- సినీ స్టార్లయినా.. సామాన్యులైనా ఒక్కటే
- చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించరా?
- అల్లు అర్జున్ అరెస్ట్‌లో నా ప్రమేయం లేదు.. చట్టం ముందు అందరూ సమానులే
- థియేటర్‌కు సామాన్యుడిలా వచ్చి సినిమా చూస్తే సమస్య ఉండేది కాదు..
- కానీ అర్జున్ కారెక్కి అరుస్తూ,
- ఫ్యాన్స్‌లో హంగామా సృష్టించారు
- హీరో అల్లు అర్జున్ నాకు చుట్టమైనా,మా పార్టీ వ్యక్తికి అల్లుడైనా వదల్లే
- బీఆర్ఎస్ది రాజుల తల్లి..మా తెలంగాణ తల్లి రైతుల తల్లి
- ‘అజెండా ఆజ్ తక్ - 2024’స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం
న్యూఢిల్లీ, వెలుగు: సినీ నటుడు అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రకారం.. దేశ ప్రధాని అయినా, సామాన్యుడికైనా ఒకే చట్టమని స్పష్టం చేశారు. తనతో పెట్టుకుంటే వదిలేస్తానని, కానీ రాజ్యాంగం, సామాన్య ప్రజలతో పెట్టుకుంటే కచ్చితంగా జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. క్రైం చేసింది ఎవరన్నదే తమకు ముఖ్యమని, అంతేగానీ ఆ నేరస్తులు సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అన్నది తమకు అవసరం లేదన్నారు.
స్టార్లకు తాను ఇచ్చేది, వారి నుంచి తీసుకునేది ఏమీలేదని క్లారిటీ ఇచ్చారు. ఏడాది పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెచ్చామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘అజెండా ఆజ్ తక్ – 2024’ స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కు గల కారణాలను సీఎం వివరించారు. ‘‘పుష్ప 2 రిలీజ్ రోజు బెన్ఫిట్ షో కోసం మా ప్రభుత్వం అనుమతించింది. ఈ షోకు రూ.300 టికెట్‌ను రూ.1,300కు అమ్ముకున్నారు. ఈ షో ప్రదర్శించిన థియేటర్ వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేకుండానే.. హీరో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు 13 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ వ్యవహారంలో క్రిమినల్ కేసులు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు థియేటర్ యాజమానులతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. 10 రోజుల తర్వాత అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్లారు. నటుడు అల్లు అర్జున్ కూడా పోలీసులకు సహకరించి, స్టేషన్‌కు వెళ్లారు. తర్వాత ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది’’ అని వెల్లడించారు. ఇదంతా పక్కన పెడితే... ఈ ఘటనలో ఒక ప్రాణం పోయిందన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఒక మహిళ మరణించిన తర్వాత కూడా కేసులు పెట్టకపోతే, ప్రజలు ఎలా స్వాగతిస్తారని ప్రశ్నించారు. తమ పాలనలో సినిమా హీరోకు ఒక రాజ్యాంగం, సామాన్యుడికి మరో రాజ్యాంగం ఉండబోదని చెప్పారు. టాప్ హీరోలు సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ ఎందుకు జైలుకు పోయారో దేశ ప్రజలకు తెలుసునని అన్నారు.
హీరో హంగామా వల్లే మహిళ మృతి..
అల్లు అర్జున్ సామాన్యుడిలా కారులో వెళ్లి సినిమా చూసి వెళ్లిపోతే సమస్యే ఉండేది కాదని సీఎం రేవంత్ అన్నారు. అలా కాకుండా కారు ఎక్కి అరుస్తూ, ఫ్యాన్స్‌లో హంగామా సృష్టించారని చెప్పారు. దీంతో పరిస్థితులు అదుపుతప్పి, తొక్కిసలాట జరిగిందని తెలిపారు. అయినా ఈ కేసులో అల్లు అర్జున్ను ఏ 11గా గుర్తించినట్టు సీఎం చెప్పారు. మరి మహిళ మరణానికి కారణం ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారన్నారు.
