న్యూయార్క్, టోక్యోతో సమానంగా హైదరాబాద్ ను నడిపిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం ( డిసెంబర్ 3, 2024 ) జూ పార్క్ - ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభించారు సీఎం. రూ. 636 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ 24 మీటర్ల వెడల్పు, 4.4 కిలోమీటర్ల వెడల్పు ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడుతోందని..న్యూయార్క్, టోక్యో నగరాలతో సమానంగా హైదరాబాద్ ను నడిపిస్తామని అన్నారు. 

హైదరాబాద్ లో అద్భుతమైన మౌలిక సదుపాయాలను కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు సీఎం రేవంత్. రూ.7 వేల కోట్లతో హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడుతున్న సహచరులకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని అన్నారు. 

ప్రపంచవ్యాప్త సాంకేతిక అభివృద్ధిలో హైదరాబాదీల పాత్ర ఉందని.. దేశానికి కంప్యూటర్ ను రాజీవ్ గాంధీ పరిచయం చేశారని అన్నారు సీఎం రేవంత్. ఔటర్ రింగురోడ్డు, ఫార్మా కంపెనీలు కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ కు వచ్చాయని అన్నారు. నగరంలో పేదల కోసం పీజేఆర్ పోరాడారని అన్నారు. హైదరాబాద్ లో తాగునీటి సమస్యను తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు సీఎం రేవంత్.