
- రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత వెళ్లిందో.. ఎంత వచ్చిందో లెక్క తీద్దాం
- గుజరాత్‌కు బుల్లెట్ ట్రైన్, మరి తెలంగాణకు ఏది?.. ట్రిపుల్ ఆర్ సౌత్‌కు నిధులేమైనయ్?
- రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి 99 సార్లయినా పోతా
- నిధులు ఇవ్వకుంటే అక్కడ ఆమరణ దీక్షకైనా రెడీ
- శవాలు లేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు పైశాచిక ఆనందం
- ప్రభుత్వం నుంచి జీతం తీస్కుంటూ ఫామ్‌హౌస్‌లో ఉండుడే కేసీఆర్ స్టేచరా?
- కేటీఆర్ ఓ పిచ్చోడు.. ఆయన గురించి మాట్లాడడం అనవసరం
- బీజేపీ నేత లెక్క మంద కృష్ణ మాట్లాడ్తే ఊరుకోం
- ఎప్పుడో జరిగిన పరీక్షలకు ఇప్పుడు ఫలితాలు వస్తుంటే ఆపాలనడం ఏమిటి?
- కులగణనతోనే అన్ని పార్టీలు బీసీలకు ఎమ్మెల్సీ ఇచ్చాయని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఎంత వెళ్లిందో, కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి ఎన్ని నిధులు వచ్చాయో చర్చించేందుకు తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిద్ధమని.. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్ధమా? అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు లెక్కలు తీద్దామని, ఒకవేళ కిషన్‌రెడ్డి చెప్తున్న లెక్కలే నిజమైతే ఆయనను ఘనంగా సన్మానిస్తామన్నారు. ‘‘కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నడు. ఆయనకు తెలంగాణ అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. కేంద్ర మంత్రులు రాష్ట్రంలో తమ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులపై హైదరాబాద్ వచ్చి సమీక్ష నిర్వహిస్తే.. పక్కనే సికింద్రాబాద్‌లో ఉండికూడా కిషన్ రెడ్డి ఆ సమావేశాలకు ఎందుకు వెళ్లలేదు?” అని సీఎం రేవంత్ నిలదీశారు.
కేంద్ర అర్బన్ హౌసింగ్‌శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్ కు వచ్చి, ఆ శాఖపై సమీక్ష నిర్వహించినప్పుడు కిషన్‌రెడ్డి ఎటుపోయారని, సమీక్షలో పాల్గొనాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఏమీ రావొద్దని కిషన్ రెడ్డి కోరుకుంటున్నారని సీఎం మండిపడ్డారు. ‘‘గుజరాత్‌కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. మరి, తెలంగాణకు ఎందుకివ్వరు? రీజినల్ రింగ్ రోడ్డు నార్త్‌కు నిధులు ఇచ్చినట్లు చెప్తున్న కిషన్ రెడ్డి.. మరి సౌత్‌కు నిధులు ఎవరు ఇస్తరో చెప్పాలి? రింగ్ గా నిర్మాణం అయితేనే కదా.. రింగ్ రోడ్డు అనేది. మరి దాన్ని మధ్యలో వదిలేస్తే ఎలా రింగ్ రోడ్డు అయితది?” అని ప్రశ్నించారు. ట్రిపుల్ ఆర్ ను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రోనే ఇంకా ఉందని, కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఏమిటని నిలదీశారు.
కేసీఆర్‌ను బండకేసి కొట్టిన
ఢిల్లీకి తాను 36 సార్లు వెళ్లినట్లు బీఆర్ఎస్ లెక్కలు వేయడంపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అవసరమైనన్ని నిధులు, ప్రాజెక్టులు సాధించేందుకు 99 సార్లయినా ఢిల్లీకి పోతానని ఆయన స్పష్టం చేశారు. ‘‘నిధులు ఇవ్వకుంటే కేంద్రం తీరుకు నిరసనగా ఢిల్లీలో ఆమరణ దీక్షకు కూడా నేను సిద్ధం. ఇందుకు బీఆర్ఎస్ కూడా కలిసి రావాలి” అని హితవు పలికారు. బీఆర్ఎస్ కు ఇప్పుడు రాష్ట్రంతో సంబంధం లేదని, అందుకే ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు రావొద్దనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు చూస్తున్నారని.. రాష్ట్రంలో రైతులు బాధపడుతుంటే, శవాలు లేస్తుంటే ఈ ముగ్గురు తీన్మార్ స్టెప్పులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి తనకు లేదని కేటీఆర్ అనడంపై సీఎం మండిపడ్డారు. కేసీఆర్ ను బండకేసి కొట్టి ఓడించింది తానేనని, అలాంటిది తాను కాకుండా కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఇంకెవరికి ఉంటుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వాడినంత భాషను ఇంకా తాను మాట్లాడడం లేదన్నారు. ‘‘కేసీఆర్ మాజీ సీఎం. నేను ప్రస్తుత సీఎంను. పైగా ఆయనో పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. నేను పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆయన్ను విమర్శించడానికి ఇంకేం స్థాయి కావాలి. వారిది ఏం స్టేచర్? డ్రగ్స్ పార్టీలో దొరకడమా? లేదంటే ఫామ్‌హౌస్ లో కూర్చొని మందు తాగడమే వాళ్ల స్టేచరా..?’’ అని సీఎం రేవంత్ దుయ్యబట్టారు.
