కులగణనతో ఏ పథకం రద్దు కాదు.. సీఎం రేవంత్

కులగణనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందాలంటే కులగణన సర్వే జరగాలని, సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలని రేవంత్ చెప్పారు. రాజకీయ, ఉద్యోగ రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు అందేలా తాము చూస్తామని స్పష్టం చేశారు. అంతేగానీ ఎవరి ఆస్తులు లాక్కోబోమని, ఎవరి రిజర్వేషన్లు గుంజుకోబోమని వెల్లడించారు.ఇది ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తొలగించడానికి కాదని, కులగణన సర్వే మెగా హెల్త్ చెకప్ లాంటిదని వెల్లడించారు.

ప్రజలను మభ్యపెట్టేందుకు కొందరుంటారని, పదేండ్లలో వారికి నిరుద్యోగులు, అశోక్ నగర్ చౌరస్తా గుర్తుకు రాలేదని అన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో పిల్లలను రెచ్చగొట్టి వాళ్లు అమరులైతే.. అధికారంలోకి వచ్చి మనల్ని తొక్కేశారని చెప్పారు. పదేండ్ల తర్వాత తెలంగాణ సమాజం తేరుకొని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నదని అన్నారు. ప్రస్తుతం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే మళ్లీ కుట్రలకు తెరలేపుతున్నారనీ, వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులదేనని చెప్పారు.