రైతుకు బేడీలపై సీఎం సీరియస్​.. విచారణకు ఆదేశాలు..

  • ఇలాంటి చర్యలను సహించేది లేదని  అధికారులకు వార్నింగ్​
  • విచారణ జరిపి రిపోర్ట్​ ఇవ్వాలి
  • రైతుకు మెరుగైన వైద్యం అందించాలి
  • ఢిల్లీ నుంచి ఆఫీసర్లకు ఆదేశాలు
  • చికిత్స కోసం బేడీలతో రైతునుహాస్పిటల్​కు తీసుకొచ్చిన పోలీసులు
  • విషయం తెలిసి ఎంక్వైరీకి ఆదేశించిన సీఎం
  • ఘటనకు బాధ్యులైన జైలర్​ సస్పెన్షన్​

హైదరాబాద్, వెలుగు:  లగచర్ల రైతు హీర్యానాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో పోలీసులు తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేడీలు వేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆయన సీరియస్​ అయ్యారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని.. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఢిల్లీ నుంచి సీఎం రేవంత్​ ఆదేశించారు. హీర్యానాయక్​కు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి హాస్పిటల్​ నుంచి హీర్యానాయక్​ను హైదరాబాద్​లోని నిమ్స్​కు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్​ హాస్పిటల్​ డైరెక్టర్​ బీరప్ప స్పందించారు. పేషెంట్ కండిషన్ నిలకడగా ఉందని తెలిపారు. ఈసీజీ, 2డీఎకో, బీపీ, అన్నీ చెక్​ చేశామని.. అన్నీ నార్మల్​గానే ఉన్నాయని వెల్లడించారు. మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆఫీస్​ నుంచి స్పెషల్​ ఇన్​స్ట్రక్షన్స్​ వచ్చాయని  తెలిపారు. జనరల్​ ఫిజీషియన్స్, కార్డియాలజీ డాక్టర్లతో చికిత్స అందిస్తున్నామని వివరించారు.

గత సర్కార్​ హయాంలోనూ ఇలాంటి ఘటనలే!

గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. 2016లో ఖమ్మం జిల్లాలో మిర్చి పంట విపరీతంగా పండింది. దీంతో ఖమ్మంలోని మార్కెట్ కు మిర్చి పోటెత్తింది. లక్షల బస్తాల మిర్చిని రైతులు అమ్మకానికి తెచ్చారు. పంట అధికంగా పండిన ఫలితంగా గిట్టుబాటు ధర పతనమైంది. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటకు సరైన ధర పలకకపోవడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుచుకుంది. మార్కెట్ ఆవరణలోని ఎలక్ట్రానిక్ కాటాలను.. మార్కెట్ లోపల కుర్చీలు, బల్లలు ధ్వంసం చేశారు.  రైతులపై పోలీసులు లాఠీచార్జ్​ చేసి.. 18 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత రైతుల చేతులకు బేడీలు వేసి మరీ జైలుకు తరలించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ అంశంపై నాటి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్​, బీజేపీ.. అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ను తీవ్రంగా విమర్శించాయి. అన్నం పెట్టే రైతులు గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తే వాళ్ల చేతులకు బేడీలు వేయడం ఏమిటని మండిపడ్డాయి. ఇక, 2022లో గౌరవెల్లి ప్రాజెక్ట్​ నిర్వాసిత రైతుల విషయంలోనూ గత ప్రభుత్వం బేడీలు వేసింది.

అప్పుడు గౌరవెల్లి ప్రాజెక్ట్​లో పరిహారం కోరుతూ ఆందోళన చేస్తున్న  రైతులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించడమే కాకుండా.. వారికి బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లడంపై ప్రతిపక్ష పార్టీలు అప్పట్లో తీవ్ర విమర్శలు గుప్పించాయి. అలాంటిది ఇప్పుడు కూడా పోలీసులు అలానే వ్యవహరించడంపై సీఎం రేవంత్​రెడ్డి సీరియస్​ అయ్యారు. ఇలాంటి చర్యలను ప్రజాప్రభుత్వం సహించదని వార్నింగ్​ ఇచ్చారు. 

జైలర్​ సస్పెన్షన్

రైతు హీర్యానాయక్​కు బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటనపై జైళ్ల శాఖ సీరియస్ యాక్షన్ తీసుకుంది. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్లు గుర్తించింది. దీనికి బాధ్యులైన సంగారెడ్డి సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జైలర్లు సంజీవరెడ్డిపై  సస్పెన్షన్ వేటు వేసింది. సంతోష్‌‌‌‌‌‌‌‌ రాయ్​​పై చర్యలకు సిఫార్సు చేసింది.

ఈ మేరకు జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జైలు రికార్డులో హీర్యానాయక్ లగచర్ల కేసులో నిందితుడిగా కాకుండా బాలానగర్ లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నట్టు జైలు సిబ్బంది రాశారు. ఈ మొత్తం ఘటనపై హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ విచారణ జరుపుతున్నారు.