- మోదీ, అమిత్‌షా, అదానీ, అంబానీపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
- అదానీ స్కామ్‌పై కేసీఆర్, ట్విట్టర్ టిల్లు ఎందుకు మాట్లాడ్తలే?
- రాజీవ్ గాంధీ విగ్రహంపై చెయ్యేస్తే వీపు చింతపండే
- పదేండ్లలో సెక్రటేరియెట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే?
- బీఆర్ఎస్ సన్నాసుల మాటలు నమ్మి రైతులు రోడ్డెక్కొద్దు
- రైతులను పీల్చి, పిప్పి చేసిన దోపిడీ దొంగలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 9 సీట్లు కూడా మిగలవని వ్యాఖ్య
- అదానీ స్కామ్‌పై జేపీసీ వేయాలన్న డిమాండ్‌తో ఈడీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా
హైదరాబాద్, వెలుగు: దేశాన్ని దోచుకుంటున్న దుష్ట చతుష్టయం మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ అని సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ‘హమ్ దో... హమారే దో..’ అన్నట్లుగా మోదీ, అమిత్ షా వ్యవహారశైలి కనిపిస్తున్నదని, ఈ ఇద్దరు కలిసి గుజరాత్ నుంచి మరో ఇద్దరు అదానీ, అంబానీని తీసుకొచ్చి దోచుకుంటున్నారని ఆరోపించారు.
అదానీ కుంభకోణంపై జేపీసీని వేయాలని, సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో దేశవ్యాప్త ఆందోళనలకు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద నుంచి ర్యాలీగా ఈడీ ఆఫీసుకు చేరుకున్న వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడే బైఠాయించారు.
ఇందులో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘గతంలో గుజరాత్ నుంచి గాంధీ, పటేల్ ఇద్దరు వస్తే.. వారికి ప్రపంచమే నమస్కారం పెట్టింది. ఇప్పుడు అదే గుజరాత్ నుంచి వచ్చిన మోదీ, అమిత్ షా మాత్రం ఆ ప్రపంచాన్నే దోచుకునేలా వ్యవహరిస్తున్నరు” అని వ్యాఖ్యానించారు.
‘‘చాయ్ అమ్మిన వ్యక్తి ఈ దేశానికి ప్రధాని అయితే దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని అంతా భావించారు. కానీ 2014 లో మోదీ ప్రధాని అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి వెనక్కితిరిగి చూసుకుంటే.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోదీ రెండు రెట్లు అప్పులు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేశారు” అని సీఎం రేవంత్ మండిపడ్డారు. అదానీ కుంభకోణంపై చట్టసభల్లో సమాధానం ఇవ్వకుండా మోదీ పారిపోయారని, ఇంకా నాలుగు రోజులు ఉండగానే పార్లమెంట్ ను వాయిదా వేసుకున్నారని విమర్శించారు.
దేశానికి ముప్పుగా బీజేపీ
దేశానికి మోదీ ప్రధాని అయిన తర్వాత దేశ సంపదనంతా అదానీ, అంబానీకి దోచిపెడుతున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. సెబీ చైర్ పర్సన్ పై వెంటనే విచారణ జరిపి, ఆమె చేత రాజీనామా చేయించాలని, లేకపోతే కేంద్రమే ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు. జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలన్నారు.
దేశానికి బీజేపీ ముప్పుగా మారిందని, ఈ ముప్పును తొలగించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని, అందుకే తాను ముఖ్యమంత్రినైనా ఒక కార్యకర్తగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చానని రేవంత్ తెలిపారు. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా పార్టీ పిలుపునిస్తే పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అదానీ స్కామ్‌పై బీఆర్ఎస్ నేతలుఎందుకు మాట్లాడ్తలే? అదానీ వ్యవహారంలో ఇంత పెద్ద కుంభకోణం జరిగితే బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని, బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదని సీఎం రేవంత్ నిలదీశారు. ‘‘వాళ్లు బీజేపీలో విలీనమైతరో, మలినమైతరో మాకు సంబంధం లేదు.
