామెంట్ చేశారు. పౌరుషం గల రైతులు, కార్యకర్తలున్న ఇందూర్ గడ్డ తన గుండెలో పర్మనెంట్‌గా కొలువైందన్నారు. ఎంపీగా జీవన్‌రెడ్డికి వేసే ఓటు తనకు వేసినట్లేనని క్యాడర్‌ను ఉత్తేజపర్చారు. బీజేపీ ఎంపీ అర్వింద్, బీఆర్ఎస్ క్యాండిడేట్ బాజిరెడ్డి గోవర్ధన్‌పై విమర్శలు చేశారు. ఆయనకు ఓటు వేస్తే కొడుకులకు మళ్లీ హఫ్తా ఇవ్వాల్సి వస్తుందన్నారు.
14 సీట్లు గెలుస్తం..ప్రచార కమిటీ చైర్మన్ మధుగౌడ్యాష్కీ
కేసీఆర్ దుర్మార్గపు పాలనపోయి కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన టైంలో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో 14 సీట్లు గెలువబోతున్నామని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుగౌడ్యాష్కీ అన్నారు. 120 రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు అమలు చేశామన్నారు. స్టేట్‌లో ఇక కాంగ్రెస్ పనైపోయిందని ప్రచారం జరుగుతున్న టైంలో రేవంత్‌రెడ్డి తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చిన మొనగాడని పేర్కొన్నారు. 2004లో విదేశాల నుంచి జిల్లాలో అడుగుపెట్టినప్పుడు ప్రజలు ఆదరించి రెండుసార్లు ఎంపీగా గెలిపించారన్నారు.
నామినేషన్ వేయని జీవన్‌రెడ్డి
ఎన్నికల నామినేషన్ వేయడానికి జీవన్‌రెడ్డి రెడీ కాగా సీఎం రేవంత్‌రెడ్డి ఆలస్యంగా రావడంతో కుదరలేదు. ఆదిలాబాద్ టూర్ ముగించుకొని రేవంత్ ప్రయాణించిన హెలిక్యాఫ్టర్ ల్యాండ్ అయ్యేసరికి మధ్యాహ్నం 3.15 గంటలైంది. నామినేషన్లు వేసే టైం మధ్యాహ్నం 3 గంటలకే ముగియడంతో వేయలేకపోయారు. హెలిక్యాప్టర్‌లో రేవంత్‌రెడ్డి వెంట మంత్రి శ్రీధర్‌బాబు వచ్చారు. కలెక్టరేట్లోని హెలిపాడ్‌లో వారిని రిసీవ్ చేసుకున్న షబ్బీర్అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, అభ్యర్థి జీవన్‌రెడ్డి నేరుగా పాత కలెక్టరేట్లోని సభా మైదానానికి చేరుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పీచ్ అరగంట కొనసాగగా మధ్యలో 3 నిమిషాలు హిందీలో ప్రసంగించారు.
ఇక లైఫ్ ప్రజాసేవకే అభ్యర్థి జీవన్‌రెడ్డి
ప్రజల సేవకే ఇక తన జీవితం అంకితం చేశానని పార్లమెంట్ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో క్రమశిక్షణ ఉంటేనే డెవలెప్మెంట్ సాధ్యమన్నారు. ఎన్డీయే గవర్నమెంట్‌తో మంచి సంబంధాలున్నా ఎంపీగా కవిత పసుపు, చెరకు రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీలు క్లోజ్ చేయించారన్నారు. ఎంపీగా అర్వింద్ అదే బాటలో ట్రావెల్ చేశారన్నారు.
ఆయన నిర్లక్ష్యంతో పసుపు పంట సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. ఇప్పుడు బుద్ధిగా ఉంటాను మరో ఛాన్స్ ఇవ్వమని కోరుతున్న ఆయన్ను నమ్మొద్దన్నారు. తాను గెలిచాక ఇందూర్‌ను స్మార్ట్ సిటీ చేస్తానని, రైల్వే సర్వీస్‌లు పెంచుతానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. గవర్నమెంట్సలహాదారుడు షబ్బీర్అలీ, తాహెర్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, డి. రాజేశ్వర్, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి, అన్వేశ్ రెడ్డి, నగేశ్ రెడ్డి, ఏబీ చిన్నా, వినయ్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, కేశ వేణు, అంతిరెడ్ది రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.