శుక్రవారం ( జనవరి 10, 2025 ) హైదరాబాద్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు. సీఐఐ ప్రతినిధులతో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించిన సీఎం రేవంత్ వారికి స్కిల్ యూనివర్సిటీ విశేషాలను వివరించగా.. స్కిల్ యూనివర్సిటీలో భాగమవుతామని, విజన్ 2047లో పాల్గొంటామని, తెలంగాణ అభివృద్ధికి సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు సీఐఐ ప్రతినిధులు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రకృతి విపత్తులను ఎదుర్కొవడానికి హైదరాబాద్ సిద్ధమౌతోందని, వరదలు లేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలనుకుంటున్నామని అన్నారు సీఎం రేవంత్.
ప్రతి ఏటా లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నా స్కిల్ ఉండటం లేదని, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యార్థులను తయారు చేస్తామని అన్నారు.ఆటో మొబైల్ ఇండస్ట్రీపై ఫోకస్ పెడతామని.. యువతలో స్కిల్స్ పెంచడానికి ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు సీఎం రేవంత్. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో వొకేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని భారతీ ఎయిర్టెల్ హామీ ఇచ్చినట్లు తెలిపారు సీఎం రేవంత్.
తెలంగాణాలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. స్పోర్ట్స్ వర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్.తెలంగాణను ప్రయోగశాలగా వాడుకోవాలని సీఐఐ ప్రతినిధులకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్. తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తోందని.. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకో కల ఉంది.. అదే తెలంగాణ రైజింగ్ అని అన్నారు. హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ ని నిర్మించాలని నిర్ణయించుకున్నామని అన్నారు సీఎం రేవంత్. న్యూయర్క్ , లండన్, టోక్యో, సియోల్ , దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందని అన్నారు. భారతదేశంలోనే గొప్ప నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నామని.. ఇందులో సేవా రంగం మాత్రమే ఉంటుందని అన్నారు.
ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని...3వేల 200 ఈవీ బస్సులను ఆర్టీసీ లోకి తీసుకువస్తున్నామని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను ను తొలగించామని.. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
మూసీ పునరుజ్జీవనంతో 55 కిలో మీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయనున్నామని.. 2050 సంవత్సరానికి అవసరమయ్యే తాగు నీటి అవసరాలకు కావాల్సిన కార్యచరణ ను ఇప్పటి నుంచే ప్రారంభించామని అన్నారు సీఎం రేవంత్. రీజినల్ రింగ్ రోడ్ ప్రణాళికల దశలో ఉందని.. 360 కి.మీ పొడవు రీజినల్ రింగ్ రోడ్ ను నిర్మిస్తున్నామని.. దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్వేను ప్లాన్ చేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్. ఓఆర్ఆర్, ట్రిపులార్ లను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నామని.. వీటి మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుందని అన్నారు సీఎం రేవంత్.