పదేండ్లలో రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ మోపిన అప్పు రూ. 7 లక్షల 11 వేల కోట్లు అని తెలిపారు. కానీ, అసలు విషయం దాచి రూ. 3 లక్షల 78 వేల కోట్లు మాత్రమేనని కేసీఆర్ అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు ఆ అప్పుకు వడ్డీలే పెద్దమొత్తంలో కట్టాల్సి వస్తున్నదని ఆయన అన్నారు. అప్పులపై కాగ్ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడిస్తామని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, ప్రతిపక్షం లేని రాజకీయం చేయాలని తాము అనుకోవడం లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తాము ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్లమని, అందుకే కేసీఆర్ మూసివేసిన ధర్నాచౌక్ ను తిరిగి కొనసాగిస్తున్నామని చెప్పారు. ‘‘అసెంబ్లీ రికార్డులు చూడండి.. మేం ఏ పార్టీకి ఎంత సమయం మాట్లాడే అవకాశం ఇచ్చామో తెలుస్తుంది. కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడొచ్చు. మాకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎంత సమయమైనా ఇస్తాం. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పనిచేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే” అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను సస్పెండ్ చేయకుండా సభ నడిపిన చరిత్ర తమదన్నారు.
నీళ్ల గురించి నువ్వా కేసీఆర్ మాట్లాడేది?
కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చిందని బీఆర్ఎస్ ఆరోపించడంపై సీఎం రేవంత్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడైనా సరే రెండో పంట 30 లక్షల నుంచి 35 లక్షల ఎకరాల్లో వేసుకుంటారని.. కాని, ఈసారి 55 లక్షల ఎకరాల్లో రెండో పంట వేయడం వల్లే సాగునీటి విషయంలో కొంత సమస్య ఏర్పడిందన్నారు. 35 లక్షల ఎకరాల సాగుకు సంబంధించిన నీటి విడుదలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకున్నా.. ఎక్కువ సాగుతో కొంత ఇబ్బంది ఎదురైందని తెలిపారు. ఇప్పుడు కృష్ణా నీళ్ల గురించి ఏదో జరిగిపోయినట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ సీఎం జగన్ ను పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టింది కేసీఆర్ కాదా?, రాయలసీమకు వెళ్లి రోజమ్మ ఇంట్లో చేపల పులుసు తిన్నది కేసీఆర్ కాదా? అప్పుడు నీటి విషయంలో ఎంతైనా వాడుకోండని అక్కడి ప్రభుత్వానికి చెప్పిన కేసీఆర్, ఇప్పుడు మాట్లాడటం ఏమిటి?” అని ఆయన ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్నిరకాల పరీక్షల ఫలితాలు ఆపాలని మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుపట్టారు. మంద కృష్ణగా ఆయన్ను గౌరవిస్తానని, కానీ ఆయన బీజేపీ నేతగా మాట్లాడితే చూస్తూ ఊరుకోనన్నారు. ఎప్పుడో జరిగిన పరీక్షల ఫలితాలు ఇప్పుడు వస్తే, వాటిని ఆపాలని అనడం ఏమిటని ప్రశ్నించారు.
హరీశ్‌రావు బీజేపీకి లొంగిపోయిండు
హరీశ్‌రావు బీజేపీకి పూర్తిగా లొంగిపోయారని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దగ్గరుండి నగదు పంచి బీజేపీకి ఓట్లు వేయించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ గెలువొద్దనేది వారి ఆలోచన అని మండిపడ్డారు. మంత్రివర్గ విస్తరణ చేయలేకపోతున్నారని బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను సీఎం తిప్పికొట్టారు. ఐదు నెలల పాటు మంత్రివర్గాన్ని విస్తరించకుండా సీఎంగా కేసీఆర్ ఒక్కడే ఉండి పాలన చేసిన తీరును బీఆర్ఎస్ నేతలు మరిచిపోయినా..తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని ఆయన అన్నారు. ఒక్కో కార్యక్రమాన్ని విడతల వారీగా చేసుకుంటూ వస్తున్నామని, మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని చెప్పారు. కాంట్రాక్టర్ల బిల్లులు అప్పట్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించి ఉంటే .. వాళ్లు ఇప్పుడు ధర్నా చేసేవాళ్లు కాదు కదా? అని అన్నారు. ‘‘కేటీఆర్ ఓ పిచ్చోడు. ఏదేదో వాగుతడు. ఆయన చెల్లని రూపాయి. బలుపు మాటలు మాట్లాడ్తడు. కేటీఆర్ గురించి మాట్లాడడం అనవసరం” అని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం చేసిన కులగణనతోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకే టికెట్లు ఇచ్చాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు.