ఖజానా ఖాళీ చేసి మాపై నిందలా.. కేసీఆర్​ ప్రసంగంలో అభద్రతా భావం, అక్కసు: సీఎం రేవంత్ రెడ్డి

ఖజానా ఖాళీ చేసి మాపై నిందలా..  కేసీఆర్​ ప్రసంగంలో అభద్రతా భావం, అక్కసు: సీఎం రేవంత్ రెడ్డి
  • అవసరాలను బట్టి మోదీ, కేసీఆర్ మాటలు మారుస్తారు
  • బీఆర్ఎస్​ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
  • కేసీఆర్​.. పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నడు?
  • అరెస్టుల విషయంలో తొందరపడం.. చట్ట ప్రకారమే నడుచుకుంటం
  • -నాకు, రాహుల్​గాంధీకి మంచి రిలేషన్​ ఉంది
  • మా​ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్స్​ ఏ రాష్ట్రంలోనూ లేవు 
  • నా పాలనపై చివరి 6 నెలల్లో చర్చ జరుగుతది 
  • ఆపరేషన్‌‌ కగార్‌‌పై పార్టీ నిర్ణయం తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తం
  • జానారెడ్డితో భేటీ అనంతరం మీడియాతో చిట్​చాట్​

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి కేసీఆర్​తమపై నిందలు వేస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి ఫైర్​ అయ్యారు. కేసీఆర్ ఎల్కతుర్తి సభలో చేసిన ప్రసంగంలో స్పష్టత లేదని, ఆయన అభద్రతా భావంతో అక్కసు వెళ్లగక్కారని అన్నారు. బీఆర్ఎస్​ను ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.  మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజా సంఘాల ప్రతినిధులు కోరిన నేపథ్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్​లోని జానారెడ్డి నివాసానికి సీఎం రేవంత్​ వచ్చారు.  

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుతో  భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ కగార్‌‌’పై ప్రభుత్వం ఎలా వ్యవహరించాలనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌‌తో  సీఎం రేవంత్‌‌రెడ్డి ఫోన్​లో మాట్లాడారు. గతంలో శాంతి చర్చల సమయంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌‌చార్జిగా దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. సమావేశం అనంతరం సీఎం రేవంత్​రెడ్డి మీడియాతో చిట్​చాట్​ చేశారు.

మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కే కేశవరావు పార్టీలో చర్చిస్తారని వెల్లడించారు.  ‘ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కగార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’పై జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, ఆ తర్వాత తమ ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రపంచంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేరని అన్నారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలని, రెండు దేశాలను ఓడించిన ఘనత ఆమెదేనని తెలిపారు.  అవసరాలను బట్టి మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ మాటలు మారుస్తారని విమర్శించారు. 

పార్టీలో ఓపికగా ఉన్నోళ్లకే పదవులు

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్స్​ దేశంలో  ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేవని సీఎం రేవంత్​రెడ్డి  తెలిపారు. ఎన్నికలకు చివరి 6 నెలల్లో తన పాలనపై చర్చ జరుగుతుందని చెప్పారు.  అయితే, తమ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకబడ్డామని, వాటిని స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పుడు వాటన్నింటినీ సమీక్షిస్తున్నామని చెప్పారు. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశామని తెలిపారు. తమపార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా హైదరాబాద్​లోనే టైమ్ పాస్ చేస్తున్నారని, ప్రజల్లోకి వెళ్లి పథకాలను వివరించాలని వారిని ఆదేశించినట్టు చెప్పారు. 

‘‘ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలి. ఎమ్మెల్యేలు వెళ్తేనే.. ప్రజల్లోకి పథకాలు వెళ్తాయి. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వారే నష్టపోతారు’’ అని రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నామని తెలిపారు. వారిని ఉన్నపళంగా తీసేస్తే పాత విషయాలన్నీ ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ధరణి, భూ భారతి విషయాలపై నవీన్ మిట్టల్​కు పూర్తి అవగాహన ఉన్నదని, అలాంటి అధికారులను వెంటనే తొలగిస్తే ఇబ్బందులు వస్తాయని తెలిపారు.  

అధికారుల్లో తమ వారు, వేరే వాళ్లు అంటూ ఉండరని చెప్పారు. సమర్థత ఉన్న అధికారులు గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ.. వారిని కొనసాగించక తప్పదని అన్నారు. కొందరు అధికారులు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.

మాటిస్తే తప్పను

కేటీఆర్​, హరీశ్ రావు, కవితను పిల్లగాళ్లు అని కేసీఆర్ అన్నారని, మరి ఆ పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారని కేసీఆర్​ను సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రశ్నించారు. తనకు, రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉందని స్పష్టంచేశారు. ఈ విషయంలో తాను ఎవర్నీ నమ్మించాల్సిన అవసరం లేదని అన్నారు.  తాను కమిట్​మెంట్​ ఇస్తే ఎప్పుడూ వెనక్కి తగ్గనని చెప్పారు. 

అద్దంకి దయాకర్‌‌కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి, ఆ మాటను నిలబెట్టుకున్నానని గుర్తు చేశారు. తాను ఇంకా 20 ఏండ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో తప్పు చేసిన నేతలను అరెస్ట్ చేయాలని ప్రజల నుంచి తమకు డిమాండ్లు వస్తున్నాయని,  అయితే అరెస్టుల విషయంలో తొందరపడబోమని,  చట్టప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు.