మీలెక్క ఫామ్​హౌస్​లో ఉంటే పాలనపై పట్టు వస్తదా: కేసీఆర్​, కేటీఆర్​పై సీఎం రేవంత్​ ఫైర్​

మీలెక్క ఫామ్​హౌస్​లో ఉంటే పాలనపై  పట్టు వస్తదా: కేసీఆర్​, కేటీఆర్​పై సీఎం రేవంత్​ ఫైర్​
  • మీకు మానవత్వం, విజ్ఞత లేదు కాబట్టే జనం సాగనంపిన్రు
  • కొలువుల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే పదేండ్లు చేసిందేంది?
  • నిరుద్యోగులను ముంచి.. మీ ఇంటిల్లిపాదికి కొలువులు ఇచ్చుకున్నరు
  • పది నెలల్లోనే మేం 59 వేల జాబ్స్​ నింపినం.. రెగ్యులర్​గా నోటిఫికేషన్లు ఇస్తం
  • నెల రోజుల్లో గ్రూపు 1, గ్రూపు2, గ్రూపు 3 నియామక పత్రాలు అందజేస్తం
  • బ్లాక్​ మనీతో సోషల్​ మీడియా ద్వారా ప్రభుత్వంపై బురదజల్లుతున్నరు
  • అప్పుడు కోదండరాం ఇంటి తలుపులు పలగ్గొట్టినట్టు.. 
  • ఇప్పుడు మేం ఆదేశిస్తే కేటీఆర్ ​ఇంటి తలుపులు పలగ్గొట్టలేరా? 
  • మీలెక్క వ్యవస్థలను మేం దుర్వినియోగం చేయం
  • మిస్​ వరల్డ్​ పోటీలు హైదరాబాద్​లో నిర్వహిస్తే కేటీఆర్​కు ఏం బాధ? అని ప్రశ్న
  • 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేత

హైదరాబాద్,  వెలుగు: కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. అందుకే ఆ పాలకులను ప్రజలు ఫామ్​హౌస్​కు సాగనంపి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని తెలిపారు. పాలనపై పట్టు లేదని తమను బీఆర్​ఎస్​ నేతలు విమర్శిస్తున్నారని.. వాళ్ల లెక్క ఫామ్​హౌస్​లో ఉంటేనే పాలనపై పట్టు వచ్చినట్లా? అని ఆయన ప్రశ్నించారు.  

‘‘మీలెక్క ప్రజల సొమ్మును పంచుకు తింటే పట్టు వచ్చినట్లా? సెక్రటేరియెట్​కు రాకుండా ఫామ్​హౌస్​లో పండుకుంటే పట్టు వచ్చినట్లా? ” అని కేసీఆర్​, కేటీఆర్​పై ఫైర్​ అయ్యారు. రోజుకు 18 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తున్నామని సీఎం తెలిపారు. ‘‘ఏమీ తెల్వకుంటనే మేం ఇంతవరకు వచ్చినమనుకుంటున్నరా? మీ లెక్క గడీల్లో పెరగకపోవచ్చు.. నల్లమల అడవుల్లో పెరిగిన. మనుషులెట్లుంటరో.. మానవ మృగాలు ఎట్లుంటయో చూసిన. మాకు మానవత్వం ఉంది.. మీకు లేదు. మాకు విజ్ఞత ఉంది.. మీకు లేదు. విజ్ఞత లేకుండా వ్యవహరించారు కాబట్టే మీరు ఇప్పుడు బయటకు రాలేని పరిస్థితుల్లో ఫామ్​హౌస్​కు పరిమితమయ్యారు” అని వ్యాఖ్యానించారు. 

ప్రజలకు మంచి చేస్తుంటే అడ్డుకోవాలని చూస్తున్నారని.. సోషల్  మీడియాలో నల్లధనాన్ని పెట్టుబడిగా మార్చి ప్రజా ప్రభుత్వంపై  బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్​ఎస్​ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌‌ రవీంద్ర భారతిలో నిర్వహించిన ‘ప్రజా పాలనలో కొలువుల పండుగ’ కార్యక్రమంలో సీఎం రేవంత్​ పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌‌, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి నియామక పత్రాలు అందజేశారు. ‘బిల్డ్‌‌ నౌ’ పోర్టల్‌‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు.  

‘‘తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిందే నిరుద్యోగులు, యువత. స్వరాష్ట్రం వస్తే తమ కొలువులు తమకు వస్తాయని పోరాటం చేశారు. ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. కానీ, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో.. ఆ ఆకాంక్షలను గత పదేండ్లలో బీఆర్​ఎస్​ నేతలు పట్టించుకోలేదు. రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలో తేలాల్సిన నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం చూపలేదు” అని అన్నారు. అధికారం చేపట్టిన పదినెలల్లోనే తాము 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని.. పదేండ్లలో బీఆర్​ఎస్​ నేతలు ఆ పని ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. 