కానీ, బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడంలేదో సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘అక్కరకు వచ్చే, అక్కరకు రాని ప్రతి చిన్న, చిల్లర విషయాలపై ట్విట్లర్లో స్పందించే ట్విట్టర్ టిల్లు కేటీఆర్... ఈ దోపిడీపై ఎందుకు మాట్లాడడం లేదు. దేశ సంపదను దోచుకుంటున్న బీజేపీకి బీఆర్‌ఎస్ అనుకూలం అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది” అని ప్రశ్నించారు. ఈ స్కామ్‌లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ( జేపీసీ )ని నియమించే విషయంలో బీఆర్‌ఎస్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పదేండ్లపాటు తెలంగాణ తల్లి గుర్తుకురాలేదా?
సెక్రటేరియెట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని పదేండ్లు బీఆర్ఎస్కు ఎందుకు గుర్తుకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘పదేండ్ల పాటు పాలించిన తర్వాత ఉద్యోగం ఊడినంకా, ఇక్కడి ప్రజలు వంగబెట్టి దంచిన తర్వాత ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ప్రజలకేమో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ నేతలు పైకి చెప్తున్నా.. భవిష్యత్తుల్లో కేసీఆర్ విగ్రహం పెట్టాలన్నదే వారి ఆలోచన.
పొద్దంతా ఫామ్ హౌస్ లో తాగి బొర్లే వారి విగ్రహం పెడితే అక్కడికి వచ్చే వారికి ఎలా ఉంటుంది” అని అన్నారు. తాము సెక్రటేరియెట్ లోపల డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం పెడ్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు మాట్లాడటం ఏమిటని బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ దోపిడీ దొంగలను ఊర్లలోకి ఎందుకు రానిస్తున్నరు?
‘‘బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకుని రైతులు రోడ్డెక్కొద్దు. ఈ ప్రభుత్వం ఉన్నదే మీ కోసం, మీ సమస్యలను పరిష్కారం కోసం” అని రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘పదేండ్లలో మీరు ఇచ్చింది ఎంత, పది నెలల్లో మేం ఇచ్చింది ఎంత. అమరవీరుల స్తూపం వద్ద చర్చకు సిద్ధమా?’’ అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
అక్కడికి రైతులు కూడా వస్తే వారికి తమ ప్రభుత్వం చేసిందేమిటో వివరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తాము రైతు రుణమాఫీ చేస్తే.. బీఆర్ఎస్ నేతలు మాత్రం రైతులను రెచ్చగొడ్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను రైతులకు ఒక్కటే చెప్పదలుచుకున్నా.. ఏ రైతుకైతే రుణమాఫీ కాలేదో, లేక వారికి ఇంకా ఏ సమస్య ఉన్నా కలెక్టరేట్లకు వెళ్లండి. లేదా వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లండి. మిమ్మల్ని కూర్చోబెట్టి అన్ని సమస్యలు పరిష్కరించేందుకు అక్కడ అధికారులు ఉన్నారు. ప్రజా పాలనలో పొద్దున లేస్తే వేలాది మందిని కలుస్తున్నాం... వారానికి రెండుసార్లు ప్రగతి భవన్లో ప్రజల సమస్యలను వింటున్నాం.. ఈ ప్రభుత్వం ఉన్నదే మీ కోసం, అలాంటిది బీఆర్ఎస్ సన్నాసుల మాటలు నమ్మి మోసపోవద్దు” అని అన్నారు.
