కేసీఆర్ పాపాల భైరవుడు.. తెలంగాణ జాతిపిత ఎట్లయితడు: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ పాపాల భైరవుడు..  తెలంగాణ జాతిపిత ఎట్లయితడు: సీఎం రేవంత్ రెడ్డి
  • రాష్ట్రాన్ని జలగలా పట్టిపీడించిండు.. 
  • ప్రజల కోసం సర్వం ధారబోసిన లక్ష్మణ్​ బాపూజీనో, జయశంకరో జాతిపిత అయితరు
  • జనగామ సభలో సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యలు
  • కేసీఆర్​ నోరు తెరిస్తే అబద్ధాలే
  • ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు
  • ఆయన చేసిన అప్పులకు ఒక్క ఏడాదే రూ. లక్షా 53 వేల కోట్లు కట్టినం
  • 19, 20 తారీఖుల్లో పాపాల చిట్టా విప్పుతా
  • ఇది ఇంటర్వెల్లే..  అసలు కథ ముందుంది
  • అధికారం పోతే బయటకు ఎందుకు రాడు?
  • 80 వేల పుస్తకాలు చదివిన విజ్ఞాన గని.. జనం కోసం ఆ విజ్ఞానం పంచొచ్చు కదా?
  • మొఖం చెల్లక పిల్లకాకులను ఉసిగొల్పుతున్నారని విమర్శ


జనగామ, వెలుగు: నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడమే కేసీఆర్​ పని అని.. పదేండ్లు తెలంగాణను జలగలా పట్టిపీడించారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పజెప్తే దివాలా తీయించారని, ఇప్పుడు మొఖం చెల్లక ఫామ్​హౌస్​లో కూసొని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. ‘‘హరీశ్​రావు అంటడు.. చంద్రశేఖర్​రావు తెలంగాణ జాతిపితనట. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పెటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నోడు.. వందల ఎకరాల్లో ఫామ్​హౌస్​ను కట్టుకున్నోడు.. అడ్డగోలుగా లక్ష కోట్లు సంపాదించుకున్నోడు.. టీవీలు, పేపర్లు పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేసెటోడు ఎట్లయితడు జాతిపిత?! కేసీఆర్​ జాతిపిత కాదు.. పాపాల భైరవుడు” అని వ్యాఖ్యానించారు. 

తెలంగాణ కోసం సర్వం ధారబోసి కొట్లాడిన కొండా లక్ష్మణ్​ బాపూజీనో, ప్రొఫెసర్​ జయశంకరో తెలంగాణకు జాతిపిత అయితరు కానీ తెలంగాణను జలగలా పట్టి పీడించిన, జనం రక్తం తాగిన కేసీఆర్​ ఏనాటికీ కాలేరని ఆయన పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​ శివారు శివునిపల్లి వద్ద ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొన్నారు.  రూ. 800 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అధికారంపోతే బయటకు ఎందుకు రారని, బయటకు రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకని, రూ. 58 లక్షల జీతం ఎందుకని కేసీఆర్​ను ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా  15 నెలల్లో కేసీఆర్​ రూ. 58 లక్షల జీతభత్యాలు తీసుకున్నడు. 

బయటకు రానోడికి, అసెంబ్లీకి రానోడికి ఎందుకు ఆ జీతం? దీనిపై ప్రజలు ఆలోచించాలి.  80 వేల పుస్తకాలు చదివిన విజ్ఞాన గని అని చెప్పుకుంటడు కదా.. మరి, ఆ విజ్ఞానాన్ని తెలంగాణ కోసం ఎందుకు ఉపయోగించడు? బయటకు ఎందుకు రాడు?” అని ఆయన నిలదీశారు. ‘‘పదేండ్లు ఏలినోడు పదినెలలకే దిగిపొమ్మంటున్నడు. ఐదేండ్ల కోసం గదా మీరు కుర్చీ ఇచ్చింది. ఆ కుర్చీలో ఉంటే మళ్లా దోచుకోవచ్చని కేసీఆర్​ అనుకుంటున్నడు. తెలంగాణను పునర్నించుకునేందుకు మీ అందరి అండదండలు మాకు కావాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. నిన్న కొంచెం చెప్పిన, గవర్నర్​ ప్రసంగంలో సగం ఉన్నది. 

ఇవ్వాల జెప్పింది ఇంటర్​వెల్​ మాత్రమే. అసెంబ్లీలో బడ్జెట్​ పెట్టినంక 19, 20 తారీఖుల్లో మిగతా కథ అంతా చెప్త. కేసీఆర్​ పాపాల చిట్టా విప్పుతా” అని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. ప్రొఫెసర్​ జయశంకర్​ సార్​ ఊరిని రెవెన్యూ విలేజ్​ చేయకుండా అవమానించిన చరిత్ర బీఆర్​ఎస్​దైతే.. రెవెన్యూ విలేజ్​ని చేసిన చరిత్ర తమదని తెలిపారు. కాళోజీ కళాక్షేత్రాన్ని అధికారంలోకి వచ్చిన పది నెలల్లో పూర్తి చేసిన చరిత్ర తమదని, పదేండ్లు పడావుపెట్టిన చరిత్ర బీఆర్​ఎస్​ది అని అన్నారు.  

ఆ అప్పులకు ఒక్క ఏడాదిలోనే రూ. లక్షా 53వేలు కోట్లు కట్టినం

ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్​కు అధికారం ఇస్తే రూ. 8 లక్షల 29 వేల కోట్ల అప్పులు చేసి నెత్తిన పెట్టి పోయారని సీఎం రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ధనిక రాష్ట్రాన్ని అప్పజెప్తే.. ప్రజలను ముంచి దోచుకొని.. తెలంగాణను దివాలా తీయించిండు. పదేండ్లలో కేసీఆర్​ చేతికి రూ. 20 లక్షల కోట్లు వచ్చినయ్​. ఈ పైసలు ఎక్కడికి పోయినయో లెక్క జెప్పాలి. ఆయన చేసిన అప్పులకు ఒక్క యేడాదిలోనే రూ. లక్షా 53 వేల కోట్లు కట్టినం. 

ఈ డబ్బులే గనక నా చేతిలో ఉంటే 30 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదలకు కట్టించేవాడిని. కేసీఆర్​ చేసిన అప్పులు పాపాల పుట్టలాగ పెరిగిపోతున్నయ్​. ఇన్ని పాపాలు చేసిన పాపాల భైరవుడు కేసీఆర్​ ఫామ్​హౌస్​ల పండుకుని ఆయన మంది మార్భలాన్ని మాపైకి ఉసిగొల్పుతున్నడు’’ అని వ్యాఖ్యానించారు.

పిల్లకాకులు కాదు.. నువ్వు రా.. చర్చిద్దాం

పిల్ల కాకులతో కాదు అసలాయన(కేసీఆర్​) వస్తే సాగునీటి ప్రాజెక్టుల పై చర్చకు సిద్ధమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలు, గోదవరి జలాలపై చర్చ చేయాలని పేర్కొన్నారు. ‘‘పదేండ్లలో ఒక లక్షా 81 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు కేసీఆర్​ ఖర్చు పెడితే అందులో లక్షా 2 వేల కోట్లు కాళేశ్వరానికి  పెట్టిండు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లలో కడితే మూడేండ్లలోనే కూలుడు జరిగిపోయింది. కూలింది తీసేయాలన్నా ప్రభుత్వానికి వేల కోట్లు ఖర్చయ్యే పరిస్థితి. అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం. కేసీఆర్​ ప్రాజెక్టులు కట్టిండు.. మీరు కట్టిండ్రా అని తాడిచెట్టంత పెరిగిన హరీశ్​ రావు సవాల్​ విసురుతున్నడు. 

