
- స్థానిక ఎమ్మెల్యేల వద్దకు ఆశావహుల క్యూ
- మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోస్టులకు డిమాండ్
- దేవాలయ కమిటీల కోసం ప్రయత్నాలు స్టార్ట్
- గ్రంథాలయ, వక్ఫ్, ఆత్మ కమిటీలకు కూడా..
- ఈ పోస్టులు భర్తీ చేశాకే లోకల్ బాడీ ఎన్నికలకు..
హైదరాబాద్: నామినేటెడ్ పోస్టులను ఈ నెల 10 లోగా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో జిల్లాల్లో సందడి మొదలైంది. ఖాళీగా ఉన్న రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతో పాటు జిల్లా స్థాయి పదవులనూ భర్తీ చేయనున్నారు. సీఎం ప్రకటనతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పదవులు ఆశిస్తున్న వారు ఎమ్మెల్యేల వద్దకు క్యూ కడుతున్నారు.
జిల్లాల్లో మార్కెట్ కమిటీ పాలక వర్గాలు, దేవాలయాల కమిటీలతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్, డైరెక్టర్ పదవులు ఉంటాయి. వీటితోపాటు వక్ఫ్ బోర్డు జిల్లా పాలక వర్గాలు, ఆత్మ కమిటీలు, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల పాలక వర్గాలను నామినేషన్ పద్ధతిలో భర్తీ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకు క్యూ కడుతున్నారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సారి పదవుల కేటాయింపు ఆసక్తికరంగా మారింది. నామినేటెడ్ పదవులు పొందిన వాళ్లు స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సి ఉంటుంది.
ALSO READ : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.. ఇక నుంచి ‘చిల్లర’ గొడవలకు ఎండ్..!
అలా సత్తా ఉన్న వారికే పదవులు దక్కే అవకాశం ఉందనే టాక్ ఉంది. ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా సామాజిక సమీకరణాలు అంచనా వేస్తూ ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జిల్లాల స్థాయిలో జరగబోయే నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రాధాన్యం ఏర్పడింది