ఈ ఏడాది పేదలకు 4.50 లక్షల ఇండ్లు... సీఎం రేవంత్ రెడ్డి

ఈ ఏడాది పేదలకు 4.50 లక్షల ఇండ్లు... సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇంది రమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఒక్క ఏడాదే రూ.22,500 కోట్లు వెచ్చించి  పేదల కోసం 4 లక్షల 50 వేల ఇండ్లు నిర్మించబోతున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున వీటిని ఇవ్వబోతున్నామని చెప్పారు.

 తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్​గా తీర్చిదిద్దాలని సంకల్పించామన్నారు. ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాల తో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణ యించామని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసిందని అన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాల ల కింద 26,825 స్కూళ్లలో మౌలిక సదుపా యాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లు నిర్మాణం, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. దీని కోసం రూ.1,135 కోట్ల  కేటాయించామని.. రాష్ట్రంలోని 50 ఐటీఐలలో సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. 

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

దావోస్ పర్యటనలో భాగంగా రూ. 40 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నామని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు.  ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డు అని తెలిపారు. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణ మొదలుపెట్టామని.. తద్వారా యువత ఉపాధి, ఉద్యోగ కల్పనకు ఈ ప్రభుత్వం కంకణబద్ధమై ఉందని స్పష్టం చేశారు.

మహాలక్ష్మీ పథకం ద్వారా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది తమ సంకల్పం అని అన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. విద్యార్థుల యూనిఫార్మ్స్ కుట్టే ఆర్డర్ మహిళా సంఘాలకే అప్పగించామని.. గ్యాస్ సిలిండర్​ను కేవలం 500 రూపాయలకే ఇచ్చే పథకాన్ని ప్రారంభించామని అన్నారు.