‘‘ఈ ప్రభుత్వ మీ మాట వింటుంది, మీ సమస్యలను పరిష్కరిస్తుంది” అని రైతులకు భరోసా ఇచ్చారు. ‘‘గత పదేండ్లుగా కాకి, గద్దల లెక్క మీ రక్త మాంసాలను పీల్చి, పిప్పి చేసిందే.. ఈ దోపిడీ దొంగలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులే.. ఈ దోపిడీ దొంగలే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది. ఆరు నెలల కింద మీరే కదా వీళ్లని బొందపెట్టింది.. మరి మళ్లీ వాళ్లను మీ గ్రామాల్లోకి ఎట్ల రానిస్తరు?” అని రైతులను అడిగారు. ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తదో అని హరీశ్‌రావు తప్పించుకునేందుకు సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు వస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్లు కూడా మిగలవని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఈడీ ఆఫీసులో వినతి పత్రం
ధర్నా ముగిసిన అనంతరం ఈడీ ఆఫీసుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. సంబంధిత శాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చారు. వెంటనే జేపీసీ వేసి అదానీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు.
జేపీసీ వేసేదాకా పోరు: మున్షీ, ఖుర్షీద్
అదానీ కుంభకోణం బయటకు రావాలంటే జేపీసీ వేయడమే ఒక్కటే మార్గమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. మోదీ తీరు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమవుతున్నదని మండిపడ్డారు. లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ డిమాండ్ చేసినట్లుగా జేపీసీ వేయాలని, అప్పటి వరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
అదానీ దోచుకున్న ఆస్తులు దేశ ప్రజలకు చెందే వరకు ఉద్యమం: భట్టి
అదానీ దోచుకున్న ఆస్తులు దేశ ప్రజలకు చెందే వరకు, జేపీసీ వేసేవరకు ఆందోళన కొనసాగుతుంద ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. ‘దేశం కోసం, దేశ ప్రజల ఆస్తులు కాపాడడానికి ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం ఉన్నతమైనది. ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకు చెందాలని రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున గత కొద్ది సంవత్సరాలుగా పోరాటం చేస్తు న్నారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రధాని మోదీ.. అదానీలాంటి వాళ్లకు ఈ దేశ సంపదను ఎలా దోచిపెడుతున్నాడో వివరించారు. సెబీ అంటేనే దేశ సంపదను కాపాడాల్సిన సంస్థ, కానీ సెబీ చైర్మన్ అవినీతికి పాల్పడటం అనేది చాలా దారుణమన్నారు. ఈ దేశ సంపద దోపిడీకి గురికాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అని పేర్కొన్నారు.
తాతముత్తాతలు దిగివచ్చినా రాజీవ్ విగ్రహాన్ని తాకలేరు
సెక్రటేరియెట్ ముందు ఏర్పాటు చేసే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, వాళ్లకు తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని.. వాళ్ల తాత, ముత్తాత లు దిగొచ్చినా రాజీవ్ విగ్రహాన్ని ఏం చేయలేర ని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిం చారు. ‘‘రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండే అయిత ది. అలాకాకుంటే నా పేరునే మార్చుకుంట” అని అన్నారు. ‘‘ఆషామాషీగా..అల్లాటప్ప మను షులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తలేరు.. లక్ష లాది మంది కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచన నుం చి పుట్టుకొచ్చిందే ఈ విగ్రహ ఏర్పాటు.
ఈ విగ్ర హాన్ని ఎవడు తొలగిస్తడో రావాలి.. తారీఖు చెప్పాలి” అని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించా రు. ‘‘ఇటు పక్కన అమరవీరుల స్థూపం.. అటు రాష్ట్ర పరిపాలన కు నిలయమైన సెక్రటేరియెట్, ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహన్ని ఏర్పాటు చేస్తున్నం. అటు వైపు అంబేద్కర్ విగ్రహం, ఇంకో వైపు ఇందిరా గాంధీ విగ్రహం, మరో వైపు పీవీ నర్సింహారావు విగ్రహం ఉన్నాయి. ఇక అక్కడ లేనిదే ఒక్క రాజీవ్ విగ్రహమే. నెక్లెస్ రోడ్డుకు వచ్చే లక్షలాది మందికి రాజీవ్ విగ్రహం కనిపిస్తే ఆయన స్ఫూర్తిగా నిలుస్తారు. ఆయన విధానా లు ఈ తెలంగాణకు స్ఫూర్తినిస్తాయి” అని సీఎం తెలిపారు.
