
హైదరాబాద్: గాంధీ ఫ్యామిలీకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందని.. అధిష్టానం ఆయనకు కనీసం అపాయిట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో గాంధీ ఫ్యామిలీతో దూరం పెరిగిందన్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ గురువారం (మార్చి 13) అక్కడ మీడియా ప్రతినిధులతో చిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. అధిష్టానాన్ని కలిశానా లేదా అన్నది ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదని అన్నారు.
నేను ఎవరో తెలియకుండానే.. నన్ను పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిగా చేశారా అని విమర్శకులను ప్రశ్నించారు సీఎం రేవంత్. నేను ఎవరి ట్రాప్లో పడనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు.. అసెంబ్లీలో చర్చలకు రావాలని సూచించారు. కేసీఆర్ పదేళ్లలో ఒక్క పాలసీ కూడా తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణలో నేను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదని.. రాష్ట్రానికి రూ.2.2 లక్షలకోట్ల పెట్టుబడులు తెచ్చామని పేర్కొన్నారు. నిరుద్యోగ రేటును 8.8 నుంచి 6.1 శాతానికి తగ్గించామన్నారు.
తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను రాష్ట్ర మంత్రి కిషన్‌రెడ్డి పట్టించుకోవడంలేదని మరోసారి విమర్శించారు. నేను కేంద్రాన్ని ఆరు గ్యారంటీలకు నిధులు అడగడం లేదని.. ఆర్ఆర్ఆర్, మెట్రో, మూసీ ప్రాజెక్టులకు నిధులు అడుగుతున్నానని అన్నారు. తెలంగాణకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు ప్రకటించిన హామీలు అడుగుతున్నామన్నారు. మెట్రోకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మెట్రో విస్తరణ హైదరాబాద్ గేమ్ ఛేంజర్ అని పేర్కొన్నారు.