శనివారం ( డిసెంబర్ 7, 2024 ) నల్గొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో నల్గొండ ముందువరుసలో ఉందని.. ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి నల్గొండవాసేనని అన్నారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ నల్గొండ అన్నారు. రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన జిల్లా నల్గొండ అని, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లాకు ఎక్కువ అన్యాయం జరిగిందని అన్నారు.కేసీఆర్ గెలిస్తే అధికారం చలాయిస్తారు.. ఓడితే ఫామ్ హౌస్ లో పడుకుంటారా అని ఎద్దేవా చేశారు సీఎం.
కేసీఆర్ గెలిస్తే అధికారం చలాయిస్తారు.. ఓడితే ఫామ్ హౌస్ లో పడుకుంటారా.. మేము ఓడినా ప్రజల కోసం కొట్లాడినమని.. ఈ ఏడాది కాలంలో కేసీఆర్ ఏనాడైనా ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. కేసీఆర్ పదేండ్ల ముఖ్యమంత్రి అనుభావాన్ని ప్రజల కోసం ఉపయోగించరా అని ప్రశ్నించారు. శాసనసభలో ప్రతిపక్షనేత హోదా ఖాళీగా ఉండటం దేనికి సంకేతమని అన్నారు.
కృష్ణా జలాలతో నల్గొండను సశ్యామలం చేస్తామని అన్నారు సీఎం. గతంలో వరి వేస్తే ఉరి అన్నారని.. మేము బోనస్ అంటున్నామని అన్నారు. రైతుకు వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ చేస్తామని అన్నారు. 5లక్షల ఎకరాల్లో వరి పండించి నల్గొండ రైతులు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.