- యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే
- పద్మ అవార్డుల్లోనూ తెలంగాణకు అన్యాయం
- అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ స్టూడెంట్స్‌కు ఫీజు రీయింబర్స్మెంట్
- ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు65 ఏండ్లకు పెంచే ఆలోచన ఉందని వెల్లడి
- అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాల పరిధిలో ఉండే యూనివర్సిటీలపై పెత్తనం చెలాయించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై చూస్తూ ఊరుకోబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందేనని అన్నారు. అలా చేయకపోతే అవసరమైతే నిరసనలకు వెనకాడబోమని తెలిపారు. ఈ విషయంలో తమిళనాడు, కర్నాటక, కేరళ, ఏపీ సీఎంలతో మాట్లాడాలని భావిస్తున్నట్టు చెప్పారు. వర్సిటీలపై ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచన వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని, ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళ్తే కొంతమంది చేసే విష ప్రచారానికి వర్సిటీలు వేదికలు అవుతాయని తెలిపారు. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదని, అనవసర వివాదాలకు దారితీస్తుందని తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. దీంతోపాటు కొత్తగా నిర్మించనున్న 3 భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యూజీసీ నిబంధనలు మార్చాలనుకోవడం సాంస్కృతిక, రాజ్యాంగంపై దాడి చేయడమేనని పేర్కొన్నారు. ఈ విషయంలో మేధావులందరూ ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ట్రాల అధికారాల విషయంలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నప్పటికీ.. దాని స్ఫూర్తికి విరుద్ధంగా చేసే ప్రయత్నాలపై సమిష్టిగా కొట్లాడుతామని తెలిపారు. ‘‘ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ కుట్రను మాపై దాడిగానే భావిస్తాం. ఆ ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా చేస్తూపోతే చివరకు స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ లు కేవలం పన్నులు వసూలు చేసుకునే సంస్థలుగా మిగిలిపోతాయి’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. హక్కులను వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా మేధావులు ఆలోచన చేయాలని కోరారు.
ఓపెన్ వర్సిటీ స్టూడెంట్స్‌కు ఫీజు రీయింబర్స్ మెంట్
తెలంగాణ సమాజానికి చికిత్స అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ వీసీలపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొన్నేండ్లుగా విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, సీఎంగా బాధ్యత తీసుకున్న మరుక్షణం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తాను ఎంత ప్రాధాన్యత ఇచ్చానో.. యూనివర్సిటీల వీసీల నియామకానికి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చినట్టు చెప్పారు. వర్సిటీ వీసీల నియామకంలో సామాజిక న్యాయం అనే కోణానికి కూడా ప్రాధాన్యతనిచ్చామని సీఎం స్పష్టం చేశారు.
Also Read : ఫామ్‌హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు
వందేండ్లు పూర్తి చేసుకున్న ఉస్మానియా వర్సిటీకి దాని చరిత్రలో ఏ రోజూ ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వైస్ చాన్స్‌లర్‌గా నియమాకం కాలేదన్నారు. అయితే తమ ప్రభుత్వం ఆ సామాజిక వర్గం నుంచి విద్యావేత్తను వీసీగా నియమించిందని తెలిపారు. ఓపెన్ వర్సిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో సీఎస్ శాంతి కుమారి వివరాలు తెప్పించుకుని సానుకూల నిర్ణయం తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
పద్మ అవార్డుల్లోనూ రాష్ట్రానికి అన్యాయం
పద్మ అవార్డుల విషయంలోనూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమల రావు లాంటి వారిని గుర్తించకపోవడం దారుణమని పేర్కొన్నారు. పద్మ అవార్డులపై ఈ వేదికగా అసంతృప్తిని కేంద్రానికి తెలియజేస్తున్నట్టు తెలిపారు.
త్వరలోనే ప్రధానికి ఈ విషయంపై లేఖ రాయబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి, వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి తో పాటు ప్రొఫెసర్లు, మేధావులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలి
యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలని, మన కండ్ల ముందే వాటి ప్రతిష్ట దిగజారుతుంటే చూస్తూ ఊరుకుంటే ఈ సమాజానికి అన్యాయం చేసిన వాళ్లమవుతామని సీఎం రేవంత్ అన్నారు. అనుభవం కలిగిన అధ్యాపకుల సేవలను వినియోగించుకోవాలన్న ఆలోచన చేస్తున్నామని, వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచాలనే ఆలోచన ఉందన్నారు. వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించినట్టు తెలిపారు.
పదేండ్లకు అవసరమైన ప్రణాళికలను వీసీలు సిద్ధం చేస్తే.. వాటిని అమలు చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. దేశానికి పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి లాంటి వారిని అందించిన ఘనత యూనివర్సిటీల దేనని తెలిపారు. రంగుల గోడలు.. అద్దాల మేడలు అభివృద్ధి కాదని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారని అన్నారు.