డ్రగ్స్ కేసు బయటికి తీస్తం: సీఎం రేవంత్ రెడ్డి

డ్రగ్స్ కేసు  బయటికి తీస్తం: సీఎం రేవంత్ రెడ్డి
  • సినీ నిర్మాత కేదార్.. కేటీఆర్ బిజినెస్ పార్ట్ నర్
  • కేదార్ మృతిపై అనుమానాలున్నయ్
  • దుబాయ్ లో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు?
  • ఇటీవలే 3 అనుమానాస్పద మరణాలు
  • వీటిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదు
  • బీజేపీ గెలుపుకోసం బీఆర్ఎస్ పనిచేస్తోంది
  • సీబీఐని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ ను విలీనం చేసుకునే ప్రయత్నంలో బీజేపీ
  • ఐదు ప్రాజెక్టుల కోసం ప్రధానిని విన్నించాను
  • అవి తెస్తే కిషన్  రెడ్డి, బండి సంజయ్ కి సన్మానం చేస్తాం
  • ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్

ఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ సెలగంశెట్టి  మృతిపై అనుమానాలున్నాయని, దుబాయ్ లో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో తేలాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మృతిపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేదార్ మరణంతో లింకు ఉన్న డ్రగ్స్ కేసును బయటికి తీసి విచారణ చేస్తామని సీఎం చెప్పారు. త్వరలోనే కేదార్  మృత దేహం ఇండియాకు రానుందని అన్నారు. ఇవాళ ఢిల్లీలో  మీడియాతో సీఎం చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలో ఇటీవల మూడు అనుమానస్పద మరణాలు సంభవించాయని చెప్పారు. 

డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న అడ్వొకేట్  సంజీవ రెడ్డి, కేసు వేసిన రాజలింగమూర్తి మృతి చెందారని, వాటిపై కేటీఆర్ న్యాయవిచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ గెలుపుకోసం పనిచేస్తోందని అన్నారు. సిబీఐ కేసులు అడ్డం పెట్టుకొని బీఅరెస్ ను విలీనం చేసుకోవాలని ఆలోచనలో బీజేపీ ఉందని సీఎం  చెప్పారు. ఫార్ములా ఈ, గొర్రెల పంపిణీ కేసులో కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయిందని, ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు.  

ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు మానిటరింగ్ చేస్తోందని, విదేశాల్లో ఉన్న వారిని తీసుకు రావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న వారు కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా.? అని అన్నారు.  కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల పై కమిషన్ విచారణ సాగుతోందని చెప్పారు. రాత్రిరాత్రికి తాము ఎవరినీ అరెస్ట్ చేయబోమని, అది తమ విధానం కాదని సీఎం చెప్పారు. 

కమీషన్లు రావనే ఎస్ఎల్బీసీ పక్కకు..

మాజీ సీఎం కేసీఆర్ కమీషన్లు రావనే ఎస్ఎల్బీసీ పనులను పక్కన పెట్టారని సీఎం అన్నారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా ఎస్ఎల్బీసీని 100% పూర్తిచేసి తీరుతామని చెప్పారు.  పెరిగిన అంచనాలతో కలిపి 5000 కోట్ల లోపే ఎస్ఎల్బీసీ పూర్తవుతుందని, దీని ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు  నీరందుతుందని చెప్పారు.  టన్నెల్ లో చిక్కుకున్న వారిని బయటికి తీసుకొచ్చేందుకు జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో 11 సంస్థలు పనిచేస్తున్నాయని వివరించారు. 

నిధులు తెస్తే కేంద్ర మంత్రులను సన్మానిస్తా

తాను ప్రధాన మంత్రికి ఐదు విజ్ఞప్తులు చేసి, వినతిపత్రాలు అందించానని, వాటికి నిధులు తీసుకొస్తే బహిరంగ సభ ఏర్పాటు చేసి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి సన్మానం చేస్తానని సీఎం చెప్పారు. ఆ క్రెడిట్ కూడా వాళ్లే తీసుకోవచ్చిన చెప్పారు. హైదరాబాద్ కు మెట్రో తీసుకొచ్చింది  దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అని అన్నారు. మెట్రోను కేబినెట్ ముందుకు రాకుండా అడ్డుకున్నది కిషన్ రెడ్డి అని క్లారిటీ ఇచ్చారు. 

నా పాలన అద్భుతం

తన పాలన అద్భుతంగా ఉందని, ఎవరి ఫోన్లు వారే వింటున్నారని సీఎం  రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్లు స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నారని చెప్పారు. తన కేబినెట్ లో అనుభవజ్ఞులైన మంత్రులు ఉన్నారని, వారి శాఖలను వారే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. కేంద్రానికి ఎంత మొత్తంలో పన్నులు కడుతున్నామో రాష్ట్రాలకు అంతే వాటా రావాలని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ చెబుతున్నారని, ఎలా వస్తాయో తనకు అర్థం కావడం లేదని సీఎం అన్నారు. 2014 నుంచి 2014 వరకు( బీఆర్ఎస్ ప్రభుత్వం) ఉన్న శాసన వ్యవస్థే ఇప్పుడు కూడా ఉందని అన్నారు. 

కేసీఆర్ కు కిషన్ రెడ్డి పార్ట్నర్

మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్ నర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. మెట్రో విస్తరణ జరిగితే తనకు  పేరొస్తుందని అనుకుంటున్నారని చెప్పారు.  అందుకే  కేసీఆర్ హయాంలో జరగలేదు  కాబట్టి ఇప్పుడు కూడా జరగొద్దని భావిస్తున్నారని అన్నారు. అందుకే కేంద్ర కేబినెట్ లో మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని చెప్పారు.