జేపీసీతోనే నిజాలు: వివేక్
అదానీ అక్రమాలు బయటపడాలంటే జేపీసీని వేయాల్సిందేనని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. సెబీ చైర్‌పర్సన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ‘‘హిండెన్ బర్గ్ రిపోర్టు ద్వారా అదానీ కుంభకోణంలో స్పష్టత వచ్చింది. అదానీ కంపెనీతో సెబీ చైర్‌పర్సన్‌కు లావాదేవీలు జరిగినట్లు తెలుస్తున్నది. మారిషస్ నుంచి వచ్చిన పెట్టుబడులపై కూడా దర్యాప్తు చేయాల్సిందే” అని పేర్కొన్నారు. అదానీ షేర్ల కృత్రిమ పెంపుపైనా విచారణకు జేపీసీ వేయాల్సిందేనన్నారు. అదానీ కంపెనీలపై మోదీ సర్కార్ కు ఎందుకంత ప్రేమ అని ఆయన ప్రశ్నించారు.
అవినీతికి పెద్దన్నగా మోదీవ్యవహరిస్తున్నారు: పొన్నం
అవినీతికి పెద్దన్నగా నరేంద్ర మోదీ వ్యవహరిస్తు న్నారని, మోదీ ఆదానీల స్నేహంతో అప్రజాస్వామి కంగా దేశ సంపదను కొల్లగొడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అదానీ అక్రమ ఆస్తులపై జాయింట్ పార్లమెంటనీ కమిటీ వేసి విచారణ జరిపించాలన్నారు.
పార్లమెంట్ లో తమ నాయకుడు రాహుల్ గాంధీ అదానీ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. అదానీ అక్రమాల పై జేపీసీ వేస్తే ఇబ్బంది ఏముంది.. అదానీ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలి.. లేదంటే ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందన్నారు. అదానీ ఆస్తులు అమాంతం పెరగడానికి మోదీయే కారణమని ఆరోపించారు.
దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు: జూపల్లి
దేశ సంపదను మోదీ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మోదీ సర్కార్ ఎన్నో ఘోరాలు చేస్తుందని మండిపడ్డారు. ఆదానీ ఆస్తులు అమాంతం పెరగడానికి మోదీయే కారణమని, కనుక ఆ నిజానిజాలు బయటికి రావాలంటే జేపీసీ వేయాల్సిందేనని అన్నారు.
దేశ సంపదను దోచుకున్నది ఎవరైనా.. తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత మనదేనన్నారు. దేశ ప్రధాని అంటే దేశ ప్రజలను రక్షించాలని, దేశ సంపదను పెంచాలని, ఆలాగే కాపాడాలన్నారు. దేశ ప్రధాని కులాల పేరుతో మతాల పేరుతో పాలిస్తున్నారని, రాజకీయాన్ని మోదీ భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.
జేపీసీ వేయాల్సిందే: మంత్రి ఉత్తమ్
అదానీ కంపెనీలపై సరిగ్గా విచారణ జరగాలంటే జేపీసీ వేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే సెబీ చైర్మన్‌ను తొలగించాలన్నారు. అదానీ గ్రూప్‌పై సుప్రీం కోర్టులో కేసు వేస్తే సెబీ నివేదిక ఇవ్వాలని కేంద్రం డైరెక్షన్ ఇచ్చిందని, మదాబీ పూరి బచ్ సెబీ చైర్మన్‌గా ఉండి అదానీకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిందని మంత్రి అన్నారు. ‘కోట్లాది మంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతారు. సెబీ స్టాక్ మార్కెట్లను చూసుకుంటుoది.
