మొత్తం తెలంగాణకు ‘గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్’ తయారు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నామని.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించామని తెలిపారు.
‘‘3 జోన్లలో ఎలాంటి అభివృద్ధి జరగాలి.. ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కావాలి అన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం” అని ఆయన చెప్పారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.