వ్యవసాయం పండుగ.. రాజకీయం కాదు రైతు ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్  రెడ్డి

వ్యవసాయం పండుగ.. రాజకీయం కాదు రైతు ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్  రెడ్డి
  • రాజకీయం కాదు రైతు ప్రయోజనాలే ముఖ్యం
  • రుణమాఫీతో మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నం
  • ఇవాళ్టితో 12224.98 కోట్లు రుణాలు మాఫీ చేసినం
  • కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుజువు చేశాం
  • నెహ్రూ నుంచి శాస్త్రి వరకు ఆహార, దేశభద్రతకే ప్రాధాన్యం ఇచ్చారు
  • ఆగస్టు నెలలో రూ. 2లక్షల లోపు రుణాలన్నీ మాఫీ అవుతయ్
  • గత ప్రభుత్వం  రాష్ట్రాన్ని తాకట్టు పెట్టింది
  • ఆ మిత్తి కింద ఇప్పటిదాకా 43 వేల కోట్లు కట్టినం
  • అన్న పథకాలు అమలు చేస్తూనే రుణమాఫీ 
  • రెండో విడుత రుణమాఫీ సభలో సీఎం రేవంత్  రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం పండుగని నిరూపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవని, తమకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమం కాదని,  రైతుల ప్రయోజనాలే  మా విధానమని సీఎం చెప్పారు. నెహ్రూ నుంచి శాస్త్రి వరకు ఆహార, దేశ భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. అక్కడి నుంచే జై జవాన్.. జై కిసాన్ అనే నినాదం వచ్చిందని గుర్తు చేశారు. ఈ దేశంలో మోదీ ప్రభుత్వం  కార్పొరేట్ సంస్థలు 14 లక్షల కోట్ల రూపాయల బ్యాంకులకు ఎగవేశాయని గుర్తు చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులు ఆ పనిచేయరని అన్నారు.

అప్పుల పాలైనా వ్యవసాయం వదలరని చెప్పారు. తెచ్చిన అప్పులు కట్టలేకపోతే తన పొలం దగ్గరికి పోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చే సుకుంటారని అన్నారు. వాళ్లకు అండగా నిలబడి ధైర్యం చెప్పడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రైతులు ఆనందంగా ఉండాలని, సంక్షోభంలో కూరుకుపోవద్దని ఆ నాడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రైతు డిక్లరేషన్ ప్రకటించామని, దానిని తూచా తప్పకుండా అమలుచేస్తున్నామని చెప్పారు.

also read : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు...

కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనమవుతుందని అన్నారు. గత ప్రభుత్వం పదేండ్లు పాలించి రూ. లక్ష రుణమాఫీ చేయలేకపోయిందని అన్నారు. తమకు చిత్తశుద్ది ఉన్నందునే సంకల్పాన్ని నెరవేర్చామని చెప్పారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ రాష్ట్రంలో రుణమాఫీ సాధ్యం కాదని చాలా మంది శాపనార్థాలు పెట్టారని గుర్తు చేశారు. మాటా తప్పుతామని చాలా మంది అన్నారని కానీ ఇదీ మా చిత్తశుద్ధి అని నిరూపించామని చెప్పారు. జులై 18 నాడు మొదటి విడతలో లక్ష లోపు రుణాలున్న వారి లోన్లు మాఫీ చేశామని, ఇవాళ లక్షన్నర లోపు బాకీ ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశామని చెప్పారు.
 

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్

గత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఆయన చేసిన అప్పులకు వడ్డీ కింద ఇప్పటి వరకు  43 వేల కోట్ల వడ్డీ కట్టామని సీఎం చెప్పారు. దీంతో ప్రతి నెలా మొదటి తారీఖున జీతాలు, పించన్లు ఇస్తున్నామని అన్నారు. వీటితోపాటు రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నామని, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి ఇవ్వడంతోపాటు అంగన్ వాడీల నుంచి ఆశవర్కర్ల వరకు జీతాలు సకాలంలో చెల్లిస్తున్నామని చెప్పారు.

అప్పుల రాష్ట్రంలో ఇవన్నీ ఇస్తూనే 12,500 కోట్ల రూపాయల రుణమాఫీకి సర్దిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను, అధికారులను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు చెప్పారు. ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగినదని, ఆ నెలలో రైతుల రుణాలు పూర్తిగా తీరిపోతాయని చెప్పారు. 77 ఏండ్ల స్వాతంత్ర్య భారతంలో ఏ రాష్ట్రం కూడా 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేయలేదని, తాము మాత్రమే చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన మంత్రివర్గ సహచరులు, అధికారులకు సీఎం పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు .

ఇప్పటి వరకు మొత్తం:  17,75,235 మంది రైతులు
మాఫీ మొత్తం:     12,224.98 కోట్లు

మొదటి విడుత రైతు రుణమాఫీ:11,34,412 మంది రైతులు

మాఫీ మొత్తం:    6,034.96 కోట్లు

రెండో విడుత: 6,40,823 మంది రైతులు

రైతు రుణమాఫీ: 6,190.01 కోట్లు