సెబీ చైర్మన్‌ను మోదీ నియమించారు. అదానీ గ్రూప్‌లో సెబీ చైర్మన్, ఆమె భర్త కూడా ఇన్వెస్ట్ చేశారు. అదానీ కంపెనీలో అక్రమాలు లేవనీ సెబీ నివేదిక ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనేక ప్రాజెక్టులు అదానీ గ్రూప్‌కి మోదీ కట్టబెట్టారు. పోర్టులూ, ఎయిర్‌పోర్టులు, అన్ని రకాల ఆదాయాలు వచ్చే ప్రాజెక్టులను అదానీకి అప్పగించారు. సెబీ చైర్మన్.. అదానీతో కుమ్మక్కయ్యారు’ అని ఆరోపించారు. కృత్రిమంగా షేర్ల విలువను పెంచి అదానీకి అనుకూలంగా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.
సెబీ చైర్మన్‌ను తప్పించాలి: మంత్రి శ్రీధర్ బాబు
మోదీ.. అదానీ కలిసి చేస్తున్న అవినీతి యావత్ దేశం అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయని, సెబీ చైర్మన్‌ను వెంటనే విధుల నుంచి తప్పించాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. అదానీ ఆస్తులు అక్రమంగా పెంచ డంపై న్యాయవిచారణ జరగాలని, అదానీ వ్యవ హారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలన్నారు.
బీజేపీ.. అదానీ గ్రూప్ కంపెనీలను కాపాడుతోంది: పొంగులేటి
మోదీ ప్రభుత్వం, బీజేపీ దొంగ చాటుగా అదానీ గ్రూపును కాపాడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సెబీ చైర్మన్కుటుంబ సభ్యులకు అదానీ గ్రూపులో వాటాలు ఉన్నా యన్నారు . అలాంటి వారితోనే న్యాయ విచారణ కు ఆదేశిస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయ ని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్టు జేపీసీ వేయాలని, బీజేపీ విచారణను సెబీకి కాకుండా జేపీసీకి ఇవ్వాలన్నారు.
అదానీ, అంబానీలనే ధనికులుగా మార్చుతున్న మోదీ: మంత్రి వెంకట్ రెడ్డి
అదానీ, ఆంబానీ లాంటి ధనికులనే ధనికులుగా చేస్తున్నారు తప్ప, పేదోడికి మోదీ చేసిందేమిలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మోదీ నల్లధనం తెస్తానని.. పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తానని చెప్పి 15 పైసలు కూడా వేయలేదని ఆరోపించారు. అదానీని మాత్రం మోదీ ప్రపంచంలోనే ధనవంతులు జాబితాలో చేర్చాడన్నారు.
మోదీ చేసే అక్రమాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాహుల్ ప్రధాని కావడమే లక్ష్యంగా పనిచేద్దామని, లేదంటే మోదీ ఈ దేశాన్ని నలుగురి చేతిలో పెట్టి నాశనం చేస్తారని హెచ్చరించారు.
ప్రజాసంపదను అదానీకి అప్పగించారు: సీతక్క
మోదీ ప్రభుత్వం ప్రజల సంపదను అదానీకి అప్పజెప్పారని మంత్రి సీతక్క ఆరోపించారు. పార్లమెంట్లో మాట్లాడితే ఈడీలను పంపిస్తా మని బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. సెబీ అక్రమాలకు అడ్డాగా మారిందని, ఈడీ మాత్రం కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ‘సెబీపై జేపీసీ వేయాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు.. మోదీ తప్పులను ప్రశ్నించినందుకు రాహుల్‌ను నిర్ధాక్షి ణ్యంగా ఆయనకు కేటాయించిన ఇంటి నుంచి ఖాళీ చేయించారు. అదానీ అక్రమాలపై జేపీసీ వేయాల్సిందే’ అని ఆమె డిమాండ్ చేశారు.