- సభకు వెళ్లకుండా బిజీబిజీగా గడిపిన ముఖ్యమంత్రి
- మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో వరుస భేటీలు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీకి వచ్చినా.. సభకు వెళ్లకుండా తన చాంబర్ లోనే బిజీబిజీగా గడిపారు. సోమవారం కూడా సీఎం ఒక్కసారి మాత్రమే సభలోకి వెళ్లి.. కొద్ది నిమిషాలే అక్కడ ఉండి, తిరిగి తన గదికి వెళ్లిపోయారు. మొత్తంమీద రెండు రోజుల పాటు సీఎం అసెంబ్లీకి వెళ్లినా.. దాదాపు పూర్తి సమయం తన చాంబర్లోనే గడపడం ఇటు సొంత పార్టీతోపాటు అటు ప్రతిపక్షాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మంగళవారం మధ్యాహ్నం లంచ్ సమయంలో అసెంబ్లీకి వచ్చిన సీఎం రేవంత్.. సాయంత్రం 4 గంటల వరకు తన చాంబర్ లోనే గడిపారు. ఈ సమయంలో ఆయన డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో విడివిడిగా భేటీ అయ్యారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం తరఫున అందించనున్న చీరెల డిజైన్ ను పరిశీలించిన సీఎం, తుది డిజైన్ కు ఆమోద ముద్ర వేశారు.
ఆ తర్వాత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు చేపట్టనున్న నిరసన ర్యాలీకి సంబంధించిన విషయంపై పీసీసీ చీఫ్‌తో చర్చించినట్టు సమాచారం. ఈ ర్యాలీలో సీఎం కూడా పాల్గొననున్నారు.
హోం, విద్యాశాఖ అధికారులతో సమావేశాలు
హోంశాఖతోపాటు విద్యాశాఖ తన వద్దే ఉండడంతో ఆ రెండు శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి వేర్వేరుగా భేటీ అయ్యారు. అసెంబ్లీలో ఆ శాఖలకు సంబంధించిన ప్రశ్నలు, వాటికి జవాబులు, శాఖాపరమైన అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా రేవంత్ ఆ శాఖల అధికారులతో చర్చించారు. అంతకుముందు ఇన్చార్జి డీజీపీ రవి గుప్తా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తో సుమారు గంటపాటు భేటీ అయ్యారు.
రాష్ట్రంలో, నగరంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై అడిగి తెలుసుకోవడంతోపాటు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, ఆ తర్వాత జరగబోయే పరిణామాలపైనా చర్చించినట్టు తెలిసింది. మధ్య, మధ్యలో సభలో సాగుతున్న చర్చలను తన చాంబర్ నుంచే లైవ్ ప్రసారాల ద్వారా వీక్షించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికేందుకు హకీంపేట ఎయిర్ఫోర్స్స్టేషన్కు వెళ్లారు.
సోమవారం సభలో స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టే సవరణ బిల్లును సీఎం ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. వాటిని మంత్రులతోనే పెట్టించారు. మంగళవారం ఆ బిల్లులకు ఆమోదం తెలిపే సమయంలో కూడా సీఎం సభకు వెళ్లలేదు. మొత్తానికి ముఖ్యమంత్రి అసెంబ్లీకి వచ్చినా..సభకు వెళ్లకపోవడం, తన చాంబర్ లోనే వరుస భేటీలతో బిజీ బిజీగా గడపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఫ్రీ చీరల నమునాలు పరిశీలించిన సీఎం
రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉచితంగా పంపిణీ చేయనున్న చీరల నమూనాలను అసెంబ్లీలోని తన చాంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో తయారు చేయించి ఏడాదికి రెండు చీరల చొప్పున ఫ్రీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే వాటి నమూనాలను సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్
రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ది : బీర్ల ఐలయ్య
రైతులకు, తల్లులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మండిపడ్డారు. ప్రజల్లో అలజడి సృష్టించడమే ఆ పార్టీ నేతల పని అని ఆయన విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారని, వాళ్లది ఢిల్లీలో దోస్తీ, గల్లీలో లొల్లి అని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ విస్మరించిన క్రీడలపై ఒక పాలసీ, పర్యాటక రంగం అభివృద్ధి కోసం మరో పాలసీ తెచ్చామని, వీటికి మద్దతు ఇవ్వకుండా ఆ పార్టీ నేతలు తప్పించుకున్నారని మండిపడ్డారు. ప్రతి అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
స్పీకర్‌ను గౌరవించరా?: రామ్మోహన్
స్పీకర్‌పై కనీసం గౌరవం లేకుండా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. గతంలో సంపత్ కుమార్ ను, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సభ నుంచి శాశ్వతంగా బహిష్కరించారని గుర్తుచేశారు. క్రీడలు, టూరిజం పాలసీలు తెస్తే మద్దతు తెలపాల్సింది పోయి సభను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. లగచర్ల ఘటనలో ఒక్కరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. వికారాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అన్యాయం చేసిందని, ఇప్పుడు అభివృద్ధిని చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే ప్రయత్నం: విజయరమణారావు,
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీని అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ‘‘దళిత నాయకుడైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పది నిమిషాలు లేట్ అయితే ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఒక్క రోజైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చ చేశారా? సూచనలు ఇచ్చారా?’’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
సీఎం, డిప్యూటీ సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీద చీటింగ్ కేసు నమోదు చేయాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఏడాది పూర్తయిందని, ఇంత వరకూ వాటిని అమలు చేయలేదన్నారు. ఇంకెంత కాలం ప్రజలను మభ్యపెడతారని ఆయన ప్రశ్నించారు. తమకు చర్చకు అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారని, ఇది ప్రజాపాలన అవుతుందా? అని ప్రశ్నించారు.
గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైంది?: పాయల్ శంకర్,
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైందని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే.. కాంగ్రెస్ పార్టీకీ పడుతుందన్నారు. హామీలు అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూనే ఉంటామన్నారు.
కేటీఆర్ సమాధానం ఇస్తరు: జగదీశ్
రైతులు, విద్యార్థులు, యువకుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తుశుద్ధి లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. లీకులు ఇచ్చి కేటీఆర్ గురించి మాట్లాడించడం కాదని, సీఎం రేవంత్ కు దమ్ముంటే సభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వచ్చి సమాధానం చెప్తారని అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దిగజరుతున్నాయని, పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.