కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

  •  అందుకోసం గ్రామ, వార్డు  సభలు నిర్వహించాలి
  • 4 స్కీమ్​ల అమలుకు 15లోగా గ్రౌండ్ వర్క్ పూర్తవ్వాలి
  •  పంట వేసినా వేయకున్నా సాగు భూములకు రైతు భరోసా
  • భూమి లేని, ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి పని చేసినోళ్లకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
  • అత్యంత నిరుపేదలకే మొదట ఇందిరమ్మ ఇండ్లు.. అర్హుల జాబితాకు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఆమోదం తప్పనిసరి
  • గతంలో ఉన్న రూల్స్ ప్రకారమే రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడి
  • కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి..  ఫీల్డ్​లో తిరగాలని ఆర్డర్​
  • 26 తర్వాత జిల్లాలకు వస్తానని, పనితీరు బాగాలేకుంటే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి అర్హుల ఎంపిక పక్కాగా జరగాలని కలెక్టర్లను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. చరిత్రాత్మకమైన ఈ పథకాలను సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని చెప్పారు. ‘‘ఈ నాలుగు స్కీమ్ ల అమలుకు అర్హుల ఎంపిక కోసం ప్రత్యేక గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి. అర్హుల వివరాలు, వాళ్ల ఎంపికకు అనుసరించిన విధివిధానాలతో జాబితాలు తయారు చేసి గ్రామసభల్లోనే వెల్లడించాలి.

ఈ నెల 11 నుంచి 15లోగా ఈ పథకాల అమలుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలి. ఇందుకోసం జిల్లా ఇన్ చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్లతో కలిసి సమావేశాలు నిర్వహించాలి” అని ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ లోని సెక్రటేరియెట్​లో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. స్కీమ్​ల అమలుకు అర్హులను ఎలా ఎంపిక చేయాలనే దానిపై దిశానిర్దేశం చేశారు.  గత ప్రభుత్వం సాగుయోగ్యం కాని భూములకు కూడా పెట్టుబడి సాయం అందించిందని, ఈసారి అలాంటి తప్పులు జరగకుండా చూడాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

పంట వేసినా, వేయకున్నా సాగుయోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా ఇస్తామని స్పష్టం చేశారు. సాగుభూముల గుర్తింపు కోసం జిల్లా, మండల స్థాయిలో నోడల్ ఆఫీసర్లను నియమించాలని.. ఆ టీమ్​లు క్షేత్ర స్థాయిలో పర్యటించి సాగులో లేని భూములను గుర్తించాలని సూచించారు. ‘‘రియల్ ఎస్టేట్​వెంచర్లు, లేఅవుట్ చేసిన భూములు, నాలా కన్వర్షన్​అయిన భూములు,  మైనింగ్ కు ఇచ్చిన భూములు, గోదాములు, ఫంక్షన్ హాళ్లు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించిన భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుభరోసా ఇవ్వం. వీటిన్నింటినీ అనర్హత జాబితాలో చేర్చాలి.

ఇందుకోసం గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, డీటీసీపీ లేఅవుట్ రికార్డులు,  సంబంధిత విభాగాల రికార్డులను పరిశీలించాలి. విలేజ్ మ్యాప్ లతో ఫీల్డ్ కు వెళ్లి వీటిని ధ్రువీకరించుకుని గ్రామ సభలో ప్రచురించాలి” అని ఆదేశించారు. భూసేకరణ నోటిఫికేషన్ పూర్తయినా పరిహారం అందని భూముల విషయంలో ఏం చేయాలని ఓ కలెక్టర్​అడగ్గా.. ‘‘ప్రభుత్వం సేకరించిన, సేకరిస్తున్న వాటిలో పరిహారం అందని భూములకు కూడా రైతు భరోసా అందజేయాలి” అని సీఎం స్పష్టం చేశారు. 

మొదట అత్యంత నిరుపేదలకే ఇండ్లు.. 

గూడులేని పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలు జిల్లాలకు చేరాయని చెప్పారు. వారిలో అత్యంత నిరుపేదలకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశామని, అర్హుల జాబితా వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ జాబితాకు జిల్లా ఇన్​చార్జి మంత్రి ఆమోదం తప్పనిసరి అని, ఆ తర్వాత అర్హుల జాబితాను గ్రామసభల్లో పెట్టాలని చెప్పారు. 

భూమి లేని కూలీలకే సాయం..  

భూమి లేని నిరుపేద కూలీ కుటుంబాలను ఆదుకునేందుకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీని కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని చెప్పారు. భూమి లేని, ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన కుటుంబాలకే ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ పథకానికి గైడ్ లైన్స్  ఫైనల్​చేయాలని సూచించారు. 

వన్​స్టేట్.. వన్​ రేషన్ 

గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే కొత్త రేషన్ కార్డు లు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక కుటుంబానికి ఒకేచోట రేషన్ కార్డు ఉండాలని, వేర్వేరు ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ‘వన్ స్టేట్.. వన్ రేషన్’ విధానాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించారు. 

ఆఫీసుల్లోనే కూర్చోవద్దు.. ఫీల్డ్ లో తిరగండి 

కొంతమంది కలెక్టర్లు ఇప్పటికీ ఆఫీసుల్లోనే కూర్చొని పని చేయాలనుకుంటున్నారని, ఇది కరెక్ట్​ కాదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీల్డ్​లో తిరగాలని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ‘‘కొందరు కలెక్టర్లు సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్​అవుతున్నారు. ఫలితంగా జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు కాస్తా రాష్ట్ర స్థాయి దాకా వస్తున్నాయి. కొందరు కలెక్టర్లు తమ పనితీరు మార్చుకోవాలి. సొంత వ్యాపకాలపై శ్రద్ధ తగ్గించి, ప్రజల బాగోగులపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందనే నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉంది.

కలెక్టర్లే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు. మీరు చేసే పనులను బట్టే సర్కారుకు మంచి పేరు వస్తుంది.కలెక్టర్లు ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపర్చుకోవాలి” అని సూచించారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. కాగా, ఇటీవల చేపట్టిన కులగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేసినందుకు కలెక్టర్లను సీఎం అభినందించారు.  

మహిళా ఐఏఎస్​లు బాలికల హాస్టల్స్ కు వెళ్లాలి.. 

మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా బాలికల హాస్టల్స్ విజిట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్కడే రాత్రి బస చేయాలని సూచించారు. విద్యార్థుల అవసరాలు, వారి సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

అర్హుల జాబితాతో ఫ్లెక్సీలు పెట్టాలి: భట్టి 

నాలుగు స్కీమ్​ల అర్హుల జాబితాను ప్రతి గ్రామంలో ఫ్లెక్సీల ద్వారా ప్రచురించాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. పథకాల అమలుకు సంబం ధించిన గైడ్​లైన్స్​తో త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని, వాటికి అనుగుణంగా అర్హులను ఎంపిక చేయాలన్నారు. పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీల సాయం తీసుకోవాలన్నారు. ఇప్పటికే రూ.21 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేశామని, ఆ వివరాలను కూడా ప్రతి గ్రామంలో ప్రచురించాలని చెప్పారు.

ఒక కుటుంబానికి ఒక్క టే ఇల్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అసంపూర్తిగా ఉన్న వాటికి అర్హులను ఎంపిక చేసి, వాటిని వాళ్ల భాగస్వామ్యంతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.