రెండోసారి కూడా నేనే సీఎం అవుతా.. చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి

రెండోసారి కూడా నేనే సీఎం అవుతా.. చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ‘రెండోసారి కూడా నేనే సీఎం అవుతా’ అని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల వద్దకు వెళతానని ఆయన శాసనమండలిలో మీడియాతో ముచ్చటించిన సందర్భంలో అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని రేవంత్ చెప్పారు.

తొలిసారి బీఆర్ఎస్పై వ్యతిరేకతతో ఓటేశారని, రెండోసారి తమపై నమ్మకంతో ఓటేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను పనిని నమ్ముకుని ముందుకు వెళుతున్నానని, సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు ప్రజలు తనను నమ్మి మళ్లీ గెలిపిస్తారని రేవంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

ALSO READ | కేసీఆర్ సర్వే అసంపూర్ణం..కులగణనపై కమిటీ వేసింది కాంగ్రెస్.. సీఎం రేవంత్రెడ్డి

తెలంగాణలో కోటి మంది మహిళలకు కచ్చితంగా లబ్ది చేకూరుస్తానని సీఎం హామీ ఇచ్చారు. మహిళలు ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు తమకే వేస్తారని సీఎం నమ్మకంగా చెప్పారు. గతంలో తాను చెప్పిందే జరిగిందని, భవిష్యత్లో కూడా తాను చెప్పిందే జరుగుతుందని రేవంత్ చెప్పారు.

జనాభా లెక్కలపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలు అడిగిందని, 2027లో జనాభా లెక్కలు నోటిఫై చేస్తారని అంటున్నారని సీఎం రేవంత్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా ప్రయత్నిస్తున్నామని చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తొలిసారి బీఆర్ఎస్పై వ్యతిరేకతతో ప్రజలు తమకు ఓటేసినా, రెండోసారి తమపై  ప్రేమతో ఓటు వేస్తారని సీఎం రేవంత్ చెప్పడం గమనార్హం.