ఫామ్​హౌస్​ల కోసమే ప్రాజెక్టులు కట్టారు..విచారణకు సిద్దమా..కేటీఆర్​కు సీఎం రేవంత్ సవాల్

ఫామ్​హౌస్​ల కోసమే ప్రాజెక్టులు కట్టారు..విచారణకు సిద్దమా..కేటీఆర్​కు సీఎం రేవంత్ సవాల్


నిజ నిర్ధారణ కమిటీ వేస్తం.. సిద్ధమేనా? కేటీఆర్​కు సీఎం రేవంత్​ సవాల్
కొండపోచమ్మ నుంచి కేసీఆర్​ ఫామ్​హౌస్​కు, రంగనాయక సాగర్​ నుంచి హరీశ్ ఫామ్​హౌస్​కు నీళ్లు
ఫామ్ హౌస్​ల చుట్టూ కాల్వలు తవ్విన్రు.. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు కట్టింది కేవలం వాళ్ల ఫామ్ హౌస్​ల కోసమేనని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.  ‘‘కొండపోచమ్మ నుంచి మీ(కేసీఆర్​) ఫామ్​హౌస్ కు నీళ్లు తీసుకెళ్లింది నిజం కాదా..? రంగనాయకసాగర్ దగ్గర హరీశ్​రావుకు ఫామ్​హౌస్​ ఉన్న విషయం నిజం కాదా?.. దీనిపై విచారణకు మీరు సిద్ధమా? సిద్ధమంటే  చెప్పండి.. నిజనిర్ధారణ కమిటీ వేద్దాం.. ఫామ్ హౌస్ ల చుట్టూ కాలువలు తవ్వుకున్నరు. ఆధారాలు చూపాలా? ఇంకా ఎందుకు బుకాయిస్తున్నరు?’’ అని కేటీఆర్​పై మండిపడ్డారు.  గురువారం అసెంబ్లీలో ప్రాజెక్టులపై  కేటీఆర్  చేసిన కామెంట్స్​కు సీఎం రేవంత్​రెడ్డి కౌంటర్ ఇచ్చారు.  ‘‘మల్లన్న సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి,  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నుంచే మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్ కు నీళ్లు తీసుకొచ్చాం.. మీ లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు(కాళేశ్వరం) గుండుసున్నా” అని పేర్కొన్నారు.

80వేల పుస్తకాలు చదివికాళేశ్వరం కడ్తే కుప్పకూలింది

కేసీఆర్​ కట్టిన కాళేశ్వరం కూలిపోయినా మొన్నటి వానాకాలంలో కోటి 56 లక్షల టన్నుల వడ్లు పండాయని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. ‘‘అంత పంట పండడానికి కాంగ్రెస్​ కట్టిన శ్రీరాంసాగర్​, శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీశైలం, నాగార్జున సాగర్​, జూరాల, బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్​సాగర్​, మంజీరా తదితర ప్రాజెక్టులే కారణం. కానీ, బీఆర్ఎస్​వాళ్లు మాత్రం ఫామ్​హౌస్​లలో పండుకొని మేం కట్టి ప్రాజెక్టుల కింద పండినవాటిని వాళ్ల ఖాతాలో రాసుకుంటున్నారు” అని విమర్శించారు. ‘‘80వేల పుస్తకాలు చదివి, కాళేశ్వరం కడితే అది కుప్పకూలింది. ఇప్పుడు దాంట్లో నీళ్లు నింపండి అంటున్నరు. నీళ్లు నింపితే అది కొట్టుకపోతదని ఎన్​డీఎస్​ఏ చెప్తున్నది. వీళ్లు(బీఆర్​ఎస్​ వాళ్లు) చెప్పింది విని అందులో నీళ్లు నింపినంక కొట్టుకపోతే.. ‘చూసినవా కాంగ్రెస్ వాళ్లు మేం కట్టిన కాళేశ్వరం కొట్టుకపోయేలా చేసిన్రు’ అని మళ్లీ బద్నాం చేసేందుకు కంకణం కట్టుకొని తిరుగుతరు.  ఐదుగురు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వాళ్లే కమిటీ వేసిన్రు. తుమ్మిడిహెట్టి వద్దే కట్టాలని, ప్రస్తుతం ఉన్న చోట కాళేశ్వరం కడ్తే గ్యారెంటీగా కూలిపోతదని అప్పట్లో చెప్పినా వినకుండా కట్టిన్రు. ఇప్పుడు కూలిపోయాక ప్రజలకు కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా ఇంకా బుకాయిస్తున్నరు. ఎక్కడ జొన్నలు పండినా, ఆముదాలు పండినా, తాండూర్​ల కందులు పండినా,  సూర్యాపేటలో ఇంకేదో పండినా అన్నీ  కాళేశ్వరం నీళ్లతోనే అని చెప్పుకుంటూ తిరుగుతున్నరు’’ అని సీఎం రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అబద్ధాల పోటీ పెడితే..  ఒకటి, రెండు, మూడు, నాలుగు .. ఇలా100 వరకు అవార్డులన్నీ వాళ్లే కొట్టేస్తారని బీఆర్​ఎస్​ నేతలపై ఘాటుగా స్పందించారు. ‘‘వయస్సులో ఉన్న వీళ్లిద్దరూ(కేటీఆర్​, హరీశ్​) పదవి మీద ఆశపెట్టుకున్నరు. ఆ పెద్ద మనిషి(కేసీఆర్​) వదిలేటట్టు లేడు. వీళ్లిద్దరి పోటీ తెలంగాణ ప్రజలకు తలనొప్పిగా తయారైంది. ఒకాయన పొద్దున్నే ట్విటర్​లో ఏదో పెడ్తడు . ఇంకొకాయన 11 గంటలకు ప్రెస్ మీట్ పెడ్తడు. 4 గంటలకు ఇంకొకాయన పర్యటన అని పోతడు. సాయంత్రం మేడం గారు(కవిత) అందరినీ పిలిపించి మీటింగ్​పెడ్తరు. ఏం పోటీ ఇది ..?’’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోకాళేశ్వరం కమిషన్​ రిపోర్ట్​

