ట్వీట్ ఫైట్.. మోదీ వర్సెస్ రేవంత్.. రుణమాఫీపై మోదీ ట్వీట్.. సీఎం రేవంత్ కౌంటర్

ట్వీట్ ఫైట్.. మోదీ వర్సెస్ రేవంత్.. రుణమాఫీపై మోదీ ట్వీట్.. సీఎం రేవంత్ కౌంటర్

హైదరాబాద్: ట్విట్టర్ వేదికగా ప్రధాని, సీఎం మధ్య ‘మహా’యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీలన్నీ ఫేక్ అని పేర్కొంటూ ప్రధానినరేంద్ర మోదీ చేసిన ట్వీట్లు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపాయి. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో రుణమాఫీ జరగలేదని, మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే హామీలు అమలు కావని పేర్కొన్నారు. అంకెల గారడీ  చేశారని పేర్కొంటూ మోదీ చేసిన ట్వీట్ కు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అదే ట్విట్టర్ లో బదులు ఇచ్చారు.

పదేండ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిందని పేర్కొన్నారు.  అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల వ్యవధిలో 22 వేల మంది రతులకు సంబంధించిన 22 కోట్ల పైచిలుకు రుపాయల రుణమాఫీని చేశామని క్లారిటీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే ఆర్టీసీ బస్సులో  మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించామని చెప్పారు. 

ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ విడుదల చేశామని తెలిపారు. తక్కువ సమయంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇది ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ జరగలేదని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని అన్నారు. గురుకులాలు,  సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీలతోపాటు, కాస్మోటిక్స్ చార్జీలను 40%  పెంచామని తెలిపారు.

‘బీఆర్ఎస్  చీకటిని అంతం చేశాం.. ఉదయిస్తున్న సూర్యుడిలా తెలంగాణ ప్రకాశిస్తోంది. పదేండ్లలో ఆక్రమణకు గురైన చెరువులు కాపాడుతున్నం.. ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నం.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాం’ అంటూ బదులిచ్చారు. వీటితో పాటు పలు కీలక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి తన ట్వీట్లో ప్రస్తావించారు.

రేవంత్ రెడ్డి
‘మేం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నం.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలైంది.. అయినా.. ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు,  ఆరోగ్య శ్రీ సహాయం 10 లక్షలకు పెంపు హామీ పూర్తి చేశాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు మండిపోతున్నాయి.. తెలంగాణలో మాత్రం రూ. 500 కే సిలిండర్ ఇస్తున్నం.. 42,90,246 మంది లబ్ధిదారులు చిరునవ్వులతో వంటింట్లో అడుగు పెడుతున్నారు. 22 వేల మందికి 22 వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం.. ఉదయిస్తున్న సూర్యడిలా తెలంగాణ ప్రకాశిస్తోంది’.
#TelanganaRising #PromisesKept

నరేంద్ర మోదీ
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గ్యారెంటీలు అమలు కావడం లేదు. కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక  పరిస్థితి అధ్వానంగా ఉంది. సాధ్యం కాని హామీలిచ్చి అమలు చేయలేక సతమతమవుతున్నారు. వాళ్లిచ్చిన వాగ్దానాలను ఎన్నటికీ అమలు చేయలేరు. ఈ విషయం వాళ్లకు కూడా తెలుసు. తెలంగాణ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా చేయనేలేదు. కాంగ్రెస్ ఎక్కడైనా అధికారంలోకి రావడానికి అబద్ధాలు ఆడుతుంది.
#FakePromisesOfCongress