ఇందులో ప్రభుత్వం, పోలీసుల బాధ్యత ఏమిటో మీరే చెప్పాలని అడిగారు. ‘సొంతగా అది అల్లు అర్జున్ చిత్రం. ఆయన కావాలంటే స్టూడియోలో స్పెషల్ షో చూడొచ్చు. ఇంట్లో హోం థియేటర్లో చూడొచ్చు. కానీ ప్రజల్లోకి వెళ్లి చూడాలంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేదంటే అక్కడ ఏర్పాట్లు చేసిన మేనేజ్మెంట్కు సహకరించాలి. పోలీసులకు సమాచారం లేకుండా అల్లు అర్జునే కాదు, సీఎంగా నేను కూడా ఏదైనా ప్రోగ్రామ్‌కు హాజరైతే నాపై కూడా కేసు నమోదు చేసే ఆస్కారం ఉంటుంది” అని తెలిపారు.
చుట్టమైనా పక్షపాతం చూపలే..
ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ సీఎంగా తన పేరు మరిచిపోయినందుకు అరెస్ట్ చేశారనే వార్తల్లో నిజం లేదని రేవంత్ చెప్పారు. ‘‘అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నేను కూడా ఆయనకు పరిచయమే. మెగాస్టార్ చిరంజీవికి అల్లు అర్జున్ మేనల్లుడు. ఆ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నేత. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మనిషే. ఈ రకంగా అర్జున్ నాకు బంధువు అవుతారు. చుట్టరికం ఉన్నా, సీఎం బంధువైనా.. ఈ వ్యవహారంలో పోలీసులు చట్టాన్ని ఫాలో అయ్యారు’’ అని సీఎం స్పష్టం చేశారు. సీఎంగా, హోం మంత్రిగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు పోలీస్ శాఖ నుంచి నివేదిక కోరడంలో తప్పేముందని ప్రశ్నించారు. చట్ట ప్రకారం ఎవరైనా ఆందోళన చేయవచ్చని, అనుమతి లేకుండా ఆందోళనకు దిగితే జైలు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు.
ఒక మహిళ మరణం మీకు పట్టదా?
ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు ఇంతలా ప్రశ్నిస్తున్న మీరు ఒక మహిళ ప్రాణం పోయిన విషయంపై కనీసం ఒక్క ప్రశ్న కూడా ఎందుకు అడగడం లేదని సీఎం నిలదీశారు. మరణించిన మహిళ కుటుంబ ఆర్థిక పరిస్థితి, 11 రోజులుగా చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించకపోవడం భావ్యం కాదని పేర్కొన్నారు. ‘సిన్మా వాళ్లకు సినిమా ఒక బిజినెస్. డబ్బులు పెట్టి, డబ్బులు సంపాదించుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి, అమ్ముకొని డబ్బులు సంపాదిస్తారు. అంతేకానీ పాకిస్తాన్ బోర్డర్‌కు వెళ్లి దేశం కోసం గెలిచి వచ్చారా? సినిమా తీశారు. పైసలు సంపాదించారు.
ఇందులో మీకు, మాకు ఏం వస్తుంది” అని ప్రశ్నించారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవాళ్లంతా సీఎం స్పీచ్‌కు మద్దతు తెలుపుతూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగతంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానినని సీఎం చెప్పారు. కానీ ఆ స్టార్ మరణించారని, ప్రస్తుతం తనకు ఏ స్టార్ లేరని, తానే సొంతంగా స్టార్ గా ఎదిగానని పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా అభిమానులు ఉండాలని కోరుకుంటానని చెప్పారు.
తెలంగాణ బాధ్యత నేను తీసుకుంటా..
హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి గురించి ఆ రాష్ట్ర నేతల్ని అడగాలని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణకు తాను బాధ్యత వహిస్తానని, దేశానికి తానెలా బాధ్యత తీసుకోగలనని ప్రశ్నించారు. మహారాష్ట్ర, హర్యానా గురించి తాను స్టడీ చేయలేదని, మరోసారి ఇలాంటి కార్యక్రమాలకు పిలిస్తే స్టడీ చేసి వస్తానంటూ నవ్వులు కురిపించారు. తాజా ఎన్నికల్లో ఓటమిపై పార్టీ అగ్రనేత రాహుల్‌తో పోస్ట్ మార్టం చేస్తే బాగుంటుంది గానీ.. ఆజ్ తక్ సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వాల్‌తో పోస్ట్ మార్టం చేస్తే ఏం బాగుంటుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
స్విస్ బ్యాంక్‌లో ని నల్లధనం తెచ్చి.. ప్రతి పేద వాడి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానన్నా ప్రధాని మోదీ గ్యారంటీ ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కానీ ఏడాది కాలంలో ఎంతో సమర్థవంతంగా పాలిస్తున్న తమ సర్కార్‌పై ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారని చురకలంటించారు. రాహుల్, రేవంత్ ట్యాక్స్ (ఆర్ఆర్ ట్యాక్స్) పేరుతో ఆరోపణలు చేస్తున్న మోదీ.. ఇందుకు సంబంధించి ఒక్క ఎవిడెన్స్ ఉన్నా చూపాలని సవాల్ విసిరారు.
ఏ రాష్ట్రంలో రుణమాఫీ చేశారో చెప్పండి
తొలి పది నెలల్లో 25,35,000 మంది రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ చెప్పారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏడాది కాలంలో తమ సర్కార్ 55, 143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఏడాదిలో రాష్ట్రంలోని మహిళలు చేసిన ఉచిత బస్సు ప్రయాణాలకు గాను ఆర్టీసీకి రూ. 4 వేల కోట్లు చెల్లించిందని వెల్లడించారు.
తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యం అందించాం
తమ ఏడాది పాలనలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించామని సీఎం చెప్పారు. ఇదే బీఆర్ఎస్కు తమ ప్రభుత్వానికి ఉన్న తేడా అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఇన్ స్టాల్మెంట్ రూపంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చేవని, తమ ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నదని తెలిపారు. ఈ కోల్పోయిన ప్రజాస్వామ్యాన్ని తిరిగి ప్రజలకు అందించామని చెప్పారు. ఇదే కాంగ్రెస్ సర్కార్ ఫస్ట్ గెలుపని చెప్పారు.
దేశంలోనే ఈ ఏడాది తెలంగాణలో అత్యధికంగా కోటి. 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేశామన్నారు. అలాగే రాష్ట్రంలో మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, 360 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. వైబ్రంట్ గుజరాత్ కు పోటీకిగా రైజింగ్ తెలంగాణ పేరుతో కౌంటర్ ప్రాడెక్ట్ ను షురూ చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో వైబ్రంట్ గుజరాత్ ను వెనక్కి నెట్టి.. రైజింగ్ తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
మాది రైతుల తల్లి
బీఆర్ఎస్ హయాంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం రాజుల తల్లిగా ఉందని రేవంత్ విమర్శించారు. ఇటీవల తమ సర్కార్ ఆవిష్కరించిన విగ్రహం రైతుల తల్లిగా అభివర్ణించారు. తాము రైతుల బిడ్డలమని, అందుకే రైతు తల్లి కన్న బిడ్డగా అమ్మను రూపొందించుకున్నామని చెప్పారు. తామెప్పుడు రాజుల బిడ్డలుగా లేమని, అలాంటి రాజుల తల్లిని తామెప్పుడు చూడలేదని అన్నారు. అందుకే విగ్రహాన్ని మార్చినట్లు క్లారిటీ ఇచ్చారు.
కేబినెట్ ప్రస్తావనే లేదు: మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం
పార్లమెంట్లో శుక్రవారం కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం కాసేపు తెలుగు మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ చిట్ చాట్ చేశారు. సినీ నటులు అల్లు అర్జున్ అరెస్ట్, మోహన్‌బాబు అంశం, కేబినెట్ విస్తరణ అంశాలపై మాట్లాడారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని సీఎం అన్నారు. ‘‘చట్టం ముందు అందరూ సమానులే. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు”అని చెప్పారు.
అయితే మీడియా ప్రతినిధిపై నటుడు మోహన్ బాబు దాడి చేసిన విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ పై చర్చేమీ లేదని సీఎం స్పష్టం చేశారు. ఓవైపు పార్లమెంట్ సమావేశాలు, ఇంకో వైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇలాంటి తరుణంలో కేబినెట్ ప్రస్తావన ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.