
- సీడీపీ, ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరు చేస్తం
- వీటి కింద బడ్జెట్‌లో 3 వేల కోట్లు పెట్టినం
- ఇబ్బందులేమున్నా డైరెక్టుగా నాకు చెప్పండి
- నియోజకవర్గాల్లో సమస్యలపై దృష్టిపెట్టండి
- ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన
హైదరాబాద్, వెలుగు: నియోజకవర్గాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానిస్టిట్యూయెన్సీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (సీడీపీ), స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్) కింద ఎమ్మెల్యేలకు అవసరమైన నిధులు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా నియోజకవర్గాల్లో పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల అందరితోనూ సీఎం ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలను పిలిపించుకుని, నిధుల విషయంలో వాళ్లకు భరోసా ఇస్తున్నారు. ‘‘నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదు. సీడీపీ, ఎస్‌డీఎఫ్ ద్వారా అవసరమైన సాయం అందిస్తాం. ఏ సమస్య ఉన్నా నాతో నేరుగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేల గౌరవం కాపాడుతాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేయాలి” అని సీఎం చెప్పారని ఎమ్మెల్యే ఒకరు తెలిపారు.
‘‘రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల కల్పించాలని ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉంది. ఇంటిగ్రేటెడ్రెసిడెన్షియల్స్కూల్స్ మూడు నియోజకవర్గాల్లోనే పెట్టాలని మొదట అనుకున్నాం. కానీ ఆ తర్వాత అన్ని నియోజకవర్గాలను సమానంగా చూస్తూ.. అన్నింటికీ మంజూరు చేశాం’’ అని ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ అన్నట్టు తెలిసింది. ‘‘అన్ని నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. తమ నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు, అవసరాలు ఉన్నా ఎమ్మెల్యేలు నా దృష్టికి తీసుకురావాలి. అలాగే కొందరు ఎమ్మెల్యేలకు సీడీపీ, ఎస్‌డీఎఫ్ నిధులపై అవగాహన ఉండటం లేదు. వాటిని ఏయే అవవసరాలకు వినియోగించుకోవాలనే దానిపై మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి తెలుసుకోవాలి” అని సీఎం సూచించారు.
చేసింది చెప్పుకోకపోతే ఎట్ల?
ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేదని ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని, ఈ విషయంలో అప్రమత్తత లేకపోతే ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తాయని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది. ‘‘ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం.. సమస్యలు వింటున్నాం.. వాటిని పరిష్కరిస్తున్నాం.. అనేలా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి.
సీడీపీ, ఎస్డీఎఫ్ మాత్రమే కాకుండా ప్రభుత్వం ఏయే డిపార్ట్‌మెంట్ల కింద ఎన్ని నిధులు కేటాయించింది ? వాటితో నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ? ఏమేం పనులు చేయవచ్చో తెలుసుకుని ముందుకు వెళ్లాలి” అని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ప్రపోజల్స్ రెడీ చేస్కుంటున్న ఎమ్మెల్యేలు..
ఈసారి బడ్జెట్‌లో సీడీపీ, ఎస్డీఎఫ్ కింద రూ.3 వేల కోట్లు కేటాయించారు. ఇందులో నుంచే ఎమ్మెల్యేలకు అవసరమైన నిధులను కేటాయిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అత్యవసర ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశం లభించనుంది. పోయినేడాది సీడీపీ కింద ప్రతి ఎమ్మెల్యేకు రూ.3 కోట్ల చొప్పున మొత్తం 119 నియోజకవర్గాలకు సుమారు రూ. 357 కోట్లు కేటాయించగా.. ఎస్‌డీఎఫ్ కింద రూ.2 వేల కోట్ల వరకు వివిధ ప్రాజెక్టులకు విడుదలయ్యాయి.
అయితే, కొన్ని నియోజకవర్గాల్లో నిధులు సకాలంలో అందకపోవడం, ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సీడీపీ, ఎస్‌డీఎఫ్ ఫండ్స్‌ను ప్రభుత్వం ఈసారి రూ.3 వేల కోట్లకు పెంచింది. ఈ నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎమ్మెల్యేలు ముందుండాలని, అందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ప్రతి నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనుల జాబితాను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా కలెక్టర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ నిధులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రపోజల్స్ రెడీ చేసుకుంటున్నారు. తమ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.