తామే అన్ని నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పట్లేదని.. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా ఉన్నాయని.. అయితే ఆ నోటిఫికేషన్లను ఆ పాలకులు ఎందుకు భర్తీ చేయలేకపోయారని నిలదీశారు. నోటిఫికేషన్లు ఇచ్చినట్లే ఇచ్చి కేసులు వేయించి వాటిని ఆపడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కానీ, తాము చిక్కుముళ్లు విప్పి క్రమపద్ధతిలో నియామకాలు చేపడ్తున్నామన్నారు. 

పదేండ్లు వాళ్ల కుటుంబానికే  కొలువులు

ఏ పట్టింపు లేకుండా గత ప్రభుత్వ విధానం ఉండేదని.. పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం తమదని సీఎం రేవంత్​ తెలిపారు. ఉద్యోగ ఖాళీలను పెండింగ్‌‌ పెట్టొద్దని, క్రమం తప్పకుండా నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. ముప్పై నలభై రోజుల్లో గ్రూప్‌‌-1, గ్రూప్‌‌-2, గ్రూప్‌‌-3కు సంబంధించి 2 వేలకు పైగా  మందికి  నియామక పత్రాలు ఇస్తామన్నారు. ‘‘పదేండ్లు రాష్ట్రాన్ని ఆగం పట్టించారు. 

నేను బాధ్యతలు చేప్టటిన తర్వాత.. ప్రతి డిపార్ట్​మెంట్​లో గత 10 ఏండ్లుగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నిర్వహించిన పరీక్షలు ఎన్ని?  ఫలితాలు విడుదల కాకుండా కోర్టు చిక్కుముళ్లు ఉన్నవి ఎన్ని? పరీక్ష ప్రశ్నాపత్రాలు జిరాక్స్​ సెంటర్లలో ప్రత్యక్షమైనవి ఎన్ని? అనే వివరాలు తెప్పించుకున్న. 

వాటి చిక్కుముళ్లు విప్పి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నం” అని వివరించారు. ‘‘పదేండ్లు కేసీఆర్​, ఆయన కుటుంబమే ఉద్యోగాలు చేపట్టింది తప్ప.. నిరుద్యోగులకు చేసిందేమిటి? నిజామాబాద్​ ఎంపీగా కవితను, కరీంనగర్​ నుంచి వినోద్​ కుమార్​ను ప్రజలు తిరస్కరిస్తే.. ఆరు నెలలోపు ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చారు..  మరొకరిని ప్లానింగ్​ కమిషన్​ వైస్​ చైర్మన్​గా కారుణ్య నియామకం మాదిరి ఇచ్చుకున్నారు. అట్ల చేశారు కాబట్టే వాళ్ల ఉద్యోగాలను నిరుద్యోగులు  ఊడగొట్టి సాగనంపారు. ఇప్పుడు నిరుద్యోగులకు కొలువులు వస్తున్నాయి” అని చెప్పారు. 

బిల్డింగ్​ పర్మిషన్లు ఎవరైనా ఆన్​లైన్​లో తీసుకోవాల్సిందే

గతంలో బిల్డింగ్స్ పర్మిషన్స్​లో ఏ రికార్డు లేదని సీఎం రేవంత్​ విమర్శించారు. పెద్దలకు ఒకలా.. పేదోడికి ఇంకోలా ఉండేదని అన్నారు. ‘‘సామాన్యులు వస్తే చిక్కు ప్రశ్నలతో తిప్పలుపెట్టేవారు.. ఉన్నోడు వస్తే మాత్రం మాన్యువల్​గా అప్లికేషన్​ ఇచ్చి పర్మిషన్లు ఇచ్చే వాళ్లు. భూమి ప్రైవేట్ దా,  ప్రభుత్వానిదా ​, చెరువులో ఉందా.. లేదా ? యజమానిదా అనేది కూడా తెల్వకుండానే పర్మిషన్లు ఇచ్చేవారు. అయితే మేం మాత్రం పేదోడైనా.. పెద్దోడైనా ఆన్​లైన్​లో ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాం” అని సీఎం తెలిపారు. ఇప్పుడు ఎంత పెద్దోడైనా ‘బిల్డ్‌‌ నౌ’ వెబ్‌‌సైట్​లో అప్లై చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. 

