- పదేండ్లు ఆ కొరివి దెయ్యం ఉద్యోగాలియ్యలే..ఇంటిల్లిపాదికి ఇచ్చుకున్నడు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్
- జనం సంతోషంగా ఉంటే వాళ్లు కండ్లలో కారం కొట్టుకుంటున్నరు
- సలహాలు ఇవ్వాలంటే కాళ్లలో కట్టెలుపెడ్తున్నరు.. ప్రభుత్వాన్ని పడగొడ్తమని రంకెలేస్తున్నరు
- బీఆర్ఎస్కు ఇక అధికారం కల్ల అని వ్యాఖ్య.. కొత్త టీచర్లకు నియామక పత్రాలు అందజేత
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేండ్లు కోరి కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నం. ఆ కొరివి దెయ్యాన్ని రెండుసార్లు సీఎంను చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలే. ఇంట్లో మాత్రం అందరికీ కొలువులు ఇప్పించుకున్నడు” అని కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్కు మళ్లీ అధికారం రాదని, తెలంగాణ ప్రజలు ఇవ్వరని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ పత్రాలిచ్చామని తెలిపారు.
ఇప్పుడు 65 రోజుల్లోనే డీఎస్సీ పరీక్షలు పూర్తి చేసి కొత్త టీచర్లను నియమించామని చెప్పారు. డీఎస్సీ 2024లో ఎంపికైన 10,006 మంది టీచర్లకు బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి జాయినింగ్ లెటర్స్ అందజేశారు. ‘కొలువుల పండుగ’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని, కొందరికి టెట్ లేకపోవడం వల్ల అవకాశం పోతుందంటే మళ్లీ టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ పెట్టామని గుర్తుచేశారు.
పరీక్ష నిర్వహించిన కేవలం 65 రోజుల్లోనే 10,006 మందికి ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. “నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఉద్యోగాలు ఊడాలని ఎన్నికల టైమ్‌లో చెప్పిన. ఆనాడు మేం చేసిన విజ్ఞప్తితో కాంగ్రెస్ కార్యకర్తలతో సమానంగా ప్రజాప్రభుత్వం రావాలని మీరంతా బాధ్యత తీసుకున్నరు. మీరు అండగా నిలబడి కొట్లాడి గెలిపిస్తే.. ప్రజాప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఇచ్చిన మాట ప్రకారం మీకు ఉద్యోగాలు ఇస్తున్నం” అని కొత్తగా టీచర్ పోస్టుల్లో చేరిన వారితో సీఎం అన్నారు. ఇక్కడికి వచ్చిన అభ్యర్థులను చూస్తుంటే దసరా పండుగ మూడు రోజుల ముందే వచ్చినట్టు అనిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
కండ్లలో కారం కొట్టుకుంటున్నరు
పదేండ్లు అధికారం చెలాయించిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఇవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ మూడేండ్లు ఆలస్యంగా 2017లో ఇచ్చారని, నోటిఫికేషన్ ఇచ్చిన రెండేండ్ల తర్వాత 2019 నియామకాలు జరిపారని, అది కూడా అరకొర అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ, తాము అధికారంలోకి వచ్చిన 90రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో సర్కారు స్కూళ్ల పాత్ర కీలకమని ఆయన అన్నారు.
అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న 34వేల మంది టీచర్లకు బదిలీలు నిర్వహించామని, 21వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వకుండా కొందరు చాలా ప్రయత్నాలు చేశారని, కానీ, వాటన్నింటినీ అధిగమించి డీఎస్సీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు వస్తున్న సంతోషంలో తెలంగాణ యువత ఉంటే..చూసి ఓర్వలేక కొంతమంది కండ్లలో కారం కొట్టుకుంటున్నారని, నిప్పులు పోసుకుంటున్నారని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఆయన విమర్శించారు.
దాస్కొని తిరుగుతున్నడు
“నువ్వు చేసిన తప్పిదాలకు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నీ బిడ్డ కవిత నిజామాబాద్‌లో, నీ బంధువు వినోద్ రావు కరీంనగర్లో ఓడిపోతే, ఆరు నెలలు తిరగక ముందే బిడ్డకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నవ్. వినోద్ రావుకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా పదవి ఇచ్చుకున్నవు. మరి తెలంగాణ కోసం పదేండ్లు త్యాగాలు చేసిన పిల్లలు, పేదల కోసం ఏనాడైనా ఆలోచన చేసినవా?” అని కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. తెలంగాణ బిడ్డల గురించి ఆలోచన చేయలేదు కానీ ప్రజలు తిరస్కరిస్తే సొంత బిడ్డకు మాత్రం పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు. ‘‘ఆయన(కేసీఆర్) ఇంట్లో పదవులు ఉండాలి.. ఆ ఇంట్లో కొలువులు ఉండాలి.. కానీ పేదోళ్లు సంతోషంగా ఉండొద్దా..?” అని నిలదీశారు.
ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయొచ్చని తాము చెప్తే.. కాళ్లలో కట్టెలు పెడ్తున్నారని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. టీచర్ల నియామకాలు కూడా జరగొద్దని కుట్రలు చేశారని అన్నారు. ‘‘తెలంగాణ రెండో సీఎంగా నేను బాధ్యత తీసుకున్న పది నెలల్లో ఒక రోజుగానీ, ఒక గంట గానీ సెలవు తీసుకోలేదు. పేదోళ్ల కోసం, నిరుద్యోగుల కోసం ఈ ప్రజా ప్రభుత్వం కష్టపడుతున్నది. కేసీఆర్ తన అనుభవాన్ని ఉపయోగించి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కోరినం. మేం తప్పులు చేస్తే మమ్మల్ని ప్రశ్నించొచ్చని, నిలదీయొచ్చని చెప్పినం. అప్పటికీ వినకపోతే నిరసన తెలపాలని, ధర్నా చేయాలన్నం. కానీ, సలహాలు ఇవ్వడు.. సూచనలు ఇవ్వడు.. దాసుకొని తిరుగుతున్నడు” అని విమర్శించారు.
బీఆర్ఎస్కు అధికారం కల్ల
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు జనం గుణపాఠం చెప్పారని, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారని, కానీ బీఆర్ఎస్ నేతలకు బుద్ధిరాలేదని సీఎం రేవంత్ అన్నారు. ‘‘పదేండ్లు పాలించిన వాళ్లు.. మేం అధికారంలోకి పదినెలలు కూడా కాకముందే దిగిపోవాలని అంటున్నరు. ఇది న్యాయమా? ఐదేండ్ల పాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేయాలని, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. కానీ, ఈ ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వాళ్లు (బీఆర్ఎస్ నేతలు) రంకెలు వేస్తున్నరు” అని మండిపడ్డారు. బీఆర్ఎస్కు మళ్లీ అధికారం రాదని, తెలంగాణ ప్రజలు ఇవ్వరని ఆయన పేర్కొన్నారు.
స్కూళ్లను గత సర్కార్ పట్టించుకోలే: భట్టి
గత ప్రభుత్వం పదేండ్లు పాలించినా సర్కారు బడులను పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దశాబ్దకాలంలో ఉద్యోగ నియామకాలపై దృష్టిపెట్టలేదని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదని, అయినా అనేక పనులు చేపట్టామని తెలిపారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించామని వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేణుగోపాల్, ఎమ్మెల్సీలు కోదండరాం, నర్సిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, రఘోత్తంరెడ్డి, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పాల్గొన్నారు.
ఇంటిగేట్రెడ్ రెసిడెన్షియల్స్కూళ్లకు రేపు శంకుస్థాపన
తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉందని, తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు టీచర్లేనని సీఎం రేవంత్ అన్నారు. తనతో పాటు భట్టి, కోదండరాం అందరమూ సర్కారు స్కూళ్లలోనే చదువుకున్న వాళ్లమేనని గుర్తుచేశారు. రాష్ట్రంలో 30వేల సర్కారు స్కూళ్లలో 24 లక్షల మంది చదివితే.. 10 వేల ప్రైవేటు బడుల్లో 34 లక్షల మంది చదువుతున్నారని.. సర్కారు స్కూళ్లకు పిల్లలను పంపడం నామోషీగా భావిస్తున్నారని, ఈ పరిస్థితికి కారణం ఎవరో, ఏమిటో ఆలోచించాలని, ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాలని టీచర్లకు సూచించారు.
రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో 25 ఎకరాల్లో రూ.125 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చెప్పారు. వీటికి సంబంధించిన పనులను 11న ప్రారంభిస్తామని తెలిపారు. ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ‘‘తెలంగాణలో ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు.
అయితే, ఉద్యోగులు దొరక్క వారు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. కంపెనీలకు అవసరాలకు తగ్గట్టు నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించబోతున్నాం. త్వరలోనే గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం” అని ఆయన వివరించారు. కాగా, కార్యక్రమంలో కొత్త టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. పలువురికి ఆయన నియామక పత్రాలు అందించారు.