ఢిల్లీలో దీక్ష చేస్తా: నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీలో దీక్ష చేస్తా: నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్ రెడ్డి
  • కేంద్రం నుంచి నిధులు రావద్దని బీఆర్ఎస్ చూస్తోంది
  • రైతులు బాధ పడ్తుండ్రంటే ఆ ముగ్గురు డ్యాన్సలేస్తుండ్రు
  • 36 సార్లు కాదు 99 సార్లైనా ఢిల్లీ వెళ్తా
  • కేసీఆర్ ను బండకేసి కొట్టి ఓడించిందే నేను 
  • ఫాంహౌస్ లో కుసోని మందు తాగడం కేసీఆర్ స్ట్రేచరా?
  • బీఆర్ఎస్  కు రాష్ట్రంతో సంబంధం లేదు
  • అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
  • చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, కేంద్రం  నిధులు ఇవ్వకుంటే అవసరమైతే ఢిల్లీలో ఆమరణ దీక్షకు సైతం సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను 36 సార్లు ఢిల్లీ వెళ్లానని లెక్కలు వేస్తున్నారని,  కేంద్రం నుంచి  నిధులు,  ప్రాజెక్టులు సాధించేందుకు  99 సార్లయినా వెళ్తానని అన్నారు. కేంద్రం నుంచి నిధులు రావద్దని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ చూస్తున్‌నారని,  రాష్ట్రంలో రైతులు బాధపడుతుంటే  ఈ ముగ్గురు తీన్మార్ డ్యాన్సులు వేస్తుండ్రని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను బండకేసీ కొట్టి ఓడించిందే తానని, కేటీఆర్ మాట్లాడితే స్ట్రేచర్ అంటున్నారని, డ్రగ్స్ పార్టీలో దొరకడం స్ట్రేచరా అని ప్రశ్నించారు. ఫాంహౌస్ లో కూర్చోని మందు తాగడం స్ట్రేచరా? అని ప్రశ్నించారు. 

కేసీఆర్ తమకు 7 లక్షల 11 వేల కోట్లు అప్పగించి పోయాడని వాటికి వడ్డీలు కట్టేందుకే తమ నడ్డి విరుగుతోందని అన్నారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ సమస్యలన్నింటికీ కేసీఆర్ కారణమని అన్నారు. ప్రగతి భవన్ కు జగన్ ను పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టింది కేసీఆర్ యే కాదా..? అని ప్రశ్నించారు.  రోజమ్మ చేపల పులుసు తిని ఇరిగేషన్ సమస్యలు తెచ్చిపెట్టారని ఆరోపించారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో హరీశ్ రావు దగ్గరుండి బీజేపీకి ఓట్లు వేయించారని ఆరోపించారు. 

అందుకే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో రాష్ట్రానికి సంబంధం లేదని, ఎన్నికల్లో పోటీ చేయని పార్టీకి ఏం సంబంధమన్నారు. తాము చేపట్టిన కులగణన సత్ఫలితాలను ఇచ్చిందని భావిస్తున్నామని, అన్ని పార్టీలు బీసీలకు  ప్రాధాన్యం ఇస్తున్నాయనేందుకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికే నిదర్శనమని అన్నారు.  కేసీఆర్ హయాంలో ఐదు నెలల పాటు సీఎం ఒక్కరే తప్ప మంత్రులెవరూ లేరని, అప్పుడెవరూ క్యాబినెట్ విస్తరణ గురించి ఆడగలేదని అన్నారు. తాము తప్పక మంత్రి వర్గ విస్తరణ చేస్తామని అన్నారు.  
 
కిషన్ రెడ్డితో చర్చకు రెడీ

కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చింది..? తెలంగాణ కేంద్రానికి పన్నుల రూపంలో ఎంత ఇచ్చిందనే అంశంపై కిషన్ రెడ్డితో చర్చించేందుకు తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిద్ధమని సీఎం అన్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్  హైదరాబాద్ వచ్చి సమీక్ష చస్తే సికింద్రాబాద్ లోనే ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు రాలేదని సీఎం ప్రశ్నించారు. తర్వాత కూడా మీటింగ్ అంశాలేమిటనే విషయాన్ని తెలసుకోలేదని అన్నారు.