
తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్ పై ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం ( మార్చి 22 ) జరిగిన ఈ మీటింగ్ లో డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయని.. ఈ ఘనత తమిళనాడు సీఎం స్టాలిన్ దే అని అన్నారు. కుటుంబ నియంత్రణ విజయవంతం చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు సీఎం రేవంత్. ప్రస్తుతం దేశం పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందని.. బీజేపీ జనాభా జరిమానాల విధానాన్ని కొనసాగిస్తోందని అన్నారు.
1971లో జనాభాను నియంత్రించాలని దేశం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తే ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమయ్యాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయని, జీడీపీ, తలసరి ఆదాయం, ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయని అన్నారు రేవంత్.
Also Read : ప్రమాదంలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి
దేశ ఖజానాకు దాక్క్షిణాది రాష్ట్రాలు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ తక్కువ మొత్తాన్ని పొందుతున్నాయని అన్నారు. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తున్నాయని.. ఉత్తర ప్రదేశ్‌కు రూపాయికి రెండు రూపాయల 73 పైసలు వెనక్కి వెళుతున్నాయని అన్నారు. బీహార్ రూపాయి చెల్లిస్తే 9 రూపాయల 22 పైసలు వెనక్కి తీసుకుంటుంటే.. కర్ణాటకకు కేవలం 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయని అన్నారు రేవంత్. అదే సమయంలో మధ్య ప్రదేశ్ రూపాయి పన్ను రూపంలో కేంద్రానికి ఇస్తే వెనక్కి రూ.2.79 పైసలు వెళుతున్నాయని అన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు పన్ను చెల్లింపులు క్రమంగా తగ్గిస్తోందని.. చివరకు జాతీయ ఆరోగ్య మిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60 నుంచి 65 శాతం నిధులు దక్కుతున్నాయని అన్నారు రేవంత్. దేశాన్ని గౌరవిస్తాం కానీ.. పునర్విభజనను ఒప్పుకోమని అన్నారు. పునర్విభజన చేపట్టకుండా బీజేపీని అడ్డుకోవాలని అన్నారు సీఎం రేవంత్.
సీట్లు పెంచొద్దు:
సీట్లు పెంచకుండా ఉన్న సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని.. 1976లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అలానే పునర్విభజన చేపట్టిందని గుర్తు చేశారు. లేకుంటే రాష్ట్రాల మధ్య అసమతౌల్యాలు వచ్చేవని అన్నారు.2001లో అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయీ నేతృత్వంలోని ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అలానే ప్రారంభించిందని... లోక్‌సభ సీట్లను అదే సంఖ్యలో ఉంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే విధంగా చేయగలరా అని ప్రశ్నించారు.
ప్రోరేటా విధానానికి వ్యతిరేకం:
జనాభా దామాషా ప్రాతిపదిక పునర్విభజను దక్షిణాది వ్యతిరేకిస్తోందని.. బీజేపీ అనుసరిస్తున్న ఈ విధానానికి వ్యతిరేకంగా దక్షిణాది ప్రజలు, పార్టీలు, నాయకులు ఏకం కావాలని అన్నారు. ప్రొరేటా విధానాన్ని అంగీకరించలేమని.. ప్రొరేటా విధానం కూడా దక్షిణాదికి నష్టమే కలిగిస్తుందని.. ప్రొరేటా ప్రక్రియ కూడా రాజకీయ అంతరాలను పెంచుతుందని అన్నారు. ప్రొరేటా విధానాన్ని పాటిస్తే సీట్ల మధ్య తేడా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయిస్తుంది.. ఒక్క సీటు కూడా తేడాను చూపుతుందని అన్నారు.
ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర మన దేశంలో ఉందని.. కాబట్టి ప్రొరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని అన్నారు రేవంత్.
25 ఏళ్ళ పాటు ఎలాంటి మార్పు వద్దు:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయీ విధానాన్ని పాటించడమే ఉత్తమమని.. మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లలో ఎటువంటి మార్పు తీసుకురావద్దని అన్నారు రేవంత్. సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని అన్నారు.
- పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలి
- రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలి
- రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల హద్దులను మార్పు చేయాలి..
- తాజా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలి...
- ప్రతి రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి..
- లోక్ సభ స్థానాల పెంపును మరో 25 ఏళ్లపాటు వాయిదా వేయాలి..
దక్షిణాదికి 33శాతం సీట్లివ్వాలి:
543 సీట్లు ఉన్న లోక్‌సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130.. ఇది మొత్తం సీట్లలో 24 శాతం.. పునర్విభజన తర్వాత ఏర్పడే నూతన లోక్‌సభలో మాకు 33 శాతం సీట్లు ఇవ్వాలనేది దక్షిణాది రాష్ట్రాలుగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు రేవంత్. బీజేపీ 50 శాతం సీట్లను పెంచాలనుకుంటే అలా పెరిగే 272 సీట్లతో మొత్తం లోక్ సభ సీట్ల సంఖ్య 815 అవుతుందని... ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం అంటే 272 సీట్లు ఇవ్వాలని అన్నారు.
ఈ సీట్లను దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలకు ఇప్పుడున్న ప్రొరేటా ప్రాతిపదికన పంచవచ్చని అన్నారు.