
ఢిల్లీ: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టనర్ అని, కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని సీఎం ఆరోపించారు. మెట్రో విస్తరణలో నాకు పేరు వస్తుందని, కేసీఆర్ హయాంలో ఇది జరగలేదు కాబట్టి నా హయాంలో జరగవద్దని కిషన్ రెడ్డి భావిస్తున్నారని.. అందుకే కిషన్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టును క్యాబినెట్లో అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఫిరాయింపులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి 2024 వరకు ఉన్న రాజ్యాంగము, చట్టాలే ఇప్పుడూ ఉన్నాయని, అప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకే తీసుకున్నారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. అప్పుడు జరగని ఉప ఎన్నికలు, అప్పుడు పడని అనర్హత వేటు ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వస్తుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తాయంటూ కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు.
ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలివి:
* త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతుంది
* ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే మేము విచారణ చేస్తాం
* కేదార్ మృతదేహం ఇండియాకు రానుంది, ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్లోనే ఉన్నారు... ఆ ఎమ్మెల్యే ఎవరు?
* కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీ పనులు కేసీఆర్ పక్కన పెట్టారు
* కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయి
* ఉపఎన్నికలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదు.
* 2014 నుంచి 2024 వరకు ఉన్న శాసన వ్యవస్థే ఇప్పుడూ ఉంది
* రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎక్కడుంది? పోటీలో లేని వాళ్లు మాట్లాడుతున్నారు
* అధ్యక్షుడు ఎవరైనా బీజేపీతోనే పోటీ
* బీఆర్ఎస్ బీజేపీ గెలుపు కోసం పనిచేస్తుంది
* ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాలలో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది
* కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. విదేశాల్లో ఉన్న వాళ్లను ఎవరు తీసుకొస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారు.
* మెట్రోను కేంద్ర క్యాబినెట్ ముందుకు తీసుకురాకుండా అడ్డుకున్నదే కిషన్ రెడ్డి
* నేను ప్రధానికి ఇచ్చిన ఐదు విజ్ఞప్తులను సాధించుకొని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్లదే
* నా వంతుగా నేను చేయవలసింది చేశా.. అవన్నీ తీసుకొచ్చి క్రెడిట్ వాళ్ళ సొంతం చేసుకోవచ్చు
* బహిరంగ సభ ఏర్పాటు చేసి వారికి సన్మానం కూడా చేస్తా
* హైదరాబాద్కు మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, జైపాల్ రెడ్డి
* ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు మానిటరింగ్ చేస్తుంది
* సీబీఐ కేసులు అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది
* ఫార్ములా ఈ, గొర్రెల పంపిణీ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఎందుకు ఈడీ చర్యలు తీసుకోలేదు ?
* రాత్రికిరాత్రి మేము ఎవరినీ అరెస్ట్ చెయ్యం, అది మా విధానం కాదు
* కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ విచారణ జరుగుతుంది
* రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపైనే మా దృష్టి ఉంది. దాని ప్రచారంపై లేదు.