- విద్యా వ్యవస్థను మార్చేస్తం
- విద్యా ప్రమాణాలు పెంచాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నం
- విద్యా సంస్థలకు గ్రీన్‌చానల్ ద్వారా నిధులు.. ప్రతినెల 10లోపే చెల్లింపులు
- డైట్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- ఫుడ్ పాయిజన్ ఘటనల్లో ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు
- వచ్చే అకడమిక్ ఇయర్ కోసం ముందే ప్రణాళికలు రూపొందిస్తమని వెల్లడి
- రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్స్ స్కూల్స్‌లో కామన్ డైట్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లలోని పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉన్నదని తెలిపారు. వారి డైట్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయనే అంశం తన దృష్టికి వచ్చిందని, ఇక నుంచి ప్రతి నెలా 10లోగా గ్రీన్ చానల్ ద్వారా నిధులు రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
శనివారం రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్‌ను ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, హాస్టళ్లలో ఒకే విధమైన మెనూ అమలు చేస్తున్నారు. పెంచిన డైట్ చార్జీలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెనూ రూపొందించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో రేవంత్ ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
పిల్లలతో కలిసి అక్కడే లంచ్ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో సంపూర్ణ విశ్వాసం కల్పించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు.
‘‘స్టూడెంట్లకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉంది. ఆ బాధ్యతను మనం గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను నిర్లక్ష్యం చేయొద్దు. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థిని చనిపోవడం బాధాకరం” అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలు
వారంలో రెండు, మూడు రోజులు రెసిడెన్షియల్ స్కూల్స్‌ను సందర్శించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘విద్యార్థులు రాష్ట్ర సంపద. నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇది ఖర్చు కాదు.. భవిష్యత్ తరాలకు పెట్టుబడిగా చూడాలి. భవిష్యత్‌లో నేను ఎక్కడికి వెళ్లినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్త. ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తప్పవు.
Also Read:-డిసెంబర్ 15, 16న గ్రూప్ 2 ఎగ్జామ్స్...రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలు..
విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయండి. వారు తినే ఆహారాన్ని వాళ్లే మానిటరింగ్ చేసుకునే వీలు కల్పించండి’’ అని అధికారులను ఆదేశించారు. ‘‘జిల్లా కలెక్టర్ నుంచి లోకల్ ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎస్సై వరకు అధికారులు అందరూ హాస్టళ్లను సందర్శిస్తారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారు. సీఎస్ నుంచి లోకల్ అధికారుల వరకు హాస్టళ్లను సందర్శించాలని ఆదేశాలు ఇచ్చాం. వారిని చూసి మన విద్యార్థులు ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచేలా ఆలోచన చేస్తున్నం. విద్యార్థుల విషయంలో ప్రభుత్వం రాజీ పడడం లేదు. బాగా చదువుకొని నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలి” అని వ్యాఖ్యానించారు.
వచ్చే విద్యా సంవత్సరం కోసం ముందే ప్రణాళికలు
70 ఏండ్లనుంచి నేర్చుకున్నదేంటని, ఇప్పటికీ వచ్చే విద్యా సంవత్సరం కోసం ముందు నుంచే ఎందుకు ప్రణాళికలు వేసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇది ప్రభుత్వం తరఫున ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వీటికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇది మన బాధ్యత అని, ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేమని చెప్పారు. ‘‘ఫుడ్ పాయిజన్ జరిగి ఈ మధ్య ఒక బాలిక మరణించింది.. ఆ బాలిక తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు.
శ్రీమంతుడుకి, పేదవాడికి వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుంది. మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే.. మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది మన గౌరవ ప్రతిష్టలను పెంచేదా? లేదా తగ్గించేదా? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని సీఎం పేర్కొన్నారు.
రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు
రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుకున్న వారు ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఎంపికయ్యారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న బుర్రా వెంకటేశం, ఐపీఎస్ అయి డీజీపీ హోదాలో రిటైర్ అయిన మహేందర్ రెడ్డి ఉన్నారని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుకున్న వాళ్లు ఎంతో మంది గొప్పగా రాణించారని వివరించారు. డైట్, కాస్మోటిక్, మౌలిక వసతులకు గత కేసీఆర్ సర్కారు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు.
ఇది ప్రజా ప్రభుత్వం అని నిరూపించేందుకు సింగిల్ స్ట్రోక్‌లో డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పెరిగిన ధరలు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచామని చెప్పారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇంత మొత్తం పెంచడం ఎక్కడా జరగలేదని అన్నారు. ‘‘ఇప్పటికే రైతులకు ఉచితంగా 24 గంటలు, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం.
అందుకే విద్యార్థులకు ఎందుకు ఇవ్వొద్దని ఆలోచించాం. రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాల, గురుకులాలకు ఉచితంగా విద్యుత్ అందించాలని నిర్ణయించాం. ఒక్క రూపాయి కూడా కరెంట్ బిల్లు చెల్లించొద్దు’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని,11వేల ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్‌లో చదువు చెప్పేవారికి ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఎక్కువ అర్హత ఉంటుందా? అని ప్రశ్నించారు. ‘‘మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్‌ను మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం. ఎందుకు మనం ఆ ఆలోచన చేయకూడదు. ఇది మన బాధ్యత కాదా?”అని సీఎం ప్రశ్నించారు.
నేనే స్వయంగా మానిటర్ చేస్త
స్టూడెంట్స్ ఫుడ్ విషయంలో వస్తున్న సమస్యలపై స్వయంగా సమీక్షించానని, బిల్లుల సమస్య ఉందని చెప్పారని, అందుకే ఇక నుంచి ప్రతి నెలా 10వ తేదీలోపు గ్రీన్ చానల్ ద్వారా నిధులు చెల్లిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా రెసిడెన్షియల్ విద్యాలయాలకు బిల్లులు చెల్లిస్తామని, స్వయంగా దీన్ని తానే మానిటరింగ్ చేస్తానని చెప్పారు. విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పని రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించామని, కుట్టు పనికి ఇచ్చే చార్జీలు రూ.25 నుంచి రూ.75 కు పెంచామని వివరించారు.
‘‘ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు టాలెంట్ ఎక్కువ అని, వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూళ్లలోని విద్యార్థులకు తక్కువ అనే అపోహ కొన్నేళ్లుగా బలంగా నాటుకుపోయింది. అలాంటి అపోహలను తొలగించాలని ప్రజా ప్రభుత్వం మరింత ప్రయత్నిస్తున్నది” అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు 1971 ప్రాంతంలో మునుగోడు లోని సర్వేల్లో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించారని గుర్తు చేశారు.
టాలెంట్‌కు సాన పెట్టండి
నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని సీఎం రేవంత్ అన్నారు. అందుకే రాష్ట్రంలో 75 ఐటీఐలను టాటా సంస్థతో కలిసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేశామని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ వర్సిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించిన వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిఖత్ జరీన్, సిరాజ్ లాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.
‘‘క్రీడల్లో రాణించండి. మీలో టాలెంట్‌కు సాన పెట్టండి’’ అని సీఎం సూచించారు. విద్యార్థుల్లో ఉన్న ఇతర టాలెంట్‌ను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు. వారికి కావాల్సిన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.2028 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. కార్పొరేట్‌కు ధీటుగా ప్రతీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
విద్యార్థులు రాష్ట్ర సంపద. నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇది ఖర్చు కాదు.. భవిష్యత్ తరాలకు పెట్టుబడిగా చూడాలి. భవిష్యత్‌లో నేను ఎక్కడికి వెళ్లినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్త. ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తప్పవు. విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయండి. వారు తినే ఆహారాన్ని వాళ్లే మానిటరింగ్ చేసుకునే వీలు కల్పించండి.