శ్రీరాంసాగర్​, శ్రీశైలం, నాగార్జున సాగర్​, జూరాల, బీమా, నెట్టెంపాడు, కోయిల్​సాగర్​,ఇందిరా సాగర్​, రాజీవ్​సాగర్​, శ్రీపాద ఎల్లంపల్లి  కట్టింది కాంగ్రెస్​ కాదా?” అని ఆయన ప్రశ్నించారు. ‘‘మేం కట్టిన ప్రాజెక్టులు తెలంగాణను సస్యశ్యామలం చేసినయ్​. మీరు(బీఆర్​ఎస్​) కట్టిన ప్రాజెక్టులు కూలినా..  తెలంగాణలో ఒక కోటి 56 లక్షల టన్నుల వడ్లు పండినయ్​. ఆ వడ్లకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా క్వింటాకు రూ. 500 బోనస్​ ఇచ్చి కొనుక్కున్న చరిత్ర మా ప్రజాప్రభుత్వానిది. ప్రాజెక్టులపై శ్రీరాంసాగర్​ మీదన, శ్రీశైలం ఆనకట్టమీదనా, నాగార్జునసాగర్​ మీదనా, కోయిల్​ సాగర్​ కట్టమీద మాట్లడుదామా కేసీఆర్?​ నువ్వు రా.. వస్తే తెలుస్తది. తెలిసి తెల్వక మాట్లాడుతున్న పిల్లకాకులతో ఏం మాట్లాడ్త” అని అన్నారు. ‘‘ఎమన్నంటే పెద్ద మనిషినంటరా? అని అడుగుతరు. 

పెద్దమనిషంటే పెద్ద మనిషిలా వ్యవహరించాలి కదా?!! అధికారంపోతే బయటకు రాడా? ఫామ్​హౌస్​లో పంటే జీతభత్యాలు ఎందుకు? ఏం పనిచేయకుండా జీతం తీసుకుంటూ యువతకు ఏం సందేశం ఇస్తున్నడు?” అని కేసీఆర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్​, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, రేవూరి ప్రకాష్​రెడ్డి, నాగరాజు, నాయిని రాజేందర్​ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

క్యాప్సికంతో ఎకరాకు కోటి ఎట్ల సంపాదించినవ్​

‘‘కేసీఆర్​..! నువ్వు గజ్వేల్​లో, నీ కొడుకు జన్వాడలో, నీ అల్లుడు మొయినాబాద్​లో, నీ బిడ్డ శంకర్​పల్లిలో వందల ఎకరాల్లో ఫామ్​హౌస్​లు కట్టుకున్నరు. మీరు లక్ష కోట్లు సంపాదించుకుని టీవీలు, పేపర్లు పెట్టుకున్నరు. ఫామ్​హౌస్​లో క్యాప్సికం పండిస్తే ఎకరాకు కోటి రూపాయల ఆదాయం వస్తదంటున్నవ్​ కదా.. అట్ల ఎట్ల పైసలు సంపాదించవచ్చో మా రైతులకు, యువతకు జెప్పు మరీ.  లక్ష కోట్లు కాకున్నా నెలకు లక్ష సంపాదించుకుంటరు. ఒక్కసారి కాదంటే విడతల వారీగా నిరుద్యోగ యువతను మీ ఫామ్​హౌస్​​కు పంపిస్త. తీసుకున్న జీతానికి కనీసం ఆ డబ్బులు సంపాదించే శిక్షణ అయినా ఇవ్వు’’ అని సీఎం రేవంత్​ ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని,  ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. అప్పు ఎన్నటికైనా ముప్పని, అప్పు చేసి తినే పప్పు కూడా ముప్పు అని వ్యాఖ్యానించారు. ఆదాయం పెంచి పేదలకు పంచాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఉన్నదున్నట్టు జనం ముందుంచుతున్నం. రాష్ట్రంలోని అందరి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నం” అని తెలిపారు. 

వరంగల్​ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని సీఎం చెప్పారు. అందుకే ఇటీవల రూ 5,600 కోట్ల నిధులను వరంగల్​కు మంజూరు చేశామన్నారు. రాంపూర్​ డంపింగ్​ యార్డు సమస్యను తీరుస్తామని చెప్పారు. అప్పుల పాలైన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, అందరి మన్ననలు ఉండాలని ఆయన  కోరారు.