- ఫోర్త్ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్ ప్రకటన
- ఆనందం వ్యక్తం చేస్తున్న స్థానికులు
- ఊపందుకోనున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం
- పెరగనున్న భూముల ధరలు..
- కొత్త కంపెనీల ఏర్పాటుతో పెరగనున్న ఉద్యోగ అవకాశాలు
- ఇప్పటికే వెలసిన ప్రైవేట్వెంచర్లు, ఫాంహౌస్లు, విల్లాలు
హైదరాబాద్, వెలుగు: ‘ముచ్చర్ల’.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్రెడ్డి ముచ్చర్లను ఫ్యూచర్సిటీగా ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సరసన ముచ్చర్లను ఫోర్త్సిటీగా మారుస్తామని చెప్పారు. ఐటీ కంపెనీల ఏర్పాటుతోపాటు అన్ని రకాలుగా డెవలప్చేస్తామని వెల్లడించారు. దీంతో రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల గ్రామం కేంద్రంగా మరో సిటీ రూపుదిద్దుకోనుంది. ఇది శంషాబాద్ ఎయిర్పోర్టుకు 30 కిలోమీటర్ల లోపే ఉంది.
ఇప్పటికే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ ప్రాంతంలో వెంచర్లు వేశాయి. ఫాంహౌస్లు, విల్లాలు వెలిశాయి. పారిశ్రామికంగా డెవలప్అవుతోంది. ఓఆర్ఆర్, శంషాబాద్ఎయిర్పోర్టు, నేషనల్హైవేను ఆనుకుని ఉండడంతో అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయని అధికారులు, నిపుణులు చెబుతున్నారు.
ముచ్చర్లకు సమీపంలో చిన జీయర్ హోమియో మెడికల్ కాలేజీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయడుకి చెందిన స్వర్ణ భారత్ట్రస్ట్, పర్యాటక కేంద్రంగా మారిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉన్నాయి. ముచ్చర్లను పూర్తిస్థాయిలో డెవలప్చేస్తే దక్షిణ తెలంగాణ రూపం మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
4 వేల ఎకరాల్లో టూరిజం హబ్
ప్రస్తుతం హైటెక్ సిటీ వద్ద ఉన్న ఎన్ఏసీని ముచ్చర్లకు తరలిస్తామని సీఎం చెప్పడంతో నిర్మాణ రంగానికి మరింత సేవలందించే అవకాశం ఉంది. ఫార్మా పరిశ్రమలను ముచ్చర్లకు తరలించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. 4వేల ఎకరాల్లో టూరిజం హబ్ ను నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే భూసేకరణ పనులను ముమ్మరం చేసింది.
ముఖ్యంగా వివిధ మల్టీ నేషనల్ కంపెనీలు ఇక్కడ బ్రాంచులు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. విదేశీ టూరిస్టుల రాకతో రానున్న రోజుల్లో ముచ్చర్ల టూరిజం హబ్ గా మారే అవకాశం ఉంది. రామానుజాచార్యుల విగ్రహం(స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ఏర్పాటుతో టూరిస్టుల సంఖ్య బాగా పెరిగింది. యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు.
ఇయ్యాలే శంకుస్థాపన
ముచ్చర్లను డెవలప్ చేస్తామని సీఎం ప్రకటించడాన్ని ప్రముఖులు స్వాగతిస్తున్నారు. ఔటర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల ధరలు పెరుతాయని, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ముచ్చర్లతోపాటు చుట్టుపక్కల అనేక రకాలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ఎయిర్పోర్టును ఆనుకుని ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది.
తాజాగా సీఎం పలు కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. గురువారం ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అంతర్జాతీయ గోల్ఫ్ కోర్టు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్టేడియం నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లకు మెట్రో రైలును విస్తరిస్తామని చెప్పారు. దీంతో రానున్న రోజుల్లో భారీ ఎత్తున అభివృద్ధి జరుగుతుందన్న చర్చ జరుగుతోంది..