గత పాలకులు యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చేశారని.. తాము మాత్రం ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు తిరిగి యాదగిరిగుట్టగానే కొనసాగిస్తున్నామని తెలిపారు. ఏపీలో టీటీడీ ఉంటే, మనకు వైటీడీ ఉందన్నారు. ‘‘ప్రతిసారీ దర్శనాల కోసం వాళ్లను(ఏపీ) అడుక్కోవడం ఎందుకు. మనకు యాదగిరిగుట్ట, భద్రాచలం లేదా?’’ అని ప్రశ్నించారు. తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉందని, కానీ గత పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. సిలికాన్‌‌వాలీయే ఇప్పుడు తెలంగాణవైపు చూస్తున్నదని తెలిపారు. 

దేశాన్ని అభివృద్ధి చేసినట్లు ప్రధాని మోదీ చెప్పుకుంటున్నారని, ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీ, ఒడిశాలో అభివృద్ధి జరిగి ఉంటే..  అక్కడి నుంచి తెలంగాణకు పనుల కోసం జనం ఎందుకు వస్తున్నారని అడిగారు. అభివృద్ధి వాళ్ల రాష్ట్రాల్లో జరిగిందా? ఇక్కడ జరిగిందా? చెప్పాలన్నారు.
 

వాళ్లకు విజ్ఞతేది?

బీఆర్​ఎస్​ పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. మానవత్వం లేకుండా వ్యవహరించారన్నారు. ‘‘ప్రజా ప్రభుత్వం వచ్చాక ఆందోళనలకు అనుమతివ్వడంతోనే కదా బీఆర్​ఎస్​ వాళ్లు కూడా రోడ్లమీదికి వస్తున్నారు? అదే వాళ్లలా మేం చేసుంటే వచ్చేవాళ్లా? సెక్రటేరియెట్​కు వచ్చి ఆందోళన చేశారంటే మేం అనుమతి ఇవ్వడం తోనే కదా?” అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. బీఆర్​ఎస్​వాళ్ల మాదిరి పోలీసులతో అణచివేయదలుచుకోలేదని పేర్కొన్నారు. ‘‘బీఆర్​ఎస్​ పాలనలో ప్రొఫెసర్​ కోదండరాం సార్​ ఇంటి తలుపులు పలగొట్టినోళ్లు.. ఇప్పుడు మేం ఆదేశిస్తే కేటీఆర్​ ఇంటి తలుపులు పలగొట్టి దంచలేరా? అప్పుడు ఉంది పోలీసులే.. ఇప్పుడూ ఉందీ ఆ పోలీసులే. కానీ, మేం బీఆర్​ఎస్​లా విజ్ఞత లేకుండా వ్యవహరించం. ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళ్తం. 

ఎవరి బాధనైనా చెప్పుకునేందుకు అవకాశం ఇస్తున్నాం” అని ఆయన అన్నారు. గడీలలో పెరగకపోయినా.. నల్లమల్ల అడవుల్లో పెరిగానని చెప్పారు. సామాన్యులతోపాటు మానవ మృగాలను చూసుకుంటూ పెరిగానన్నారు. మానవత్వాన్ని, విజ్ఞతను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. సీఎం అనే వ్యక్తికి విజ్ఞత అవసరమని, ఆ విజ్ఞతను తాము ప్రదర్శిస్తున్నానని చెప్పారు. ‘‘వాళ్లు ఆ మానవత్వాన్ని, విజ్ఞతను ప్రదర్శించకపోవడంతోనే వారిని జనం ఫామ్​హౌస్​కు పరిమితం చేశారు” అని కేసీఆర్​, కేటీఆర్​పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్​లో మిస్​ వరల్డ్​ పోటీలు ఎట్లా నిర్వహిస్తారని కేటీఆర్​ ప్రశ్నిస్తున్నారని.. ఆయన  బాధ ఏంటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. 

‘‘మే 7 నుంచి 31 వరకు ప్రపంచ దేశాల ప్రతినిధులు హైదరాబాద్​లో ఉండబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్ని చూడబోతున్నారు.  ఇదొక గొప్ప అవకాశం. ఈ పోటీల నిర్వహణతో గ్లోబ్​లో హైదరాబాద్​ ఒక ల్యాండ్​ మార్క్​ కాబోతుంది. మిస్​ వరల్డ్​ పోటీల నిర్వహణతో తెలంగాణకు వందల కోట్ల రూపాయల ఆదాయం  వస్తుంది. రాష్ట్రానికి మంచి జరిగితే వాళ్లకు (బీఆర్​ఎస్​) నచ్చదు” అని  అన్నారు. ఫార్ములా– ఈ రేస్​ ముసుగులో ప్రభుత్వ పైసలు కొల్లగొట్టినోళ్లు ఇంకా ఏదో ఊడ్చుకుపోదామనే ఆలోచనలో ఉన్నారని కేటీఆర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


