మేడారం జాతర.. బంగారు తల్లులకు చీరె సారె..పోటెత్తిన భక్తులు

  • సమ్మక్క, సారలమ్మకు మొక్కులు ముట్టజెప్పేందుకు పోటెత్తిన భక్తులు
  • మూడు రోజుల్లోనే కోటి మందికిపైగా రాక
  • శుక్రవారం ఒక్కరోజే 50 లక్షల మంది దర్శనం
  • నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్, సీఎం

మేడారం(జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి), వెలుగు: మేడారం గద్దెలపై వనదేవతలు కొలువుదీరడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క, సారలమ్మను చూసి తన్మయత్వంతో ఉప్పొంగిపోతున్నారు. మేడారం మహాజాతర మూడోరోజు శుక్రవారం గవర్నర్​ తమిళిసై, సీఎం రేవంత్​రెడ్డి వచ్చి తల్లులను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం(బెల్లం), చీరె సారె సమర్పించారు. జంపన్నవాగుతోపాటు గద్దెలకు వెళ్లే దారులన్నీ జనంతో కిటకిటలాడాయి. ముఖ్యంగా గద్దెల వద్ద క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. 

ఎటుచూసినా జనమే

మూడురోజుల్లో కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చారని దేవాదాయశాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకొచ్చిన బుధవారం 20 లక్షల మంది దాకా, సమ్మక్కను తీసుకొచ్చిన గురువారం 30 లక్షల మందికిపైగా, శుక్రవారం 50 లక్ష మందికి పైగా మేడారం వచ్చారని వెల్లడించారు. గురువారం నుంచి మేడారం చుట్టూ రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపూర్‌‌‌‌, కన్నెపల్లి ఏరియాలన్నీ పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. 

బుధవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు మేడారం గద్దెలు నిమిషం కూడా ఖాళీలేకుండా భక్తులతో నిండిపోయి ఉన్నాయి. ఇలా మూడు రోజుల్లో కలిపి సుమారు కోటి మందికి పైగా మేడారానికి వచ్చారని అధికారులు ప్రకటించారు. మహాజాతరకు శనివారం చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీఎం మొక్కులు 

గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమిళిసై‌‌‌‌‌‌‌‌, సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముండా శుక్రవారం మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమిళి సై, ఆ తర్వాత సీఎం రేవంత్​ మేడారం చేరుకోగా.. వీరికి గిరిజన పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఆహ్వానం పలికారు.

ఉదయం 11.12 గంటలకు గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమిళిసై మేడారానికి వచ్చారు. 11.30 తర్వాత అమ్మవార్లను గవర్నర్​ దర్శించుకున్నారు. మధ్యాహ్నం 2.10 గంటలకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి మేడారానికి చేరుకున్నారు. అమ్మవార్లను దర్శించుకొని 2.30 గంటలకు గద్దెల వద్ద నుంచి బయటకు వచ్చారు. వనదేవతలకు చీరె, సారె కానుకలుగా సమర్పించారు.  గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమిళి సై మేడారం మహాజాతరకు రావడం ఇది మూడోసారి కాగా.. సీఎం హోదాలో రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి తొలిసారి అమ్మవార్లను దర్శించుకున్నారు. 

క్యూలైన్లలో ఒత్తిడితో పలువురికి అస్వస్థత

వీవీఐపీలు రాక నేపథ్యంలో గద్దెల వద్ద కొద్దిసేపు క్యూలైన్లను ఆపేశారు. క్యూలైన్లలో ఒత్తిడి పెరిగి పలువురు భక్తులు  అస్వస్థతకు గురయ్యారు. వీరిని సిబ్బంది దగ్గరలోని 50 పడకల ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కొద్దిపాటి తోపులాట జరగగా పలువురు మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు గాయపడ్డారు.  

తాడ్వాయి రూట్​లో భారీగా ట్రాఫిక్​జాం 

శుక్రవారం తాడ్వాయి రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాం అయింది. సుమారు 3 కిలోమీటర్ల దూరంలోనే  ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మేడారం మహాజాతర కోసం పోలీసులు నాలుగు రూట్లు కేటాయించారు. ఇందులో ఆర్టీసీ బస్సులకు.. వీఐపీ, వీవీఐపీ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడానికి ఒకే రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయించారు. చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఏపీ‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చే వాహనాలు.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఖమ్మం, ఆదిలాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర ఉమ్మడి జిల్లాలు, మహారాష్ట్ర నుంచి వచ్చే వీఐపీ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నీ  తాడ్వాయి మీదుగా మేడారం చేరుకోవాలని పోలీసులు సూచించారు.

కానీ.. వీఐపీ, వీవీఐపీ పేరిట ముద్రించిన చాలా పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పలువురు దుర్వినియోగం చేశారు. ములుగు జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున పంపిణీ చేసిన ఈ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అర్హులకు కాకుండా అనర్హుల చేతికి చిక్కాయి. దీంతో ఎవరు పడితే వాళ్లు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వీఐపీ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగిలించుకొని తాడ్వాయి రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చారు. అదే సమయంలో ఆర్టీసీ బస్సులు కూడా ఇదే రూట్​లో వెళ్లిపోవాల్సి ఉండగా ఎదురెదురుగా వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చి ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాం అయింది.  

నేడు వన ప్రవేశం

సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు శనివారం వన ప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమం అయిపోగానే మేడారం మహాజాతర పూర్తయినట్లు గిరిజన పూజారులు అధికారికంగా ప్రకటిస్తారు. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు రాకతో మొదలైన మహాజాతర వన ప్రవేశంతో ముగుస్తుంది. సమ్మక్క, సారలమ్మను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ఇందుకోసం శనివారం మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర పూజలు జరుగుతాయి.