‘‘లగచర్లలో భూసేకరణలో బాధితులకు రూ.20 లక్షలు, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నాం. లగచర్ల భూసేకరణ జరగకుండా ‘మీరు అధికారులను చంపండి..’ అంటూ మీ మాజీ ఎమ్మెలే అక్కడి వాళ్లకు చెప్పింది నిజం కాదా..? అధికారులను చంపాలని ప్రోత్సహించిన మీరు భూసేకరణ గురించి మాట్లాడ్తున్నరా..?” అని కేటీఆర్​, హరీశ్​రావుపై సీఎం రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో రూ.36 వేల కోట్ల నుంచి లక్షా 50 వేలకు పెంచారని తెలిపారు. ‘‘కాళేశ్వరంలో మీరు(బీఆర్​ఎస్​ వాళ్లు) ఫ్రాడ్ చేశారని కమిషన్ నివేదిక ఇచ్చింది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పెడ్తం. మీరంతా జైలుకు వెళ్తరు” అని పేర్కొన్నారు. 

నీ లెక్క గుంటూరులో చదవలేదు..ప్రభుత్వ బడిలో చదివిన.. 

‘‘మాట్లాడితే ఇంగ్లిష్ గురించి మాట్లాడుతున్నరు.  చైనా, జపాన్, జర్మనీ వాళ్లకు ఇంగ్లిష్ రాకపోయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నరు. నేను మీ నాయకుడి(కేటీఆర్​) లెక్క గుంటూరులో చదువుకోలే. ఆ తర్వాత పుణె, అమెరికా వెళ్లలే. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న. నేను  ముఖ్యమంత్రిగా ఇక్కడికి వస్తే మీకు ఎందుకంత కడుపుమంట. వచ్చే ఐదేండ్లు కూడా ఇక్కడ మేమే ఉంటాం.. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి” అని బీఆర్​ఎస్​ సభ్యులకు సీఎం రేవంత్​ సూచించారు. ‘‘నేపాల్ యువరాజు దీపేంద్ర అధికారం కోసం కుటుంబం మొత్తాన్ని ఏకే 47 తో కాల్చి చంపాడట.. అలా మీరు పెద్దాయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలని చూడొద్దు.. మీ తెలివితేటలు తెలంగాణ కోసం ఉపయోగించాలి” అని కేటీఆర్​, హరీశ్​రావును ఉద్దేశించి అన్నారు. 

కేసీఆర్​ను కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టిన్రు

‘‘ప్రాజెక్టుల కోసం బలవంతంగా రైతుల భూములు లాక్కుంది మీరు కాదా..? మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూములు ఏ విధంగా తీసుకున్నరో అందరం చూశాం. మేం మాత్రం కొడంగల్, లగచర్లలో బాధితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చాం.  బలవంతంగా భూములు గుంజుకుంది మీరు” అని బీఆర్​ఎస్​పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు తెలంగాణ జాతిపిత అని చెప్పుకుం టున్న కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టారు. సామాన్యుడ్ని గెలిపించారు. ప్రజలు తిరస్కరించినా ఇంకా బీఆర్​ఎస్​ వాళ్లు ఎందుకు బుకాయిస్తున్నరు?” అని నిలదీశారు. ‘‘ మూసీ పునరుజ్జీవం చేసుకుందామా వద్దా? మెట్రో రైలు నిర్మించాలా వద్దా..? రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలా వద్దా..? అభివృద్ధి చేయాలా వద్దా..? చెప్పండి..  మేం అధికారంలోకి వచ్చాక దావోస్ పర్యటనలో రెండు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం’’ అని ఆయన వివరించారు.