పదేండ్లు రాష్ట్రాన్ని ఆగం పట్టించారు. నేను బాధ్యతలు చేప్టటిన తర్వాత.. ప్రతి డిపార్ట్​మెంట్​లో గత 10 ఏండ్లుగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నిర్వహించిన పరీక్షలు ఎన్ని?  ఫలితాలు విడుదల కాకుండా కోర్టు చిక్కుముళ్లు ఉన్నవి ఎన్ని? పరీక్ష ప్రశ్నాపత్రాలు జిరాక్స్​ సెంటర్లలో ప్రత్యక్షమైనవి ఎన్ని? అనే వివరాలు తెప్పించుకున్న. వాటి చిక్కుముళ్లు విప్పి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నం.
- సీఎం రేవంత్​ రెడ్డి

వాళ్లు చేయలేదని నన్ను చేయనిస్తలే!

‘‘ఒకప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేసేవాళ్లు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వరుసగా నోటిఫికేషన్లు ఇస్తుంటే.. కొంచెం గ్యాప్​ ఇవ్వండి, వాయిదా వేయండి అంటూ నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు” అని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. నిరుద్యోగుల ఆకాంక్షలను తాము నెరవేరేస్తుంటే బీఆర్​ఎస్​ నేతలు మాత్రం అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘‘వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను పట్టించుకోలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు.. అందుకే ఇప్పుడు మేం ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే ఇవ్వనీయడం లేదు. అడ్డుకుంటున్నారు. 

ప్రతిదాంట్లో అడ్డుతగులుతున్నారు. గత పదేండ్లలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ సెంట్రిక్​గా నిర్ణయాలు జరిగాయి. మేం ప్రజల కోణంలో, నిరుద్యోగులు, విద్యార్థుల కోణంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నం” అని ఆయన వివరించారు.  గ్రీన్​ చానెల్​లో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్ల​ నిర్మాణానికి నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. 

ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది: మంత్రి సీతక్క

తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే పుట్టిందని మంత్రి సీతక్క అన్నారు. ఈ ఉద్యమంలో ఎంతోమంది యువకులు అమరులయ్యారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పదేండ్లలో ఉద్యోగాల కోసం ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. 

పంచాయతీ రాజ్ శాఖలో పదేండ్ల తర్వాత కారుణ్య నియామకాలు చేపడుతున్నామని, దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ, యుద్ధప్రాతిపదికన నియామక పత్రాలు అందజేస్తున్నట్లు వివరించారు.  

ఇసుకనూ దోచుకున్నరు

గత బీఆర్​ఎస్​ పాలనలో ప్రతి ఏడాది కోటి 75 లక్షల మెట్రిక్​ టన్నుల ఇసుక దొంగతనం జరిగిందని, ప్రభుత్వ ఖజనాకు నిధులు రాకుండా మోసం చేశారని సీఎం రేవంత్​  మండిపడ్డారు. అందుకే తాము ఇసుకను డోర్​ డెలివరీ చేసే విధానం తెచ్చామన్నారు. కేసీఆర్​ మాత్రం లిక్కర్​ డోర్​ డెలవరీ విధానం తెచ్చారని ఆయన విమర్శించారు.  ‘‘రాష్ట్రంలో రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ రూ.8 వేల కోట్లు బకాయి పెట్టారు. వాళ్లకు ఇప్పుడు  నెలకు ఇచ్చే 200–300 కోట్లు ఏ మూలకు సరిపోతయ్. రాష్ట్రానికి   మార్కెట్​లో అప్పు పుడ్తలేదు. గతంలో ఇష్టం వచ్చినట్లు11 శాతం ఆపైన వడ్డీకి  అప్పులు తెచ్చారు. 

ఇలా రూ.1.50 లక్షల కోట్ల అప్పులు 11 శాతం వడ్డీకి  తెచ్చారు.  మేం 5–6 శాతానికి వడ్డీని రీస్ర్టక్చర్​ చేయించే ప్రయత్నం చేస్తున్నం” అని వివరించారు. ‘‘10 ఏండ్లు గరం, 20 ఏండ్లకు నరం, 30 ఏండ్లకు భేషరం అవుతారని ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నేతలకు సంబంధించి ఒక సామెత ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్​ అయ్యేవరకు గరం లాగే  ఉండాలి. నేను రాజకీయ జీవితంలో 20 ఏండ్లుగా నా టెంపర్​మెంట్​ను మార్చుకోలేదు’’ అని సీఎం తెలిపారు.